ఆరంజ్ ఎకానమీ అంటే ఏమిటి…
మనిషి ఆలోచన, ప్రతిభ, సృజనాత్మకత ద్వారా ఆదాయం పొందే ఆర్థిక వ్యవస్థనే ఆరంజ్ ఎకానమీ (Creative Economy) అంటారు. భూమి, యంత్రాలు, ఫ్యాక్టరీలు కాకుండా మేధస్సే మూలధనం.
సినిమా, OTT, యూట్యూబ్, సంగీతం, నృత్యం, హస్తకళలు, యానిమేషన్, గేమింగ్, గ్రాఫిక్ డిజైన్, ఫ్యాషన్, బ్రాండింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు దీనిలో భాగం. ఒక యూట్యూబర్ వీడియో ద్వారా సంపాదిస్తే, ఒక కళాకారుడు తన కళను ఆన్‌లైన్‌లో అమ్మితే ….. అది ఆరంజ్ ఎకానమీకి ఉదాహరణ.
భారత్ ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తోంది….
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ రంగాన్ని ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వం దీన్ని భవిష్యత్ ఉద్యోగాల ప్రధాన వనరుగా చూస్తోందని స్పష్టం అవుతుంది.
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2025లో నిర్వహించిన WAVES (World Audio Visual & Entertainment Summit) ద్వారా భారత్‌ను గ్లోబల్ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దే దిశ గా లక్ష్యాన్ని ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ “Create in India, Create for the World” అనే నినాదాన్ని ఇచ్చారు. అంటే కంటెంట్ సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించాలని అన్నారు. భారతదేశంలోని కథలు, సంగీతం, సంస్కృతి ప్రపంచ మార్కెట్‌లో ఉన్నతమైన స్థాయిలో నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
దీని వృద్ధి ఎలా ఉంది అంటే… 2020లో సుమారు ₹1.5 లక్ష కోట్లుగా ఉన్న ఈ రంగం, 2025 నాటికి ₹3 నుండి 4 లక్ష కోట్లకు పెరిగిందని ఒక అంచనా. 2030 నాటికి ₹8 లక్ష కోట్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రాంతీయ సినిమాలు అంతర్జాతీయ మార్కెట్ చేరడం, సోషల్ మీడియా ద్వారా హస్తకళల ఎగుమతులు, యూట్యూబ్ కంటెంట్ విస్తరణ ఇవన్నీ వేగవంతమైన వృద్ధికి కారణాలు.
భవిష్యత్ లో మన దేశ జీడీపీ కి ఈ ఎకానమీ చాలా బలంగా నిలవబోతుంది. యువత తక్కువ పెట్టుబడితో తమ ప్రతిభను ఆదాయంగా మార్చుకునే అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం యానిమేషన్, గేమింగ్, సినిమా రంగాలకు విధాన పరమైన ప్రోత్సాహం ఇస్తోంది.
సంక్షిప్తంగా చెప్పాలంటే ఉద్యోగం కంటే, మీ టాలెంట్‌తో సంపాదించే వ్యవస్థనే ఆరంజ్ ఎకానమీ అంటారు. భారత్ దీనిని భవిష్యత్ ఆర్థిక శక్తిగా చూస్తోంది. ఎందుకంటే యువత ప్రపంచంలో ఏ దేశానికి లేనంతగా మన దేశంలో ఉంది.