ఆంధ్ర ప్రదేశ్

“జనసేనను ఏ పార్టీతో పోల్చొద్దు”.. రాజకీయ పోలికలపై పవన్ కళ్యాణ్

Published by
Rahul N

Pawan Kalyan తాజాగా చేసిన రాజకీయ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో ఇటీవల కొత్తగా ఏర్పడిన ఒక రాజకీయ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో, తనను ఆ పార్టీ నాయకత్వంతో పోల్చుతూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పష్టంగా స్పందించారు.

తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పదవుల కోసం కాకుండా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికే ప్రయాణం చేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “నాకు పదవే ముఖ్యం అయితే 2008లోనే యూత్ వింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి, 2009లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేసేవాడిని. కానీ నేను ఎప్పుడూ పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదు” అని ఆయన అన్నారు.

2019 ఎన్నికల్లో గెలుపో, ఓటమో తెలియకపోయినా ప్రజల కోసం ప్రయత్నించానని గుర్తు చేశారు. రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయానని, తనతో ఉన్న పలువురు నాయకులు కూడా పార్టీని వీడిపోయారని పేర్కొన్నారు. అయినప్పటికీ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లానని చెప్పారు.

జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ, “మేం రైట్ వింగ్ కాదు.. లెఫ్ట్ వింగ్ కాదు. మంచి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి తీసుకునే విధానం ఉన్న పార్టీ” అని తెలిపారు.

ఇటీవల పక్క రాష్ట్రంలో ఓ వ్యక్తి పార్టీ పెట్టి సీఎం అయిన తర్వాత తనతో పోలికలు తీసుకురావడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. “ఊర్లో పెళ్లికి ఏదో హడావుడి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు వేరు.. అక్కడి పరిస్థితులు వేరు” అని వ్యాఖ్యానించారు.

“జనసేన పార్టీని ఏ పార్టీతోనూ పోల్చవద్దు. పొంతన లేని పోలికలు పెట్టి ప్రచారం చేయడం మానుకోండి” అంటూ ఆయన స్పష్టం చేశారు.

Rahul N