
చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కళ్యాణ రేవు జలపాతంలో జరిగిన ఈ ఘటన ప్రతి మనసుని కలచేస్తోంది. రీల్ కోసం చేసిన చిన్న ప్రయత్నం ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొంది. యూనిస్ అనే 23 ఏళ్ల యువకుడు గురువారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి జలపాతానికి వెళ్లాడు. ఆనందంగా గడుపుతూ, ఒక రీల్ వీడియో తీసుకుందాం అని నిర్ణయించారు. ఫోన్ కెమెరా ఆన్ అయింది, స్నేహితులు షూట్ మొదలుపెట్టారు. జలపాతం ఒడ్డున ఉన్న రాళ్ల మీద నవ్వుతూ నీళ్ల అంచున నిలబడి ఉన్న యూనిస్ ఒక్కసారిగా నీటిలోకి దూకాడు.
ఆ క్షణంలో అందరూ ఆనందంగా కేకలు వేస్తుండగా, ఒక్కసారిగా ఆ ఆనందం భయంగా మారిపోయింది. నీటి ప్రవాహం బలంగా ఉండడంతో యూనిస్ మునిగిపోయాడు. స్నేహితులు “యూనిస్… యూనిస్…” అని కేకలు వేస్తూ పరుగులు తీశారు కానీ ఎక్కడా అతని ఆచూకీ కనిపించలేదు. కెమెరాలో మాత్రం ఆ క్షణం… ఆ దూకుడు, ఆ నీటి ప్రవాహం రికార్డ్ అయ్యాయి.
గురువారం సాయంత్రం నుంచి రక్షణ బృందాలు గాలిస్తున్నా ఇప్పటికీ యూనిస్ ఆచూకీ మాత్రం తెలియలేదు. కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం. ఆ వీడియో ఇప్పుడు వారి జీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకంగా మారింది.
సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ఈ మధ్యకాలంలో ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ సంఘటన మరోసారి చాటింది. ఒక్క వీడియో కోసం ప్రాణం పణంగా పెట్టడం ఎంత నిర్లక్ష్యమో యూనిస్ కథ మన కళ్లముందు నిలుస్తోంది. ప్రతి ఒక్కరూ రీల్ చేసే ముందు ఆలోచించాలి… ఒక్క ఫ్రేమ్ కోసం ప్రాణం కోల్పోవడం అవసరమా అని.
యూనిస్ లాంటి ఎందరో యువకులు ఈ మాయలో చిక్కుకుంటున్నారు. చెట్టనకా, పుట్టనకా, కొండల అంచున, లోయల పక్కన ప్రమాదకరంగా… లైక్స్, ఫాలోవర్స్, ట్రెండ్ అనే పేరుతో ఎంతో మంది ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు.
