
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో ముగ్గురు నాయకులు ఒకే వేదికపై కనిపించడం ఆలయ ప్రాంతంలో విశేష ఆకర్షణగా నిలిచింది. ఆలయ అధికారులు, వేద పండితులు, జిల్లా అధికారులు పూర్ణకుంభ స్వాగతంతో ముగ్గురిని ఆలయంలోకి ఆహ్వానించారు.
ముందుగా ప్రధాన మంత్రి మోదీ శ్రీ మల్లికార్జున స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఆలయం వెలుపల కొద్ది సేపు ధ్యానం చేసిన తర్వాత వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ముగ్గురు నాయకులకు ఆశీర్వచనం అందజేశారు.

అలాగే ఆలయ అధికారులు ప్రధాన మంత్రి మోదీకి అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి శ్రీశైలం ఆలయ కళారూపాన్ని స్మారకంగా మోదీ కి అందజేశారు. ఆలయ విశేషాలు, చారిత్రక ప్రాముఖ్యతను అధికారులు ప్రధానికి వివరించారు. సుమారు గంటసేపు ఆలయ ప్రాంగణంలో ప్రధాని గడిపారు.
దీనితోపాటు, మోదీ శ్రీశైలంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శించారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కేంద్రంలో ఉన్న శివాజీ మహారాజ్ జీవిత విశేషాలపై ప్రదర్శించిన చిత్రాలను ఆసక్తిగా వీక్షించారు.
శ్రీశైల పర్వత ప్రాంతం ఆధ్యాత్మిక వైభవం, చారిత్రక ప్రాముఖ్యతపై ప్రధాన మంత్రి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.
శ్రీశైలం ప్రాంతమంతా ప్రధాన మంత్రి పర్యటనతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ప్రజలు, భక్తులు ప్రధానికి స్వాగతం పలికారు.
