Download App

భారత అణు వ్యూహంలో ‘రెడీ-టూ-ఫైర్’ మోహరింపు వెనుక అంతరార్థం..?

జూన్ 12, 2026 By Suresh Thota
అంతర్జాతీయ రక్షణ రంగంలో నిశ్శబ్దంగా ఒక మహా సంచలనం చోటుచేసుకుంది. శాంతికాముక దేశంగా, రక్షణ రంగంలో ఎప్పుడూ ఆచితూచి అడుగులు వేసే భారతదేశం, తన అణు వ్యూహంలో, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చారిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల మోహరింపు, సైనిక వ్యయాలపై అత్యంత...
భారత అణు వ్యూహంలో 'రెడీ-టూ-ఫైర్' మోహరింపు వెనుక అంతరార్థం..?

అంతర్జాతీయ రక్షణ రంగంలో నిశ్శబ్దంగా ఒక మహా సంచలనం చోటుచేసుకుంది. శాంతికాముక దేశంగా, రక్షణ రంగంలో ఎప్పుడూ ఆచితూచి అడుగులు వేసే భారతదేశం, తన అణు వ్యూహంలో, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చారిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల మోహరింపు, సైనిక వ్యయాలపై అత్యంత ప్రామాణిక విశ్లేషణలు ఇచ్చే స్వీడన్‌కు చెందిన “స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్” (SIPRI) తన తాజా ఇయర్‌బుక్-2026 నివేదికలో ఈ సంచలన విషయాలను బహిర్గతం చేసింది.

భారతదేశం తన సైనిక చరిత్రలోనే మొదటిసారిగా శాంతిసమయంలోనే అణ్వాయుధాలను పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన మోహరించిందని (Operationally Deployed) ఈ నివేదిక స్పష్టం చేసింది. దశాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ రక్షణ విధానాలను పక్కనబెట్టి, శత్రువుల ముప్పును తక్షణమే తిప్పికొట్టేలా భారత్ అడుగులు వేయడం ఇప్పుడు అంతర్జాతీయ వ్యూహకర్తలలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రాంతీయ భద్రతను శాసించే స్థాయికి భారత్ చేరుకుందనే దానికి ఈ పరిణామమే ప్రత్యక్ష నిదర్శనం.

SIPRI నివేదికలోని గణాంకాల ప్రకారం.. భారతదేశం వద్ద ఉన్న మొత్తం అణ్వాయుధాల సంఖ్య ప్రస్తుతం 190కి చేరుకుంది. గత ఏడాది ఇది 180గా ఉండగా, కేవలం ఏడాది కాలంలోనే భారత్ తన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇదే సమయంలో మన చిరకాల శత్రువు పాకిస్థాన్ వద్ద 170 అణ్వాయుధాలు ఉన్నట్లు ఈ సంస్థ అంచనా వేసింది. దీన్ని బట్టి అణ్వాయుధాల సంఖ్య పరంగా భారత్ తన పొరుగు దేశం కంటే స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. అయితే, ఈ ఆయుధాల పెంపు కేవలం సంఖ్యాపరమైనది మాత్రమే కాదు, వ్యూహాత్మకమైనది కూడా.

ఈ నివేదికలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏమిటంటే.. భారత్ తన 190 అణ్వాయుధాలలో 12 ఆయుధాలను క్షిపణులకు అమర్చి, ఏ క్షణంలోనైనా ప్రయోగించడానికి వీలుగా ‘రెడీ-టూ-ఫైర్’ (Mated State) స్థితిలో ఉంచడంతో ప్రపంచం ఆశ్చర్యం నకు లోనైంది. సాధారణంగా భారతదేశం తన అణు వార్‌హెడ్‌లను ఒకచోట, వాటిని మోసుకెళ్లే క్షిపణులను (Launchers) మరొకచోట విడివిడిగా అత్యంత సురక్షిత ప్రాంతాలలో భద్రపరుస్తుంది. అత్యవసర పరిస్థితి వస్తే తప్ప వాటిని ఒకదానికొకటి అమర్చదు. అలాంటిది శాంతిసమయంలోనే ఈ రకమైన వ్యూహాత్మక మోహరింపు చేయడం భారత్ చరిత్రలోనే ఇదే ప్రథమం.

​భారత రక్షణ విధానంలో వచ్చిన ఈ పెను మార్పు చూసి, మన దేశం తన ప్రాథమిక సూత్రమైన ‘నో ఫస్ట్ యూజ్’ (No First Use – NFU) విధానాన్ని వీడిందా…? అనే సందేహాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. కానీ, రక్షణ నిపుణులు ఈ విషయాన్ని ఖండించారు. భారత్ ఇప్పటికీ “మొదటగా మేము అణ్వాయుధాన్ని ప్రయోగించము” అనే శాంతి సిద్ధాంతానికే కట్టుబడి ఉంది. అయితే, ఆయుధాలు సిద్ధంగా ఉంచడానికి (Deployment), మొదటగా దాడి చేయడానికి (First Use) చాలా వ్యత్యాసం ఉంది. భారత్ బాంబు వేయదు, కానీ అవతలి వాడు వేస్తే క్షణాల్లో వాడిని బూడిద చేయడానికి వెనుకాడదు.

ఈ వ్యూహాత్మక మార్పు వెనుక బలమైన అంతర్జాతీయ, ప్రాంతీయ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన కొన్నేళ్లుగా చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, అలాగే గతేడాది భారత్ మరియు పాక్ సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఆందోళనకర సైనిక పరిణామాల నేపథ్యంలో భారత్ ఇక ఏమాత్రం అలసత్వాన్ని ప్రదర్శించకూడదని నిర్ణయించుకుంది. శత్రువు అణు దాడికి తెగబడినప్పుడు, మన ఆయుధాలను వెతుక్కుని అమర్చుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే, ఆ సమయాన్ని (Reaction Time) దాదాపు శూన్యానికి తీసుకురావడమే ఈ మోహరింపు వెనుక అసలు లక్ష్యం.

దీనిని సాంకేతిక పరిభాషలో “సెకండ్ స్ట్రైక్ సామర్థ్యం” (Second Strike Capability) అంటారు. శత్రుదేశం హఠాత్తుగా మన భూభాగంపై అణు దాడి చేసి మన క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేసినా, సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా తిరిగే మన అణు జలాంతర్గాములు (SSBNs) సురక్షితంగా ఉంటాయి. భారత్ తన అణు త్రయాన్ని (Nuclear Triad) బలోపేతం చేస్తూ, “INS అరిహంత్”, “INS అరిదమన్” వంటి అధునాతన జలాంతర్గాములలో ఈ అణ్వాయుధాలను మోహరించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సముద్ర గర్భం నుండి భారత్ ఇచ్చే ఎదురుదెబ్బ శత్రువు ఊహకు కూడా అందని విధంగా ఉంటుంది.

ఈ రకమైన వేగవంతమైన రక్షణ వ్యవస్థకు మన “కానిస్టరైజ్డ్ క్షిపణులు” (Canisterised Missiles) ఎంతగానో దోహదపడ్డాయి. ఇందులో క్షిపణిని తయారు చేసినప్పుడే దాని లోపల అణు వార్‌హెడ్‌ను అమర్చి, దాన్ని పూర్తిగా సీల్ చేసిన ఒక ప్రత్యేకమైన సిలిండర్ ఆకారపు డబ్బా (Canister) లో పెట్టేస్తారు. భారతదేశం ఇటీవల అభివృద్ధి చేసిన అధునాతన “అగ్ని” (Agni) సిరీస్ క్షిపణులను ప్రత్యేక సీల్డ్ కాప్సూల్స్ (Canisters) లో భద్రపరుస్తారు. దీనివల్ల వాటిని రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా ఎక్కడికైనా సులభంగా రవాణా చేయవచ్చు. ఈ కానిస్టర్లలోనే అణు వార్‌హెడ్‌ను ముందే అమర్చి ఉంచడం ద్వారా, సుదీర్ఘకాలం పాటు ఆయుధం పాడవకుండా ఉండటమే కాకుండా, ఆదేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే శత్రువుపైకి ప్రయోగించవచ్చు.

​భారత్ చేస్తున్న ఈ అణు ఆధునీకరణ కేవలం పాకిస్థాన్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని చేస్తున్నది కాదు. డ్రాగన్ కంట్రీ చైనా వద్ద ప్రస్తుతం 620 అణ్వాయుధాలు ఉన్నాయి. వాళ్ళు తమ ఆయుధాగారాలను, ఆయుధసంపత్తిని, వేగంగా పెంచుకుంటూ పోతున్నారు. చైనాలోని సుదూర ప్రాంతాలను, వారి ప్రధాన నగరాలను కూడా తాకగల సరిహద్దు రక్షణ సామర్థ్యాన్ని సాధించడం భారత్‌కు అనివార్యంగా మారింది. అందుకే, చైనా రక్షణ సవాలును దీటుగా ఎదుర్కొనేందుకే భారత్ తన లాంగ్-రేంజ్ మిస్సైల్ టెక్నాలజీని, అణు మోహరింపు వ్యూహాన్ని మార్చుకుంటూ వస్తోంది.

​ముగింపు: “యుద్ధం వద్దు అనుకునేవాడు.. ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి” అనే నానుడి భారత్‌కు అక్షరాలా సరిపోతుంది. మన పొరుగున ఉన్న ఇద్దరు శత్రువులు అణు శక్తి కలిగిన దేశాలు అయినప్పుడు, శాంతి మంత్రం ఒక్కటే సరిపోదు, దానికి వెన్నుముకగా ఆయుధ బలం కూడా ఉండాలి. భారత్ మొదటి బాంబు వేయదనే నమ్మకంతో, శత్రువులు అది మన బలహీనతగా భావించకుండా ఉండడానికే ఈ “రెడీ-టూ-ఫైర్” హెచ్చరిక. SIPRI నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కొత్త అణు వ్యూహం భారతదేశ సార్వభౌమాధికారానికి, భౌగోళిక రక్షణకు ఒక పటిష్టమైన రక్షణ కవచం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading