వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరత… వ్యవస్థలో లోపమా…? కృత్రిమ సృష్టి నా…?

Published by
Suresh Thota

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి రోజుల్లో తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరత నిజమేనా…? ఇంధనం లేని దేశం కాదు మనది, కానీ సకాలంలో ప్రజలకు అందించలేని పంపిణీ వ్యవస్థ ది మాత్రమే ఈ లోపంలా కనపడుతుంది. రిఫైనరీలు పనిచేస్తున్నాయి, దిగుమతులు కొనసాగుతున్నాయి, నిల్వలు సరిపడానే ఉన్నాయి. అయినప్పటికీ బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు, కిలోమీటర్ల క్యూలు కనిపించడం దీనికి సంకేతం. సమస్య పంపిణీలోనే ఉంది.

చమురు సంస్థలు (IOC, HPCL, BPCL) సరఫరాను తగ్గించాయా… అంటే… అవునని కొన్ని రహస్య నివేదికలు ప్రభుత్వానికి తెలిపినట్టుగా తెలుస్తుంది. కొన్ని బ్యాంకుల్లో కొన్ని రోజులు డబ్బు కట్టడానికి వెసులుబాటు కల్పించేవి కొన్ని సంస్థలు. ఇప్పుడు ఆ పద్ధతి రద్దు చేసి అమౌంట్ పూర్తిగా చెల్లించితేనే అప్పుడు చమురు ట్యాంకర్లు పంపిస్తామనడంతో, పాత బకాయిలు ఉన్న బంకులకు స్టాక్ నిలిపివేయడం వలన, మిగతా పెట్రోల్ బంకుల్లో ఒత్తిడి పెరిగిపోయింది. డిమాండ్ 50% పెరగడం వల్ల సంక్షోభం మరింత సంక్లిష్టంగా అయింది. అంతర్జాతీయ ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, రవాణా సాంకేతిక సమస్యలు అంటే చమురు కంపెనీల డిపోల నుంచి బంకులకు ఇంధనం చేరవేసే ట్యాంకర్ల లభ్యత తగ్గడం ప్రధాన సమస్య. రవాణా కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపం వల్ల సకాలంలో లోడింగ్ జరగడం లేదు. డిపోల వద్ద క్యూలు, షెడ్యూల్ ఆలస్యాలు 24 నుండి 48 గంటల గ్యాప్‌ను సృష్టిస్తున్నాయి.

“కొరత వస్తుంది” అనే రూమర్స్ వల్ల ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేసి, తాత్కాలిక సమస్యను తీవ్ర సంక్షోభంగా మార్చారు. ఉదా: హైదరాబాద్‌కు రోజుకు 100 ట్యాంకర్లు వస్తున్నప్పటికీ, భయంతో బైక్‌కు ఒక వారానికి 4 లీటర్లు వాడే వ్యక్తి 10 లీటర్లు నింపుకుంటే, ప్యానిక్ బైయింగ్ వల్ల నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ రూమర్లు వల్ల మానసిక భయం పెరిగి , ఇంటిలో నీరు నిల్వ చేసుకునే డ్రమ్స్‌లో కూడా ఇంధనం నింపుకోవడం తో ఈ విపత్కర పరిస్థితులకు దారితీశాయి.

సమస్య ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, కర్నూలు, మచిలీపట్నం, రాయలసీమ, కోస్తా జిల్లాల్లో తీవ్రంగా కనిపించింది. 4510 బంకుల్లో 421 మూతపడ్డాయి, కార్లు మరియు లారీలకు 10 నుండి 50 లీటర్లు మాత్రమే లిమిట్ విధించారు. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, భైంసా, నిర్మల్‌లో ఆందోళన పెరిగింది, అయినా రోజుకు 24 వేల KL (పెట్రోల్ 9.5K, డీజిల్ 14.4K) సరఫరా కొనసాగుతోంది.

హైదరాబాద్, విజయవాడ హైవే పై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఆంధ్రలో సీఎం చంద్రబాబు ఆయిల్ కంపెనీలతో వీడియో కాన్ఫరెన్స్‌లు చేపట్టి, 10% అదనపు సరఫరాతో పాటు, టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టర్లకు పర్యవేక్షణ, నో స్టాక్ బోర్డులు ఆపమని ఆదేశాలు జారీచేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కమాండ్ సెంటర్‌లో 24/7 నిఘా కి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, పౌరసరఫరా శాఖ రూమర్లను ఖండించి టోల్‌ఫ్రీ నంబర్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్ల 24 గంటల ట్యాంకర్ రవాణా కోసం, యూనియన్లతో చర్చలు జరుగుతున్నాయి. పంపిణీ “జస్ట్-ఇన్-టైమ్” పై ఆధారపడి, బఫర్ స్టాక్ తక్కువగా ఉండటం వల్ల….. చిన్న, చిన్న అంతరాయాలు కూడా పెద్ద, పెద్ద సమస్యలు గా తయారుఅవుతున్నాయి.

కనీస బఫర్ స్టాక్ విధానం, రవాణా డైవర్సిఫికేషన్, రియల్ టైమ్ మానిటరింగ్ అవసరం. బ్లాక్ మార్కెట్‌ కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే సోషల్ మీడియాలో రూమర్స్ సృష్టించేవారి పై కూడా ప్రజల సహాయంతో చర్యలు తీసుకోవాలి.

ప్రజలు ప్యానిక్ కి గురి కాకుండా, సాధారణ రోజుల్లో ఎలా కొనుగోలు చేసేవారో అలానే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం, ప్రజలకు మీడియా ముఖంగా స్పష్టమైన సందేశాలు ఇవ్వాలి ఇంధన సంక్షోభం లేదు అని, లేకపోతే ఈ కొరత కొంతమంది కి లాభసాటి వ్యవహారం గా మారి… తద్వారా ప్రభుత్వాలే భంగపాటు కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటివి అరికట్టకపోతే, ఇంధన విషయంలో నిర్మాణాత్మక మార్పులు తీసుకురాకపోతే, ఇటువంటి సంఘటనలు పదే పదే పునరావృతమవుతుంటాయి.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.