తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో పారదర్శకత, ప్రజలతో నేరుగా సంబంధం అనే లక్ష్యాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమానికి స్పూర్తిగా నిలుస్తున్నారు మంత్రి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి ఇంటిని చేరేలా తీర్చిదిద్దడం లోకేష్ గారి నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ కార్యక్రమాన్ని జూలై 2న మంగళగిరి తాడేపల్లి మహానాడు కాలనీలో నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి రోజు… పార్టీ శ్రేణులతో వీడియో కాల్స్, సమీక్షలు, మార్గదర్శకాలతో నిత్యం సంప్రదింపులు చేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపిస్తున్నారు.
టెక్నాలజీతో సమర్ధంగా నిర్వహణ
ఈ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని సమర్ధంగా నడిపించేందుకు టెక్నాలజీని వినూత్నంగా వినియోగించడంలో నారా లోకేష్ ముందున్నారు.
SMSలు, IVRSలు ద్వారా గ్రౌండ్ లో ఉన్న నాయకులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు.
ప్రతి రోజు ఎంత మంది కార్యకర్తలు ఎంత మంది ఇంటిని సందర్శించారో డ్యాష్ బోర్డ్‌లో ప్రత్యక్షంగా ట్రాక్ చేస్తూ, ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ తక్షణమే చొరవ తీసుకుంటున్నారు.
ఎలాంటి సమస్య వచ్చినా గ్రూప్ కాల్స్, వర్చువల్ మీటింగ్‌లు ద్వారా వెంటనే పరిష్కారం చూపిస్తున్నారు.
ప్రతీ కార్యకర్తకు ప్రోత్సాహం – ‘మీ వెనుక నేనున్నా’
ప్రతి కార్యకర్తను తన పక్కనే ఉన్న సహోద్యోగిగా భావించే లోకేష్, కార్యక్రమంలో పాల్గొంటున్న వారిని వ్యక్తిగతంగా అభినందిస్తూ, “మీ వెనుక నేనున్నా” అనే భరోసా మాటలతో వారికి మనోబలాన్ని అందిస్తున్నారు.
ఆధునిక ఐటీ మంత్రిగా తన అనుభవాన్ని వినియోగించి, కార్యకర్తలకు అవసరమైన గైడెన్స్, రూట్ మ్యాప్స్, కార్యకలాపాలు పంపిస్తున్నారు. అంతేకాకుండా సమస్యలు ఎదురైన చోట్ల మంత్రులు, నాయకులు ఎలా స్పందించాలో ముందుగానే సలహా ఇస్తున్నారు.
80కి పైగా నియోజకవర్గాల్లో మంత్రి పర్యవేక్షణ
తన నియోజకవర్గంలోనే కాకుండా, 80 నుండి 85 నియోజకవర్గాల్లో కార్యక్రమం విజయవంతంగా కొనసాగేలా మంత్రి నారా లోకేష్ శ్రద్ధ వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తూ పార్టీ వ్యూహాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నారు.
కేవలం గణాంకాల కోసం మాత్రమే కాదు… లోకేష్ గారి దృష్టి ప్రజల అభిప్రాయాలపై. వారు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు? పథకాలు వారికి అందుతున్నాయా? ఇంకా ఏమేమి అవసరమవుతుందో తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే ప్రతీ ఇంటికి వెళ్లినప్పుడు ఆ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు.