సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ ఫస్ట్ లుక్ రిలీజ్
జనవరి 3, 2026 Published by Srinivas

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న చైతన్య రావు మాదాడి కథానాయకుడిగా, వెర్సటైల్ దర్శకుడు కె. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్ అధికారికంగా ప్రేక్షకుల ముందుకు అడుగుపెట్టింది. శ్రియాస్ చిత్రాస్, ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్లపై పూర్ణ నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేయగా, చిత్ర యూనిట్‌ను ఆయన అభినందించారు. ఈ లాంచ్‌తోనే సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి గణనీయంగా పెరిగింది.
భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాల మధ్య తలెత్తే సంఘర్షణలను నేటి తరం కోణంలో చూపించే ట్రెండింగ్ డ్రామాగా ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు క్రాంతి మాధవ్‌కు ఇది ఆయన ఇప్పటివరకు చేసిన భావోద్వేగాత్మక ప్రయాణానికి సహజమైన కొనసాగింపుగా నిలుస్తోంది. ఆయన తెరకెక్కించిన ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలు ప్రేమ, అంతర్గత సంఘర్షణలు, భావోద్వేగాల లోతును ఎంత నిజాయితీగా చూపించాయో తెలిసిందే. అదే బాటలో, ఈసారి ప్రేమ, మోహం, వైఫల్యం, సానిహిత్యం, ఆత్మగౌరవం వంటి అంశాలను మరింత సమకాలీనంగా ఆవిష్కరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
ఈ చిత్రంలో ఇరా, సఖి, జెస్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, మణి చందన, ప్రమోదిని, వీర శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా నేచురాలిటీకి ప్రాధాన్యం ఇస్తూ, ఓవర్ డ్రామా లేకుండా కథనం సాగాలనే ఉద్దేశంతో నటీనటుల ఎంపికలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ విషయానికి వస్తే… బట్టలు లేకుండా సొఫాలో కూర్చున్న చైతన్య రావు, రగ్డ్ లుక్‌తో గంభీరంగా కెమెరా వైపు చూస్తూ కనిపిస్తాడు. వెనుక నుంచి వచ్చే ప్రొజెక్టర్ లైటింగ్, అతని చూపుల్లోని ఇంటెన్సిటీ పాత్రలోని అంతర్గత సంఘర్షణను బలంగా ప్రతిబింబిస్తుంది. కథను ప్రత్యక్షంగా చెప్పకుండా, పాత్రలు తమ నిజాన్ని వెతుక్కుంటూ సాగే ప్రయాణానికి సంకేతంగా ఈ విజువల్ నిలుస్తోంది. ఇది క్రాంతి మాధవ్ సినిమాల శైలికి దగ్గరగా ఉండే భావోద్వేగ నిజాయితీని స్పష్టంగా చాటుతోంది.
సాంకేతికంగా కూడా సినిమా బలమైన టీమ్‌ను కలిగి ఉంది. పి.జి. విందా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఫణి కళ్యాణ్ సంగీతం సమకూరుస్తున్నారు. రా-షా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, చిన్నా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ధని ఏలే పబ్లిసిటీ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. స్టార్ సర్కిల్ డిజిటల్ మార్కెటింగ్, ఎస్.కె. నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) పీఆర్ బాధ్యతలు చూసుకుంటున్నారు. శ్రీకాంత్ వి సహ నిర్మాతగా ఉన్నారు.
యువతను దృష్టిలో పెట్టుకుని, లోతైన భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా తెరకెక్కుతున్న ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ ఆధునిక సంబంధాలను ఎలాంటి ఫిల్టర్ లేకుండా, నిజాయితీగా చూపించాలనే లక్ష్యంతో రూపొందుతోంది. ప్రేమతో పాటు భావోద్వేగాల సంక్లిష్టతను, వాటి వల్ల వచ్చే ఫలితాలను నేరుగా ప్రతిబింబిస్తూ, నేటి తెలుగు సినిమాలో సన్నిహితత్వానికి కొత్త నిర్వచనం ఇవ్వాలనే ప్రయత్నం ఇది.
దర్శకుడి స్పష్టమైన విజన్, బలమైన క్రియేటివ్ సపోర్ట్‌తో ఈ సినిమాను బాక్సాఫీస్‌కు కొత్త భాషను పరిచయం చేసే చిత్రంగా మలుస్తున్నారు. ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ 2026 సమ్మర్‌లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
