ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి పరిధిలోని శాఖమూరులో గల పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని జూన్ 3న దర్శించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం కేవలం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకే కాకుండా, దేశంలో భాషా ప్రాతిపదికన భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి మార్గదర్శకంగా నిలిచిందని కొనియాడారు. అటువంటి మహనీయుడిని ఒకే కులానికి పరిమితం చేయడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
సమాజంలో ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు, ఆ తప్పు చేసిన వ్యక్తిని మాత్రమే మనం దోషిగా భావించాలి. అంతే తప్ప.. ఆ వ్యక్తి చేసిన నేరాన్ని అతని కులానికో, లేక ప్రాంతానికో ఆపాదించడం సరైన పద్ధతి కాదు. దురదృష్టవశాత్తూ, గత రెండు దశాబ్దాలుగా మన రాజకీయాల్లో కుల దూషణలు, విద్వేషాలు చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇవి తారస్థాయికి చేరుకున్నాయి. ఒక వ్యక్తి చేసే వ్యక్తిగత తప్పును మొత్తం సమాజానికి, ఒక కులానికి అంటగట్టి, అందరి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం ఆనవాయితీగా మార్చేశారు. దీనివల్ల ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. ఇదే పద్ధతి ఇలాగే కొనసాగితే సమాజం విచ్ఛిన్నమవడం ఖాయం.
ఈ కుల విద్వేషాలకు ఎక్కడో ఒకదగ్గర మనం చెక్ పెట్టాలి. ఆ ఉన్నతమైన ఆలోచనతోనే జనసేన పార్టీ తరఫున “సేనా గళం” పేరుతో అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులతో ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేశాం. ఈ “సేనా గళం” కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా నిర్భయంగా ఎత్తి చూపుతుంది. ఒక కులానికి సంబంధించిన వ్యక్తి తప్పు చేస్తే.. అదే కులం వారితో తిట్టించడం, నిందించడం లాంటి సంకుచిత రాజకీయాలు ఇకపై ఇక్కడ సాగవు. కులాలతో సంబంధం లేకుండా, సమష్టిగా ఈ “సేనా గళం” తప్పును ఎండగడుతుంది, వాస్తవాలను సమాజం ముందు ఉంచుతుంది.
ఈ కుల చట్రంలో సామాన్యుడే సమిధ గా మారిపోతున్నాడు. గత వైసీపీ హయాంలో జర్నలిస్టులకు కూడా కులాలను అంటగట్టి విభజించిన పరిస్థితిని మనం చూశాం. ఎవరైనా సామాన్యుడు తప్పు చేసినా, మొత్తం కులానికి ఆ తప్పును అంటగట్టేవారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నట్లు కుల నిర్మూలన ఎప్పటికి జరుగుతుందో లేదో తెలియదు కానీ…., ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య పరస్పర సహకారం చాలా అవసరం. ముందు మనం కులాల చట్రం నుండి బయటకు వచ్చి, తప్పును తప్పుగా చూసి, దాన్ని అర్థం చేసుకునే చైతన్యాన్ని తెచ్చుకోవాలి. తెలంగాణలో ప్రజలందరినీ కలిపి ఉంచే ఒక బలమైన భావోద్వేగం, “తెలంగాణ” అనే ఒక నినాదం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో “నా ఆంధ్ర” అనే ఒక ఉమ్మడి భావన, ఆ ఉనికి కనిపించడం లేదు. ఆంధ్ర రాష్ట్రానికి అసలైన గుర్తింపును, ఉనికిని ఇచ్చిన అమరజీవి “శ్రీ పొట్టి శ్రీరాములు” లాంటి గొప్ప మహానుభావుడిని కూడా మనవాళ్లు కేవలం ఒకే ఒక కులానికి పరిమితం చేసి చూస్తున్నారు. ఆయన త్యాగం అమూల్యం. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం వల్లే స్వతంత్ర భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. ఈ విషయాలను మనం కులాల గీతలు దాటి ఆలోచించాలి.
వైసీపీ హయాంలో ఒక ఎమ్మెల్సీ “దళిత యువకుడి”ని చంపి కారులో డోర్ డెలివరీ చేస్తే.. ఆ నేరం ఆరోపించబడ్డ ఎమ్మెల్సీని వెనకేసుకొచ్చారు తప్ప, దళిత సంఘాలు దానిపై బలంగా మాట్లాడలేదు. కరోనా సమయంలో “డాక్టర్ సుధాకర్” ని మానసికంగా హింసించి చనిపోయేలా చేస్తే అప్పుడూ దళిత సంఘాలు మాట్లాడలేదు. కొందరు కుల సంఘాల నాయకులు సమయానుకూలంగా తమ స్వార్థానికి సంఘాలను వాడుకుంటున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు నాయకులు కొన్ని విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఈ కుల చట్రంలో ప్రతిసారీ సామాన్యుడే సమిధగా మారుతున్నాడు. అధికారం పోగానే వైసీపీ మరింత బరితెగించి కుల దూషణలు చేస్తూ, ప్రజలను రెచ్చగొడుతోంది. సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే పెద్ద కుట్ర దీని వెనుక దాగి ఉంది.
ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి కేవలం ఒకే ఒక్క కులం మద్దతు ఉంటే సరిపోదు. సమాజంలో ఉన్న అన్ని కులాల మద్దతు, సహకారం కావాలి. ఈ కులాల ఊబిలో, భావోద్వేగాల్లో పడి రాష్ట్ర ప్రజలు కనీసం రాష్ట్ర అభివృద్ధి గురించి, తమ భవిష్యత్తు గురించి కూడా స్పష్టంగా ఆలోచించలేని స్థితికి వచ్చేసారు. కావాలనే సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారు. మనం ఈ పంథా నుంచి బయటకు రావాలి. దేశ సమగ్రత, సుస్థిరత మాత్రమే మనందరి లక్ష్యం కావాలి అన్నారు.
తెలంగాణ కు సంబంధించి పాత్రికేయుల ప్రశ్న కు సమాధానంగా….. తెలంగాణ ఖచ్చితంగా భూమి పుత్రుల జాగీరే. అక్కడి నేల బిడ్డలు, తెలంగాణ యువత పోరాడి సాధించుకున్న జాగీరే. ఆ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. గతంలో నన్ను తెలంగాణకు రానివ్వము అని కొందరు అన్నప్పుడు మాత్రమే.. “అదేమైనా మీ అయ్య జాగీరా” అని నేను ప్రశ్నించాను. అంతే తప్ప.. తెలంగాణపై నాకున్న ప్రేమ, తెలంగాణ యువత సాగించిన వీరోచిత పోరాటాలపై నాకున్న మమకారం ఎప్పటికీ పోదు. నా స్నేహితుడు కేటీఆర్ గారు అన్న మాటలను నేను పూర్తిగా వినలేదు. అమరజీవి పొట్టి శ్రీరాములు కూడా రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం తన ప్రాణాన్ని అర్పించారు తప్పితే….. అది ప్రాంతీయ విద్వేషం కిందకు రాదు. ఆయన ఎప్పుడూ పక్క రాష్ట్రం వారిని “మా రాష్ట్రంలోకి రావొద్దు” అని చెప్పలేదు. ప్రజల మనసుల్లో నాటే విద్వేష విత్తనాలు భవిష్యత్తులో చాలా పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి. అది దేశానికి కూడా శ్రేయస్కరం కాదు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య బంధుత్వాలు, సంబంధాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాలు, కాంట్రాక్టులు కూడా జరుగుతున్నప్పుడు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఎందుకు….? కాంగ్రెస్ పార్టీ కూడా తన జాతీయ పార్టీ పంథాను వీడి, ఇలా ప్రాంతీయతను రెచ్చగొట్టేలా మాట్లాడటం ఆ పార్టీ కి శ్రేయస్కరం కాదు ఆమాటలు మానుకోవాలి.
జాతీయ సమగ్రత విషయంలో కాంగ్రెస్‌కు ఒక స్పష్టమైన విధానం ఉండాలి. ఇలా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ పోతే…… కాంగ్రెస్ పార్టీ “జెన్ జీ” (Gen Z) యువతకు దేశ సుస్థిరత విషయంలో ఎలాంటి మార్గనిర్దేశం చేస్తుంది….? దాదాపు 12 ఏళ్ల తర్వాత నేను తెలంగాణలో ఒక సభ పెట్టాలని అనుకున్నాను. సాధారణంగా దానికి అనుమతి ఇచ్చి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని వెనుక ఉన్నారని నేను అనుకోవడం లేదు. కొందరు మధ్యలోని వ్యక్తులే ఆ సభకు ఆటంకాలు కలిగించి ఉంటారని భావిస్తున్నాను అని అన్నారు.
జగన్ గురించి మాట్లాడుతూ…. మూడు రాజధానులు అయిపోయాయి.. ఇప్పుడు మూడు జిల్లాల రాజధానా అని ప్రశ్నించారు….. అమరావతి ఉద్యమ సమయంలో రాష్ట్ర ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే, ఒక ఉమ్మడి భావన తో వాళ్ళని కలపాలనే “జై ఆంధ్ర” నినాదం ఇవ్వాలని నేను కోరాను. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ ఐదేళ్ల పాటు కాలయాపన చేసింది. ఇప్పుడు అధికారం పోయాక, మళ్లీ మూడు జిల్లాలను కలుపుతూ ఏదో కొత్త పేరుతో కొత్త రాజధాని నాటకాలు ఆడుతోంది. 2014లో “అమరావతి” అనే రాజధాని నిర్ణయం ఏకగ్రీవంగా జరిగింది. దానికి కట్టుబడి మనం ముందుకు వెళ్లాలి. ప్రతిసారీ అధికారంలోకి వచ్చిన వారు తమ ఇష్టానుసారం రాజధానిని మార్చుకుంటూ మాట్లాడటం సరికాదు. ఇక్కడి రైతులు ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాల భూమిని త్యాగం చేసి ఇచ్చారు. ఇక్కడ రాజధానిని అద్భుతంగా అభివృద్ధి చేయాలి. రాజధాని అనేది రాత్రికి రాత్రి పూర్తయ్యే ప్రక్రియ కాదు. అది భవిష్యత్తు తరాలకు దిశానిర్దేశం చేసే ఒక మహా వ్యవస్థ. ప్రతిసారీ అమరావతి విషయంలో వైసీపీ “ద్వంద్వ” విధానాలు అవలంబిస్తూ ప్రజల్లోనూ, పారిశ్రామికవేత్తల్లోనూ కావాలనే అయోమయం నెలకొల్పుతోంది.
జనసేన నూతనంగా ఏర్పాటు చేసిన ఈ “సేనా గళం” సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరినీ, అన్ని సామాజిక వర్గాలను ఏకం చేయాలనే ఒక బృహత్తర ఆశయంతో, స్పష్టమైన విలువల విధానంతో ముందుకు సాగుతుంది. అని ఆయన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టి చెప్పారు