సముద్రంలోకి వృథాగా పోయే నీటిని ఉపయోగించుకుని రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి నిశ్చయించుకున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గోదావరి వృథా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించనున్నట్లు తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే బోతున్నామని, ఈ ప్రాజెక్టు వల్ల ఏ రాష్ట్రానికీ నీటి ప్రయోజన నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు.
“ఎగువ రాష్ట్రాలు వరదల సమయంలో నీటిని విడుదల చేస్తాయి. దిగువ రాష్ట్రంగా మేము ఆ వరద నష్టాలను భరిస్తున్నాం. అదే వరద నీటిని వినియోగించుకుందామంటే అభ్యంతరాలు ఎందుకు? వరదను భరించాలి గానీ, దాని నుంచి ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుంది?” అని సీఎం ప్రశ్నించారు.
అలాగే, పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల ప్రాజెక్టు సమయానికి పూర్తవ్వాలని అన్ని వనరులను వినియోగిస్తున్నట్లు చెప్పారు.
ప్రకాశం జిల్లాలో కరువు నివారణకు వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తున్నామని, వచ్చే ఏడాది జూలై నాటికి సాగునీరు అందించేలా పనులు వేగవంతం చేస్తున్నట్లు సీఎం తెలిపారు.