పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. గంభీరమైన గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో పవన్ కళ్యాణ్ కనిపించబోతుండగా, కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు.
తాజాగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఓజీలో “కన్మణి”గా కనిపించే ప్రియాంక రెండు భిన్నమైన కోణాల్లో ఆకట్టుకున్నారు. ఒక పోస్టర్‌లో ఆమె కరుణ, బలం, నిశ్శబ్దాన్ని ప్రతిబింబిస్తే, మరో పోస్టర్ ప్రశాంతత, గృహ వాతావరణాన్ని ప్రతీకాత్మకంగా చూపించింది.
ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ పాత్ర పోస్టర్లకు అద్భుతమైన స్పందన లభించగా, తాజాగా వచ్చిన ప్రియాంక ఫస్ట్ లుక్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. సుజీత్ యొక్క విస్ఫోటన కథనానికి భావోద్వేగ లోతును, ప్రత్యేక ఆకర్షణను జోడించబోతున్న పాత్రగా ప్రియాంకను నిర్మాతలు అభివర్ణించారు. “ప్రతి తుఫానుకు అవసరమైన ప్రశాంతత”గా ఆమె పాత్రను వారు వివరించారు.
ఇటీవల విడుదలైన తొలి పాట ఫైర్ స్టార్మ్కు ప్రేక్షకుల నుంచి ఘన స్పందన లభించింది. ఇక రెండవ గీతం కోసం సన్నాహాలు పూర్తి అవుతున్నాయి. త్వరలో దాని ప్రోమో బయటకు రానుంది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్‌తో పాటు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని ఎస్. తమన్ అందిస్తుండగా, ఛాయాగ్రాహకులుగా రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస పని చేస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు నవీన్ నూలి నిర్వర్తిస్తున్నారు.
ఓజీ చిత్రం 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.