వార్తలు

విజయవాడలో విడుదలైన ‘1984: పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర’ పుస్తకం – ఇప్పుడు ఆడియో రూపంలో

Published by
Srinivas

ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రసిద్ధ రచయిత విక్రమ్ పూల రచించిన ‘1984: పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర’ పుస్తకం ఆడియో రూపంలోకి రానుంది. ఈ పుస్తకం ఇటీవల సెప్టెంబర్ 6న విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే.

పుస్తకానికి లభించిన అపూర్వ స్పందనను దృష్టిలో పెట్టుకుని ఈ విలువైన చారిత్రక గ్రంథాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు, ప్రముఖ యాంకర్ శ్రీమతి గాయత్రి గాత్రధారణలో ఆడియో పుస్తకాన్ని అందించేందుకు కమిటీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్ వెల్లడించారు.

నేడు నిర్వహించిన కార్యక్రమంలో ఆడియో పుస్తకం టీజర్‌ను ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టి.డి. జనార్దన్, 1984 ఆగస్టులో గుండె శస్త్రచికిత్స చేయించుకుని తిరిగొచ్చిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను అప్పటి కేంద్ర పాలకులు కుట్ర పన్ని పదవీచ్యుతుణ్ని చేసిన సందర్భాలను స్మరించుకున్నారు. ప్రజా బలం, కాంగ్రెసేతర నేతల సహకారంతో ఎన్టీఆర్ చేపట్టిన మహత్తర ప్రజాస్వామ్య పోరాటం దేశ చరిత్రను తిరగరాసిందని ఆయన చెప్పారు.

ఇలాంటి ప్రేరణాత్మక సంఘటనల సమాహారంగా నిలిచిన విక్రమ్ పూల రచన ఇప్పుడు ఆడియో రూపంలో కూడా అభిమానులకు అందుబాటులోకి రానుంది. వచ్చే డిసెంబర్ 13, 2025న హైదరాబాద్‌లో ఈ ఆడియో పుస్తకాన్ని ఎన్టీఆర్ తనయ మరియు రాజమండ్రి ఎంపీ శ్రీమతి పురందరేశ్వరి అధికారికంగా విడుదల చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత విక్రమ్ పూల, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు రామ్ మోహన్ రావు, ప్రొఫెసర్ వెంకట్, పర్వతనేని రాంబాబు, మండవ సతీష్, బిక్కి కృష్ణ, ఆడియో పుస్తక పర్యవేక్షకులు అశోక్ కుమార్, సంతోష్ కుమార్, కో–ఆర్డినేటర్ విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts