
ఆంధ్రప్రదేశ్‌లో విద్య, పరిపాలనా రంగాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. సింగపూర్ సహకారంతో రాష్ట్రంలో నాణ్యమైన శిక్షణ కార్యక్రమాలను విస్తరించడంతో పాటు, ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ గవర్నెన్స్, నాయకత్వ నైపుణ్యాలు, స్కిల్ డెవలప్మెంట్లో ఆ దేశ అనుభవాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
అమరావతిలో జరిగిన మూడో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మంత్రి నారా లోకేష్ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ అందించాలని ప్రతిపాదించారు. అక్కడ శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా రాష్ట్రంలోని ఇతర ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా విధానాలపై అవగాహన కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
అలాగే డిజిటల్ పాలన, పరిపాలనా సామర్థ్యం పెంపు, నాయకత్వ లక్షణాల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ వంటి కీలక రంగాల్లో సింగపూర్ అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అన్వయించుకోవాలని పేర్కొన్నారు.
సమావేశంలో గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని కూడా సమీక్షించారు. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సాగుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ప్రతి ఆరు నెలలకోసారి సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
సింగపూర్ సహకారంతో విద్య, పరిపాలన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది.
