Download App

మత్తు వలయంలో యువత భవిత విల విల…”సే నో టు డ్రగ్స్” మీట్ లో అధికారులు

జూన్ 27, 2026 • By Suresh Thota
"యువత దేశానికి వెల కట్టలేని సంపద.. కానీ నేడు ఆ సంపద మత్తు పదార్థాల రొంపిలో కూరుకుపోతోంది. క్షణకాలం ఇచ్చే ఆనందం కోసం జీవితకాలపు భవిష్యత్తును బలిపెడుతున్నారు. ఈ మహమ్మారిని అంతమొందించేందుకు ప్రభుత్వాల సంకల్పం ఎంత ముఖ్యమో.. ప్రతి కుటుంబం, ప్రతి విద్యాసంస్థ ఒక సైనికుడిలా పోరాడటం కూడా...
మత్తు వలయంలో యువత భవిత విల విల..."సే నో టు డ్రగ్స్" మీట్ లో అధికారులు

“యువత దేశానికి వెల కట్టలేని సంపద.. కానీ నేడు ఆ సంపద మత్తు పదార్థాల రొంపిలో కూరుకుపోతోంది. క్షణకాలం ఇచ్చే ఆనందం కోసం జీవితకాలపు భవిష్యత్తును బలిపెడుతున్నారు. ఈ మహమ్మారిని అంతమొందించేందుకు ప్రభుత్వాల సంకల్పం ఎంత ముఖ్యమో.. ప్రతి కుటుంబం, ప్రతి విద్యాసంస్థ ఒక సైనికుడిలా పోరాడటం కూడా అంతే ముఖ్యం.”

“జూన్ 26 అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవం” (International Day Against Drug Abuse and Illicit Trafficking). దీనిని కేవలం క్యాలెండర్‌లో ఒక రోజుగా కాకుండా, సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి పై యుద్ధం గా ప్రకటించాల్సిన సమయం ఇది. భారతదేశ జనాభాలో సింహభాగం యువత ఉన్న తరుణంలో, వారిని నిర్వీర్యం చేసేందుకు అంతర్జాతీయ డ్రగ్ మాఫియా పన్నుతున్న పన్నాగాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మరియు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకుంటున్న కఠిన చర్యలు, డ్రగ్స్ వల్ల విచ్ఛిన్నమవుతున్న జీవితాల గురించి ప్రత్యేక విశ్లేషణ…

కేంద్ర ప్రభుత్వం :- భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం “నశా ముక్త్ భారత్ అభియాన్” (NMBA) కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేసింది. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో కేంద్ర సామాజిక న్యాయ, అధికారిత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల గుండా, డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీల ద్వారా జరుగుతున్న డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడానికి “నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో” (NCB) సరికొత్త సాంకేతికతను వాడుతోందని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు.

డ్రగ్స్ వాడే వారిని నేరస్థులుగా కాకుండా బాధితులుగా చూడాలని, వారిని సాధారణ స్థితికి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా “అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్” (ATF) కేంద్రాల ద్వారా ఉచిత చికిత్స అందిస్తూ….. వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి సమాజంలోకి తీసుకువస్తున్నామని కేంద్రం ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం: శిల్పకళా వేదికగా కఠిన హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని కూకటివేళ్లతో సహా పెకిలించివేయడానికి ప్రభుత్వం నడుం బిగించింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో “తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో” (TGANB) ఆధ్వర్యంలోని “ఈగల్ ఫోర్స్” నిర్వహించిన భారీ అవగాహన సదస్సులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.

డ్రగ్స్ కేసుల్లో రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు, అధికారికంగా ఎంతటి అండదండలు ఉన్న వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం “భట్టి విక్రమార్క” తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ఈ సందర్భంగా…. గడిచిన రెండేళ్లలో దాదాపు 822 మంది విద్యార్థులు డ్రగ్స్ వలలో చిక్కుకున్నారని, అందులో 600 మంది బాధితులు కాగా, మిగిలిన వారు తోటి విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించే పెడ్లర్లుగా మారడం అత్యంత విచారకరమని అధికారులు వెల్లడించారు. ఈ వేదికపై సినీ నటులు రామ్ పోతినేని, మీనాక్షి చౌదరి కూడా పాల్గొని యువతకు “సే నో టు డ్రగ్స్” అని పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం:- గంజాయి తోటలపై “ఉక్కుపాదం” మోపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మాదకద్రవ్యాల నివారణకు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. విజయవాడలో జరిగిన ప్రత్యేక సదస్సులో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కే. రవీంద్ర, డీజీపీ ద్వారకా తిరుమల రావు పాల్గొని కీలక నిర్ణయాలు ప్రకటించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు అవుతున్న గంజాయి తోటలను రూపుమాపడంతో పాటు, పొరుగు రాష్ట్రాల సరిహద్దుల నుండి వచ్చే సింథటిక్ డ్రగ్స్ (MDMA, LCD) పై ఉక్కుపాదం మోపామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఏపీలోని ప్రతి కాలేజీ, యూనివర్సిటీ క్యాంపస్‌లలో యాంటీ డ్రగ్ క్లబ్‌లను ఏర్పాటు చేసి, అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

డ్రగ్స్ వలన జీవితాలు చాలా దారుణంగా నాశనమవుతున్నాయి…. మత్తు అనేది ఒక అంచు లేని అగాధం. సరదాగా మొదలయ్యే అలవాటు, జీవితాన్నీ ఎలా బలి తీసుకుంటుందంటే, మెదడుపై శాశ్వత దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మెదడులో “డోపమైన్’ అనే రసాయనం అసాధారణంగా విడుదలవుతుంది. క్రమంగా మెదడు తన సహజ నియంత్రణను కోల్పోతుంది. దీనివల్ల తీవ్రమైన డిప్రెషన్, మతిస్థిమితం తప్పడం వంటి మానసిక జబ్బులు వస్తాయి.

ఒక ఇంట్లో ఒక్కరు డ్రగ్స్‌కు బానిసైనా.. ఆ కుటుంబంలో ప్రశాంతత కరువవుతుంది. ఆర్థికంగా రోడ్డున పడటమే కాకుండా, సమాజంలో ఆ కుటుంబం తీవ్రమైన అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బాగా అలవాటు పడ్డ వాళ్లు, మత్తు పదార్థాలు కొనడానికి డబ్బులు సరిపోనప్పుడు యువత… దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, చివరకు హత్యలు చేయడానికి కూడా వెనుకాడరు. జైలు పాలై తమ బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటారు.

ఆరోగ్య క్షీణత మరియు ఆత్మహత్యలుతో చాలా మంది అర్ధంతరంగా జీవితాలు చాలిస్తున్నారు. కిడ్నీలు, లివర్ ఫెయిల్యూర్ అవ్వడం, ఒకే సిరంజిని పలువురు వాడటం వల్ల హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారు. మత్తు దిగిన తర్వాత వచ్చే తీవ్రమైన ఒంటి నొప్పులు, మానసిక స్థిమితం కోల్పోయి, ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ముగింపు: సామాజిక మార్పు రావాలి. ప్రభుత్వాలు చట్టాలు చేయగలవు, పోలీసులు కేసులు నమోదు చేయగలరు, కానీ సమాజంలో మార్పు రానంతవరకు డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించలేము. ముందుగా, తల్లిదండ్రులదే బాధ్యత “మీ పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు వస్తున్నాయా…? వారు ఒంటరిగా ఉంటున్నారా…? పాకెట్ మనీ ఎక్కువగా అడుగుతున్నారా….? ఇవి గమనించండి”. వారితో వీలైనంత ఎక్కువగా స్నేహితుడిగా సమయం గడపండి.

“You Only Live Once” (జీవితం ఒక్కటే)… దాన్ని మత్తుకు బానిస చేసి బూడిద చేసుకోవద్దని, ఆశయాల వైపు అడుగులు వేసి ఆదర్శంగా నిలవాలని ఈ అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి.

“డ్రగ్స్‌ను తిరస్కరిద్దాం.. జీవితాన్ని ప్రేమిద్దాం”…..

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading