Download App

‘మహిళా బిల్లు’ మూడు దశాబ్దాల నిరీక్షణకు పరిష్కారం ఇదేనా?

మార్చి 28, 2026 By Suresh Thota
"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అంటారు పెద్దలు... స్త్రీలను గౌరవించే కుటుంబం, సమాజం లేదా దేశంలో దేవతా శక్తి ఉంటుందని, అంటే అక్కడ సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని అర్థం. స్త్రీలు గౌరవించబడని చోట, ఎంతటి గొప్ప పనులు (సత్కర్మలు) చేసినా అవి నిష్ఫలమవుతాయి. స్త్రీ స్వభావమే...
'మహిళా బిల్లు' మూడు దశాబ్దాల నిరీక్షణకు పరిష్కారం ఇదేనా?

“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అంటారు పెద్దలు… స్త్రీలను గౌరవించే కుటుంబం, సమాజం లేదా దేశంలో దేవతా శక్తి ఉంటుందని, అంటే అక్కడ సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని అర్థం. స్త్రీలు గౌరవించబడని చోట, ఎంతటి గొప్ప పనులు (సత్కర్మలు) చేసినా అవి నిష్ఫలమవుతాయి.

స్త్రీ స్వభావమే “ఆదిపరాశక్తి” రూపమని, కుటుంబాన్ని కాపాడే శక్తి స్త్రీలకే ఉందని మన సంస్కృతి చెబుతోంది. అందుకే “మాతృదేవోభవ”. అని చెబుతుంది మన ధర్మ శాస్త్రం. అంతటి శక్తి ఉన్న స్త్రీ కి గొప్ప గౌరవం ఇవ్వాలని భావిస్తూ…. బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లుని తీసుకువస్తుంది.

భారత రాజకీయ యవనికపై ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ (నారీ శక్తి వందన్ అధినియం) ఒక చారిత్రాత్మక విజయం. అయితే, ఈ చట్టం ఆమోదం పొందినా, అది ఎప్పుడు అమలవుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవైపు 2030 తర్వాతే అమలు సాధ్యమని విశ్లేషణలు వస్తుండగా, మరోవైపు “సీట్ల పెంపు” అనే వ్యూహం ద్వారా 2029 నాటికే ఈ చిక్కుముడిని విప్పే అవకాశం కనిపిస్తోంది.

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం నిన్న మొన్నటిది కాదు. ఇది 1980ల నుండే మొదలైంది. రాజీవ్ గాంధీ హయాం లోనే ఈ ఆలోచన కు పునాదులు పడ్డాయి. స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో విజయం సాధించినా, పార్లమెంటు వరకు వచ్చేసరికి అడుగులు తడబడ్డాయి.

అనంతరం 1996లో దేవెగౌడ హయాంలోని ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చినప్పుడు, జనతాదళ్ నేత శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి. ఈ బిల్లు కేవలం “పొట్టి జుట్టున్న (ఆధునిక) మహిళలకే” మేలు చేస్తుందని, గ్రామీణ మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆయన వాదించారు. ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా లేకపోవడాన్ని సాకుగా చూపించి అప్పట్లో బిల్లును అడ్డుకున్నారు.

వాజపేయి హయాంలో బిల్లు ప్రవేశపెడుతుంటే ఎంపీలు బిల్లు కాగితాలను లాక్కుని చించివేసిన ఘటనలు జరిగినాయి. పురుషాధిక్య రాజకీయాలు రాజ్యమేలుతున్న, మన దేశంలో తమ సీట్లు ఎక్కడ పోతాయో అన్న భయం వలన ఈ బిల్లును దశాబ్దాల పాటు అటకెక్కించారు.

​ప్రస్తుతం లోక్‌సభలో 543 సీట్లు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడే 33% రిజర్వేషన్ అమలు చేస్తే, 181 సీట్లు మహిళలకు వెళ్తాయి. అంటే, ఇప్పుడున్న 181 మంది పురుష ఎంపీలు తమ స్థానాలను వదులుకోవాలి. ఇది రాజకీయంగా పెద్ద ఎత్తున అంతర్గత వ్యతిరేకతకు దారితీస్తుంది. అందుకే ప్రభుత్వం దీనిని ‘డీలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) తో ముడిపెట్టింది.

పరిష్కార మార్గం గా ​మహిళలకు న్యాయం చేస్తూనే, పురుష అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఉండే “విన్ అండ్ విన్” ఫార్ములాను రూపొందించారు.

అది ఏవిధంగా అంటే :- పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంచడం ద్వారా ఈ సమస్యను దాటేలా రూపకల్పన చేస్తున్నారు. త్వరలో జరగబోయే జనాభా గణన తర్వాత, లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి సుమారు 848 కు పెంచే అవకాశం ఉంది. కొత్త పార్లమెంట్ భవనం కూడా సుమారు 888 మంది కూర్చునేలా సిద్ధమైంది. ​సీట్లు 848 కి పెరిగితే, అందులో 33% రిజర్వేషన్ లెక్కలు ఇలా ఉంటాయి.

మహిళలకు సుమారు280 సీట్లు కేటాయించవచ్చు. మిగిలిన సీట్లు పురుషులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి సుమారు 568 కేటాయిస్తారు.

మహిళలకు 280 సీట్లు కేటాయించిన తర్వాత కూడా, పురుషుల కోసం మిగిలే సీట్లు 568 ప్రస్తుతమున్న మొత్తం సీట్ల 543 కంటే ఎక్కువే… అంటే ఎవరి సీటు కి భంగం కలగదు, పైగా అదనంగా మరికొన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయి.

ఈ మహిళ బిల్లు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.​ ఈ సమస్య 2029 నాటికి పరిష్కారం కావాలంటే ప్రభుత్వం ముందున్న కార్యాచరణ ఇలా జరిగే అవకాశం ఉంది. 2026 మరియు 2027 మధ్య కాలంలో, జనాభా గణన (Census) పూర్తి చేయడం. 2027 మరియు 2028 మధ్య కాలంలో, “డీలిమిటేషన్ కమిషన్” ద్వారా కొత్త నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించడం. 2029 ఎన్నికల నాటికి పెరిగిన సీట్లతో పాటు 33% మహిళా రిజర్వేషన్లను ఒకేసారి అమలు చేయడం. ఇలా కొనసాగించవచ్చు.

సీట్లు పెంచేటప్పుడు జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు, నష్టం కలగకుండా చూడాలి. కేవలం జనాభానే కాకుండా, అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయిస్తే ఈ ప్రక్రియ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది.

మహిళా రిజర్వేషన్లు కేవలం కాగితాల మీద చట్టంగా ఉంటే సరిపోదు. సీట్ల పెంపు అనే శాస్త్రీయ మార్గం ద్వారా అటు మహిళా శక్తికి ప్రాతినిధ్యం కల్పిస్తూనే, ఇటు ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలను దెబ్బతీయకుండా అడుగులు వేయవచ్చు. ఇదే జరిగితే, 2029 ఎన్నికలు భారత ప్రజాస్వామ్యంలో సరికొత్త చరిత్రను లిఖిస్తాయి.

మహిళా శక్తి కి పట్టాభిషేకం జరగాలంటే పరిష్కారం మన కళ్ల ముందే ఉంది. కావలసిందల్లా రాజకీయ సంకల్పమే.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading