Download App

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు.. 9 సార్లు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు

జూలై 26, 2026 By Rahul N
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు రావడంతో ఆయనను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు గంటల పాటు శ్రమించి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత,...
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు.. 9 సార్లు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు రావడంతో ఆయనను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు గంటల పాటు శ్రమించి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆదివారం ఉదయం తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ మమత రెడ్డి నేతృత్వంలోని బృందం ఉదయం 8 గంటల నుంచి నిర్విరామంగా చికిత్స అందించింది. గుండె స్పందన పలుమార్లు ఆగిపోవడంతో ఆయనకు తొమ్మిది సార్లు సీపీఆర్ (CPR) నిర్వహించారు. చివరకు తొమ్మిదో ప్రయత్నంలో గుండె లయ తిరిగి రావడంతో వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడగలిగారు.

ఈ ఘటనను “నిజంగా ఇది మెడికల్ మిరాకిల్” అని డాక్టర్ మమత రెడ్డి పేర్కొన్నారు. ఆమెతో పాటు వైద్య బృందం చేసిన కృషిని ఆసుపత్రికి చేరుకున్న పార్టీ నేతలు ప్రత్యేకంగా అభినందించారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థత విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ, కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, వినోద్ తదితరులతో నిరంతరం మాట్లాడినట్లు సమాచారం.

అంతేకాకుండా, మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

వైద్యుల సూచన మేరకు అనంతరం గ్రీన్ ఛానల్ ద్వారా పెద్ది సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. అంబులెన్స్ వెంట కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్‌కు బయలుదేరారు.

ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading