Download App

‘NGMV’ ప్రాజెక్ట్ తో… సముద్ర గర్భంలో ‘బ్రహ్మోస్’ గర్జన

ఏప్రిల్ 9, 2026 By Suresh Thota
భారత నౌకాదళ శక్తిని అపారంగా పెంచబోతున్న NGMV (Next Generation Missile Vessels) ప్రాజెక్ట్ గురించి, మరియు అందులో కీలకమైన ఒప్పందాల గురించి పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక కథనం… భారతదేశ సముద్ర తీర రక్షణను మరింత పటిష్టం చేస్తూ, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా అత్యంత శక్తివంతమైన...
'NGMV' ప్రాజెక్ట్ తో… సముద్ర గర్భంలో 'బ్రహ్మోస్' గర్జన

భారత నౌకాదళ శక్తిని అపారంగా పెంచబోతున్న NGMV (Next Generation Missile Vessels) ప్రాజెక్ట్ గురించి, మరియు అందులో కీలకమైన ఒప్పందాల గురించి పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక కథనం…

భారతదేశ సముద్ర తీర రక్షణను మరింత పటిష్టం చేస్తూ, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా అత్యంత శక్తివంతమైన ‘నెక్స్ట్ జనరేషన్ మిస్సైల్ వెసెల్స్’ (NGMV) సిద్ధమవుతున్నాయి. అత్యాధునిక సాంకేతికత, అజేయమైన వేగం మరియు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ‘బ్రహ్మోస్’ క్షిపణులతో రూపుదిద్దుకుంటున్న ఈ నౌకలు ‘మేక్ ఇన్ ఇండియా’ రక్షణ రంగంలో ఒక మైలురాయిగా నిలవబోతున్నాయి.

ఈ ప్రాజెక్టు గమనాన్ని నిశితంగా పరిశీలించి చూస్తే… భారత్ రక్షణ రంగంలో అందులోనూ అపారమైన సముద్ర తీరం ఉన్న, మన దేశ భద్రత కోసం నావికారంగాన్ని ఎంత పటిష్ట పరుస్తూ, ఎంత వేగంగా అడుగులు వేస్తుందో అర్థమవుతుంది.

2023 ​మార్చి 30 వ తేదీన, భారత రక్షణ మంత్రిత్వ శాఖ మరియు కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. సుమారు ₹9,805 కోట్ల వ్యయంతో 6 అత్యాధునిక క్షిపణి నౌకల నిర్మాణానికి అంగీకారం కుదిరింది.

డిసెంబర్ 16, 2024 న మొదటి NGMV నౌక నిర్మాణానికి చిహ్నంగా ‘స్టీల్ కటింగ్’ వేడుకను నిర్వహించారు. ఇది నౌక నిర్మాణ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తారు. ఇది మొదటి అడుగు.

ఏప్రిల్ 8, 2026 న, నౌకల వేగాన్ని పెంచే అత్యంత కీలకమైన ‘ప్రొపల్షన్ సిస్టమ్స్’ కోసం “నార్వే” కు చెందిన “కాంగ్స్‌బర్గ్ మారిటైమ్” సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ 18 భారీ Kamewa వాటర్ జెట్లను సరఫరా చేయనుంది. ప్రస్తుతం మన నావికాదళ అధికారుల అంచనా ప్రకారం….​ మార్చి నెల 2027 లో ఈ ప్రాజెక్టు మొదటి యుద్ధ నౌక భారత నౌకాదళానికి అందజేయబడుతుంది అని అంటున్నారు.

'NGMV' ప్రాజెక్ట్ తో… సముద్ర గర్భంలో 'బ్రహ్మోస్' గర్జన

ఈ NGMV కలిగిన నౌక లు సాధారణ యుద్ధ నౌకలు కావు, ఇవి సముద్రంపై మెరుపు దాడులు చేయగల “లిటిల్ జెయింట్స్”. అత్యంత వేగం దీని సొంతం…​ “కాంగ్స్‌బర్గ్” అందించే శక్తివంతమైన వాటర్ జెట్ల సాయంతో ఈ నౌకలు గంటకు 65 కిలోమీటర్ల (35 నాటికల్ మైళ్లు) వేగంతో ప్రయాణించగలవు. సముద్రం లో అత్యంత వేగంగా మలుపులు తిరుగుతూ శత్రువుల ను ముప్పుతిప్పలు పెట్టగలవు.

“​స్టెల్త్ టెక్నాలజీ” తో వీటిని తయారు చేస్తున్నారు. ఈ నౌకల డిజైన్ శత్రువుల రాడార్ల కళ్ళు కప్పేలా ఉంటుంది. రాడార్ కిరణాలను పక్కకు మళ్లించడం ద్వారా, ఇవి సముద్రంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించడం శత్రువుకు దాదాపు అసాధ్యం.

బ్రహ్మోస్ అస్త్రం ను సముద్ర ఉపరితలం నుండి ప్రయోగించవచ్చు. ప్రతి నౌకలోనూ 8 బ్రహ్మోస్ (BrahMos) సూపర్ సోనిక్ క్షిపణులు ఉంటాయి. మాక్ (Mach ) 2.8 వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణులు 450 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఇట్టే ధ్వంసం చేయగలవు. దీనికి ‘ఫైర్ అండ్ ఫర్గెట్’ సామర్థ్యం ఉండటం వల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మిస్సైల్‌గా పేరుగాంచింది. అంటే మిస్సైల్‌ను ఫైర్ చేసినవెంటనే లాంచర్ ప్లాట్‌ఫాం (భూమి పై లాంచర్, షిప్, లేదా విమానం) దాన్ని మళ్లీ గైడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మిస్సైల్‌లో ఉన్న ఇన్సర్షియల్ నావిగేషన్, GPS, రాడార్/హోమింగ్ సెన్సర్ లాంటి సిస్టమ్‌లు దానిని టార్గెట్ వైపు తీసుకుపోతాయి.

​​ప్రస్తుతం వాడుకలో ఉన్న పాత ‘వీర్ క్లాస్’ నౌకల స్థానంలో ఈ NGMVలు చేరనున్నాయి. చిన్నవిగా ఉండి, అత్యంత భారీ విధ్వంసాన్ని సృష్టించగల ఈ నౌకలు భారత సముద్ర సరిహద్దులకు రక్షణ కవచంలా మారబోతున్నాయి. కేవలం రక్షణ కోసమే కాకుండా, సముద్రంలో శత్రు దేశాల భారీ విమాన వాహక నౌకలను సైతం ముంచేయగల సామర్థ్యం ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌కు లభించనుంది.

స్వదేశీ పరిజ్ఞానం, అంతర్జాతీయ సహకారంతో తయారవుతున్న ఈ “నెక్స్ట్ జనరేషన్ మిస్సైల్ వెసెల్స్” నవ భారత రక్షణ సత్తాకు నిదర్శనం. సముద్ర గర్భంలో భారత్ ఇకపై మరింత శక్తివంతంగా గర్జించబోతోంది.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading