Download App

POJK లో ప్రజా విప్లవం… అణచివేత పై ప్రపంచదేశాల మౌనం… డేగ చూపుతో భారత్

జూన్ 11, 2026 By Suresh Thota
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoJK) లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక ప్రాంతీయ అస్థిరత కు సంబంధించినది మాత్రమే కాదు. అది దశాబ్దాలుగా సాగుతున్న ఆర్థిక అణచివేత, సామాజిక వివక్ష, మరియు రాజకీయ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ప్రజలు పాల్గొంటున్న ఒక చారిత్రాత్మక ప్రజా...
POJK లో ప్రజా విప్లవం… అణచివేత పై ప్రపంచదేశాల మౌనం… డేగ చూపుతో భారత్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoJK) లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక ప్రాంతీయ అస్థిరత కు సంబంధించినది మాత్రమే కాదు. అది దశాబ్దాలుగా సాగుతున్న ఆర్థిక అణచివేత, సామాజిక వివక్ష, మరియు రాజకీయ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ప్రజలు పాల్గొంటున్న ఒక చారిత్రాత్మక ప్రజా విప్లవం. ప్రజల న్యాయమైన సామాజిక డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతున్న పౌరులపై పాకిస్తాన్ పాలకులు బుల్లెట్ల వర్షం కురిపించడం అక్కడి దారుణ మారణకాండకు పరాకాష్ఠ. నిరసనకారులకు, పాక్ భద్రతా దళాలకు (పాక్ రేంజర్లు) మధ్య జరిగిన ఈ ఘోర హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకు ఒక పాక్ మీడియా వెల్లడించిన వివరాల మేరకు 30 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా ,వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు అని తెలిపింది. అనధికార లెక్కల ప్రకారం 100 పైనే మరణించగా, 250 పైగా గాయాలపాలైనట్లు తెలుస్తుంది.

“​పీఓజేకే” ప్రాంతంలో ఈ స్థాయి తీవ్రతకు ప్రధాన పాయింట్.. దశాబ్దాలుగా ఆందోళనలు నడుపుతున్న “జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ” (JAAC) పై పాక్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం (Anti-Terrorism Act) కింద నిషేధం విధించడం. వ్యాపారులు, లాయర్లు, విద్యార్థులతో కూడిన ఒక పౌర సమాజ కూటమిని ఉగ్రవాద సంస్థగా ముద్రవేసి అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేయడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్న జనాలపై రేంజర్లు నేరుగా నిజమైన బుల్లెట్లతో (Live Ammunition) కాల్పులు జరపడం, “రావలకోట్” మరియు “ముజఫరాబాద్” నగరాలను రణరంగంగా మార్చడం పాక్ సైన్యపు క్రూరత్వాన్ని ఎత్తిచూపుతోంది.

ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న JAAC అగ్ర నాయకత్వం అంతా ప్రస్తుతం పాక్ సైన్యానికి చిక్కకుండా అజ్ఞాతం లోకి వెళ్లి ఉద్యమాన్ని నడిపిస్తోంది. షౌకత్ నవాజ్ మీర్, ఉమర్ నజీర్ కాశ్మీరీ, మెహ్రాన్ అర్షద్ ఖవాజా, సర్దార్ అమన్ వంటి ప్రధాన నేతలను దేశద్రోహులుగా, మోస్ట్ వాంటెడ్ అపరాధులుగా ప్రకటించిన పాక్ హోంశాఖ, వారి తలలపై ఏకంగా రూ. 1 కోటి రూపాయలు బహుమతి ప్రకటించింది. నాయకులు తలదాచుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో స్థానిక వ్యాపార ప్రముఖులు, సామాన్య కార్యకర్తలు భద్రతా దళాల కాల్పుల్లో మరణిస్తున్న వైనం అక్కడి వీధుల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. 70 మందికి పైగా ముఖ్య యాక్టివిస్టులను ఇప్పటికే జైళ్లలో బంధించారు.

అసలు “పీఓజేకే” ప్రజలు ప్రాణాలకు తెగించి ఈ రోజు ఎందుకు రోడ్లపైకి వచ్చారనే దానికి ప్రధాన కారణం తీవ్రమైన ఆర్థిక దోపిడీ. ఈ ప్రాంతంలో ప్రవహించే నదుల పై నిర్మించిన “మంగ్లా డ్యామ్” వంటి ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్ దేశం మొత్తం అత్యంత చౌకగా విద్యుత్‌ను పొందుతోంది. కానీ, ఏ భూమిపై ఆ విద్యుత్ ఉత్పత్తి అవుతుందో, ఆ “పీఓజేకే” ప్రజలకు మాత్రం ప్రభుత్వం విపరీతమైన పన్నులు, అదనపు చార్జీలు వేసి విద్యుత్ బిల్లుల మోత మోగిస్తోంది. “మా నీరు.. మా విద్యుత్.. మాకే ఎందుకు ఈ భారం…”? అన్న ప్రశ్నతో పాటు, ఇటీవల గోధుమ పిండి (ఆటా) పై ఇస్తున్న కనీస సబ్సిడీలను పాక్ ప్రభుత్వం ఎత్తేయడంతో సామాన్యుడికి కడుపు మీద కొట్టినట్టయింది.

ఆర్థిక ఇబ్బందులకు తోడు ఈసారి రాజకీయ వివక్ష కూడా తోడైంది. “పీఓజేకే” అసెంబ్లీలోని మొత్తం 45 స్థానాల్లో 12 స్థానాలను నాన్-కశ్మీరీ పాకిస్తానీలకు (వలస వచ్చిన శరణార్థుల పేరిట) కేటాయిస్తూ పాక్ ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. ఇది తమ స్వయంప్రతిపత్తిని, స్థానిక ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసే కుట్రగా ప్రజలు బావిస్తున్నారు. 2025లో కుదిరిన “ముజఫరాబాద్ ఒప్పందం” ప్రకారం ఇస్తామన్న ఆర్థిక ప్యాకేజీలు, నిత్యావసరాల రాయితీలను ఇవ్వకుండా మోసం చేసిన పాక్ పాలకుల ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ ప్రజలు తిరుగుబాటు బాట పట్టారు.

ఈ అణచివేత ఒక ఎత్తయితే, ప్రపంచానికి నిజాలు తెలియకుండా పాక్ ప్రభుత్వం అమలు చేస్తున్న “సమాచార దిగ్బంధం” మరో ఘోరం. “పీఓజేకే” వ్యాప్తం గా ఇంటర్నెట్, మొబైల్ సేవలను పూర్తిగా నిలిపివేసి, సామూహిక నిర్బంధాలు విధిస్తూ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచేశారు. స్వతంత్ర జర్నలిస్టులను లోపలికి రానివ్వకుండా మీడియాపై ఆంక్షలు విధించారు. దీనివల్ల అధికారికంగా చెప్తున్న మరణాల కంటే వాస్తవంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ​పాక్ సైన్యం చేస్తున్న ఈ ఘోరాల నేపథ్యంలో “పీఓజేకే” వీధుల్లో ఇప్పుడు విప్లవాత్మకమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిరసనకారులు బహిరంగంగానే “మాకు పాకిస్తాన్ వద్దు.. భారతదేశంలో విలీనం చేయండి” అని నినాదాలు చేస్తున్నారు. సరిహద్దు అవతల ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో భారత ప్రభుత్వం కల్పిస్తున్న 24 గంటల కరెంట్, ఉచిత రేషన్ సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. “చలో చలో కార్గిల్ చలో” అంటూ సరిహద్దులు దాటతామని హెచ్చరిస్తున్నారు. పాక్ పాలకుల నరకం కంటే భారతదేశంలో భాగమవ్వడమే తమకు విముక్తి అని స్థానిక కాశ్మీరీ పౌరులు నినదించడం గమనార్హం.

భారతదేశం ఈ పరిణామాలపై అంతర్జాతీయ వేదికలపై చాలా వ్యూహాత్మకంగా మరియు దూకుడుగా వ్యవహరిస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందిస్తూ, “పీఓజేకే” అంతా చట్టబద్ధంగా భారతదేశంలో అంతర్భాగమని, అక్కడ నివసిస్తున్న మన పౌరులపై పాక్ సైన్యం జరుపుతున్న అనాగరిక పౌర హననాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది. తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడానికి పాకిస్తాన్ పనిగట్టుకుని చేస్తున్న “ఫేక్ న్యూస్, ఎడిట్ చేసిన వీడియోల” దుష్ప్రచారాన్ని భారత్ అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలు చేసింది. పాక్ అకృత్యాలపై ప్రపంచ దేశాలు తక్షణమే నిలదీయాలని డిమాండ్ చేసింది.

ప్రతి చిన్న విషయానికి ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అంటూ నినదించే అమెరికా, యూరోప్ దేశాలు మాత్రం ఈ విషయంలో తమ భౌగోళిక-రాజకీయ ప్రయోజనాల కోసం (Geopolitical Interests) అధికారికంగా మౌనం వహించడం లేదా నెమ్మదిగా స్పందించడం పశ్చిమ దేశాల ద్వంద్వ నీతిని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, అంతర్జాతీయంగా పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా బ్రిటన్ (UK) లోని 30 మందికి పైగా పార్లమెంట్ సభ్యులు (MPs) తమ ప్రభుత్వ విదేశాంగ శాఖకు లేఖలు రాస్తూ, పీఓజేకేలో జరుగుతున్న సమాచార దిగ్బంధం, సామూహిక అరెస్టులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్ పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చ జరగడం పాక్‌ను అంతర్జాతీయంగా ఇరకాటంలో పడవేసింది.

ఐక్యరాజ్యసమితి (UN) సైతం ఈ మానవీయ సంక్షోభంపై తక్షణమే కదిలిరావాల్సిన అవసరం ఉంది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్తలు ఇప్పటికే భారత్-పాక్ సరిహద్దుల్లో ఉన్న UNMOGIP (United Nations Military Observer Group in India and Pakistan) కార్యాలయానికి అధికారిక వినతిపత్రాన్ని సమర్పించారు. ఇంకా వీరు పాకిస్తాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ లైన్లు కట్ చేసి ప్రపంచాన్ని చీకట్లో ఉంచుతున్నందున, ఐరాస ఒక స్వతంత్ర “నిజనిర్ధారణ కమిటీని” (Fact-Finding Team) “పీఓజేకే” ప్రాంతానికి పంపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుల్లెట్లతో తాత్కాలికంగా ఉద్యమాలను అణచవచ్చు కానీ, కడుపు కాలిన జనం గుండెల్లో రగులుతున్న తిరుగుబాటు నిప్పును పాకిస్తాన్ ఎక్కువ కాలం ఆపలేదు. అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా కళ్లు తెరిచి పాక్ అకృత్యాలకు అడ్డుకట్ట వేయకపోతే, ఈ నిప్పు కణిక దక్షిణ ఆసియా శాంతిభద్రతలకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది.

ముగింపు: ఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల్ని మతం అనే మత్తు మందు లో ఎక్కువ కాలం ఉంచలేదు. ఆకలి ఏ ఆయుదాన్నైనా ఎదుర్కొంటుంది. ఎన్నిరోజులు అని పాకిస్తాన్ POJK యాక్టివిస్టులను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియా వేదికగా భారత కి ఇదే తగిన సమయం “పీఓజేకే” ను కలుపుకోవడానికి అని అంటున్నారు. మన కలుపుకొనక్కరలేదు… వాళ్లే వచ్చి కలుస్తామంటున్నారు ఎందుకు అభివృద్ధి. అవును కశ్మీర్ లో ఎన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్నదో ప్రభుత్వం చూస్తున్నారుగా…. ఇది భారత్ యొక్క అసలు సిసలు రాజకీయం.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading