Download App

డిజిటల్ విప్లవంలో… సామాన్యుడి గొంతుకగా “సమాధాన్ దీదీ”…

జూన్ 2, 2026 By Suresh Thota
అక్కా… ఈ లెక్క అర్ధం కావడం లేదు అంటే…. పక్కింటి అమ్మాయి కాని , కాలేజీలోని సీనియర్ గాని మనకు అర్థమయ్యేటట్లు లెక్క చెబుతారు కదా…. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా అందరికీ ఒక "అక్క"లాగ స్పందించే కృత్రిమ మేధ ను సామాన్యులకు ఉపయోగపడేటట్టుగా రూపొందించింది. దాని పేరే...
డిజిటల్ విప్లవంలో… సామాన్యుడి గొంతుకగా "సమాధాన్ దీదీ"…

అక్కా… ఈ లెక్క అర్ధం కావడం లేదు అంటే…. పక్కింటి అమ్మాయి కాని , కాలేజీలోని సీనియర్ గాని మనకు అర్థమయ్యేటట్లు లెక్క చెబుతారు కదా…. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా అందరికీ ఒక “అక్క”లాగ స్పందించే కృత్రిమ మేధ ను సామాన్యులకు ఉపయోగపడేటట్టుగా రూపొందించింది. దాని పేరే “సమాధాన్ దీదీ”.

డిజిటల్ విప్లవంలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతం అవుతుంది. అవును సామాన్యుడి గొంతుకగా “సమాధాన్ దీదీ”…. “భారతదేశం” లాంటి సువిశాల ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ సేవలు, పథకాలు ప్రతి పౌరుడికీ చేరడం ఎంత ముఖ్యమో, వాటి వల్ల వచ్చే సమస్యలను, ఫిర్యాదులను అంతే వేగంగా పరిష్కరించడం కూడా అంతే ముఖ్యం. దశాబ్దాలుగా సామాన్య పౌరుడు తన సమస్యను ఏ అధికారికి చెప్పుకోవాలో, ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు.

ఈ నేపథ్యంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా చెరిపేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను సమూలంగా మారుస్తూ సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాయిస్ చాట్‌బాట్ “సమాధాన్ దీదీ” (Samadhan Didi) ని రంగంలోకి దించింది.

నిజానికి, కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రజల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఇప్పటికే CPGRAMS (Centralised Public Grievance Redress and Monitoring System) అనే శక్తివంతమైన ఆన్‌లైన్ వ్యవస్థ ఉంది. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ (DARPG) ఆధ్వర్యంలో నడిచే ఈ ఏకైక “వేదిక” ద్వారా పౌరులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఏ మంత్రిత్వ శాఖ, విభాగం లేదా ప్రభుత్వ రంగ సంస్థలపైన అయినా నేరుగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి ఫిర్యాదుకు ఒక గడువును నిర్దేశించి, నిర్ణీత సమయంలోగా (సాధారణంగా 30 రోజుల్లోగా) అధికారులు సమస్యను పరిష్కరించేలా ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. దేశంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడంలో CPGRAMS ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది.

అయితే, ఇంతటి అద్భుతమైన వ్యవస్థ ఉన్నప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం లేని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, చదువు రాని సామాన్యులకు ఈ పోర్టల్‌ని ఉపయోగించడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఏ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి, ఏ కాలమ్‌లో ఏం రాయాలి, ఏ సమస్య ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అనే విషయాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఈ సేవలను ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ అతిపెద్ద లోటును భర్తీ చేస్తూ, డిజిటల్ అక్షరాస్యతతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడినీ CPGRAMS తో అనుసంధానించేందుకు పుట్టుకొచ్చిందే ఈ “సమాధాన్ దీదీ”.

డిజిటల్ విప్లవంలో… సామాన్యుడి గొంతుకగా "సమాధాన్ దీదీ"…

​”సమాధాన్ దీదీ” కేవలం ఒక సాధారణ చాట్‌బాట్ మాత్రమే కాదు, ఇది పౌరుల పాలిట ఒక డిజిటల్ సహాయకురాలు. దీని ప్రత్యేకత ఏమిటంటే, యూజర్లు తమ సమస్యలను కంప్యూటర్ కీబోర్డుతో టైప్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మైక్రోఫోన్ బటన్ నొక్కి, మన ఇంట్లో ఉన్నవారితో మాట్లాడినట్లుగా మన సొంత మాటల్లో, నోటి ద్వారా సమస్యను చెబితే సరిపోతుంది. భారత ప్రభుత్వ AI లాంగ్వేజ్ ప్లాట్‌ఫారమ్ “భాషిణి” (Bhashini) సాంకేతికతతో పనిచేసే ఈ చాట్‌బాట్, మీరు చెప్పే మాటలను బ్యాక్‌ఎండ్‌లో నిశితంగా విశ్లేషించి, దానిని అధికారిక ఫిర్యాదు రూపంలోకి మారుస్తుంది.

ఈ వ్యవస్థలోని అసలైన మేధస్సు ఎక్కడుందంటే… సామాన్యుడికి తన సమస్య ఏ శాఖకు చెందుతుందో తెలియకపోయినా, ఈ AI చాట్‌బాట్ ఆ బాధ్యతను తీసుకుంటుంది. ఉదాహరణకు, ఒక పౌరుడు రోడ్ల గురించో లేదా బ్యాంకింగ్ సేవల గురించో మాట్లాడితే, ఆ సమస్య ఏ మంత్రిత్వ శాఖ (Ministry) పరిధిలోకి వస్తుందో ఇది ఆటోమేటిక్‌గా గుర్తించి, ఆ విభాగానికి ఫిర్యాదును బదిలీ చేస్తుంది. ఒకవేళ యూజర్ చెప్పిన వివరాలు సరిపోకపోతే… “సమస్య ఎక్కడ ఉంది?”, “ఎప్పటి నుండి ఉంది?” అంటూ తిరిగి ప్రశ్నలు అడిగి మరీ పూర్తి సమాచారాన్ని సేకరించి, CPGRAMS పోర్టల్‌లో అధికారికంగా “గ్రీవెన్స్ ఐడీ”ని (Grievance ID) జనరేట్ చేస్తుంది.

భాషా పరమైన అడ్డంకులను పూర్తిగా తొలగించడం “సమాధాన్ దీదీ” లోని మరో గొప్ప విశేషం. భారత రాజ్యాంగం గుర్తించిన తెలుగుతో సహా 22 అధికారిక భాషలను ఇది సపోర్ట్ చేస్తుంది. పల్లెటూరి పౌరుడు తన మాతృభాషలో ఫిర్యాదు చేసినా కూడా ఈ AI చాట్‌బాట్ సులభంగా అర్థం చేసుకోగలదు. భవిష్యత్తులో స్థానిక మాండలికాలను, మరికొన్ని ప్రాంతీయ భాషలను కూడా ఇందులో చేర్చనున్నారు. అంతేకాకుండా, ఫిర్యాదు నమోదు అయ్యాక, “నా సమస్య ఎంతవరకు వచ్చింది…?” అని చాట్‌బాట్‌ను అడిగితే, క్షణాల వ్యవధిలో ప్రస్తుత స్టేటస్‌ను వెతికి మరీ వినిపిస్తుంది. ఒకవేళ వచ్చిన పరిష్కారం సంతృప్తికరంగా లేకపోతే పైఅధికారికి అప్పీల్ చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది.

సాంకేతికత అనేది కేవలం చదువుకున్న వారికే పరిమితం కాకుండా, సమాజంలో కడపటి వరుసలో ఉన్న సామాన్యుడికి కూడా పాలకుల తలుపు తట్టే హక్కును, అవకాశాన్ని కల్పించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యానికి సార్థకత చేకూరుతుంది. CPGRAMS యొక్క పటిష్టతను, “సమాధాన్ దీదీ” యొక్క AI చాతుర్యాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన (Good Governance) లో ఒక సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పిస్తూ, సామాన్యుడి చేతిలోని మొబైల్‌నే ఒక శక్తివంతమైన ప్రజా వేదికగా మార్చిన ఈ “డిజిటల్ దీదీ” భవిష్యత్తులో, ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది కానుంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading