Download App

ప్రముఖ కాపు సామాజిక నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి మృతి

జూలై 14, 2026 • By Suresh Thota
ప్రముఖ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత, సంచలన రాజకీయ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి మరణించడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లే…. కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
ప్రముఖ కాపు సామాజిక నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి మృతి

ప్రముఖ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత, సంచలన రాజకీయ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి మరణించడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లే…. కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2026, జూలై 14 (మంగళవారం) సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం మరియు సామాజిక ఉద్యమాల పూర్వాపరాలు….

వ్యక్తిగత జీవితం

ముద్రగడ పద్మనాభం 1953, జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. పేరెన్నికగన్న భూస్వామ్య మరియు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం ఆయనది, తండ్రి వీరరాఘవరావు స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1962, 1967) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తండ్రి వారసత్వంతోనే ముద్రగడ పద్మనాభరెడ్డి (వాస్తవంగా పద్మనాభం ఆయన పేరు, మొన్న అధికారికంగా పద్మనాభరెడ్డి అని మార్చుకున్నారు) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

రాజకీయ ప్రస్థానం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ముద్రగడ పద్మనాభరెడ్డి ఒకరు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయంగా తొలి అడుగు (1978) జనతా పార్టీ తరఫున, ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తరువాత ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించడం ఆయన పిలుపు మేరకు టీడీపీ లో చేరారు. 1983, 1985 ఎన్నికల్లో గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా సేవలు అందించారు. ఎన్. టి. రామారావు మంత్రివర్గంలోని తన మంత్రి పదవికి రాజీనామా చేసి, ప్రజా రక్షణ సమితిని స్థాపించారు. తదనంతరం, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న కే. ఈ. కృష్ణమూర్తి, కుందురు జానారెడ్డిలతో కలిసి తెలుగునాడు పార్టీని ప్రారంభించారు.

తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరి, 1989లో ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి క్యాబినెట్‌లోనూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1994లో ఎమ్మెల్యేగా మొదటిసారి ఓటమి చవిచూశారు. తదనంతరం భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి కృష్ణంరాజు ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 4 సంవత్సరాల పాటు బిజెపిలో ఉన్నారు.

మళ్ళీ టీడీపీ లో లోక్‌సభ సభ్యుడిగా 1999లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అనంతరం 2004 ఎన్నికలలో అదే నియోజకవర్గం నుండి ఓడిపోయారు.

రాజకీయంగా చివరి అడుగు YSRCP పార్టీ లో వేశారు. 2024 మార్చి 15న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2024 ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ను పిఠాపురంలో ఓడిస్తానని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ అలా జరక్కపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు.అయితే ఆ ఎన్నికల్లో “పవన్ కళ్యాణ్” పిఠాపురం నుంచి గెలుపొందారు. సవాల్‌ ఓడిపోవడం తో మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు.

కాపు ఉద్యమ సారథిగా..

రాజకీయ నాయకుడిగానే కాకుండా కాపు సామాజిక వర్గాన్ని బీసీ (వెనుకబడిన తరగతుల) జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో సాగిన ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం ప్రధాన రూపశిల్పిగా నిలిచారు. 1990ల నుండి ఆయన కాపు ఐక్య గర్జనలు, సభలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ అదే ఒరవడిని కొనసాగిస్తూ వచ్చారు.

2016 లో తుని వేదికగా జరిగిన “కాపు సత్యాగ్రహ యాత్ర” మరియు రైలు రోకో ఘటనలు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఆ తదనంతరం ఆయన చేసిన నిరాహార దీక్షలు కాపు సామాజిక వర్గంలో ఆయనకు చెరగని సుస్థిర స్థానాన్ని సంపాదించిపెట్టాయి.

సారంశం: కరుడుగట్టిన నిజాయితీపరుడిగా, మొండి పట్టుదలకు మారుపేరుగా, తన సామాజిక వర్గ ప్రయోజనాలే ఊపిరిగా బతికిన ఒక అరుదైన రాజకీయ యోధుడు ముద్రగడ పద్మనాభరెడ్డి. ఆయన మరణం ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజలకు, కాపు సామాజిక వర్గానికి తీరని లోటు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading