ఆంధ్ర ప్రదేశ్

వైఎస్ జగన్ తన “కాలు తానే తొక్కుకుంటున్నారా”…?

Published by
Suresh Thota

ఒకసారి నటుడు బ్రహ్మానందం ఒక ఇంటర్వ్యూలో ఒకమాట చెప్పారు. “అందరూ బాగుండాలి అనుకుంటాడు ప్రతి మనిషి, కాని తన కన్నా వాళ్ళు బాగుండాలి అని కోరుకోడు”. అవును ఇది వాస్తవం ఇక్కడ రాజధాని విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఒక్కసారిగా భూముల రేట్లు పెరగడం. అక్కడ కొంతమంది భూములు కొనుక్కోవడం, కొంతమంది కి వీలు కుదరకపోవడం తో అసూయ, ఈర్ష్య ద్వేషాలు చోటు చేసుకోవడం తో అమరావతి రాజధాని కి ఈ చిక్కులు వచ్చాయి. ఇంతకన్నా లోతుగా చర్చ అనవసరం ప్రస్తుతం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం కేవలం ఒక నగరానికి సంబంధించిన చర్చ కాదు. అది రాష్ట్ర భవిష్యత్తు, వేలాది మంది రైతుల త్యాగం, పెట్టుబడిదారుల నమ్మకం, ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం. అలాంటి అంశంపై అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి మాట ఎంతో విలువ తో విశ్వసనీయత కలిగి ఉంటుంది. “వైఎస్ జగన్” ఇటీవల రాజధానిపై చేసిన భిన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఒక కొత్త చర్చకు దారితీశాయి. అసలు ప్రశ్న మూడు రాజధానులా, ఒక రాజధానా అనేది కాదు. జగన్ నిర్ణయాల వెనుక సరైన రాజకీయ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ పనిచేస్తోందా…? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

అమరావతి రాజధాని విషయంలో భారతదేశ రాజకీయ చరిత్రలో అరుదైన సంఘటన జరిగింది. వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భూ సమీకరణ పద్ధతిలో సుమారు 33 వేల ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు…ఇచ్చారు. గతంలో పశ్చిమ బెంగాల్‌లో టాటా మోటార్స్ ప్రాజెక్టు కోసం వెయ్యి ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సంకల్పిస్తే అది భారీ రాజకీయ ఉద్యమానికి దారితీసింది. ఈ రెండు సంఘటనలను పోల్చి చూస్తే, అమరావతి రైతులు చేసిన త్యాగం ఎంత విలువైనదో , అసాధారణమైనదో అర్థమవుతుంది. అందుకే ఈ అంశంపై తీసుకునే ప్రతి నిర్ణయం సాధారణ రాజకీయ నిర్ణయం కాదు.

“వైఎస్ జగన్” అధికారంలోకి వచ్చిన తర్వాత వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ తర్వాత మావిగన్ వంటి కొత్త భావనలు ముందుకు వచ్చాయి. ఇటీవల మరోసారి రాజధాని అంశంపై కొత్త వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒకటే “అంతిమంగా వైఎస్ జగన్ విధానం ఏమిటి”…? ఒక నాయకుడు విధానాన్ని మార్చుకోవచ్చు. కానీ మార్పుకు స్పష్టమైన కారణం, స్పష్టమైన దిశ, ఖచ్చితమైన సందేశం ప్రజలకు చేరాలి. లేకపోతే గందరగోళమే మిగులుతుంది.

ఇక్కడ వ్యక్తిగత అభిరుచుల గురించి చర్చించడం అవసరం లేదు. జగన్‌కు అమరావతి ఇష్టమా…? కాదా…? అనే ప్రశ్న కూడా ప్రధానమైనది కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన, రైతుల ఆందోళనలు, పార్టీ కార్యకర్తల సందిగ్ధత, పెట్టుబడిదారుల ఆలోచనలు యథాతథంగా ఆయన వరకు చేరుతున్నాయా….? లేక మధ్యలోనే అవి వడపోత కు గురై మారిపోతున్నాయా….? నాయకత్వం తీసుకునే నిర్ణయాలు, ఆయనకు చేరే సమాచార నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకుడి చుట్టూ ఉండే సలహాదారుల బాధ్యత కేవలం నాయకుడికి నచ్చే విషయాలు చెప్పడం కాదు. ప్రజలకు నచ్చని నిజాలను కూడా ధైర్యంగా చెప్పగలగడం. నాయకుడు తీసుకునే ప్రతి నిర్ణయానికి క్షేత్రస్థాయిలో వచ్చే ప్రతిస్పందనను ముందుగానే అంచనా వేసి హెచ్చరించడం. అలాంటి వ్యవస్థ బలంగా ఉంటే నిర్ణయాలు కూడా బలంగా ఉంటాయి. లేకపోతే ప్రజల్లో ఏర్పడే అసంతృప్తి ఎన్నికల నాటికి పెరిగే ప్రమాదం ఉంటుంది.

రాయలసీమలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, కొత్త పెట్టుబడుల పై ప్రజల్లో ఆశలు ఉన్నాయి. ఆ ప్రాంత అభివృద్ధి ఎంత అవసరమో, అదే సమయంలో అమరావతి అంశం కూడా లక్షలాది మంది ప్రజలకు అంతే అవసరం. ఒక ప్రాంత అభివృద్ధిని మరో ప్రాంత విశ్వాసానికి ప్రత్యర్థిగా చూపించే పరిస్థితి ఏర్పడితే, రాజకీయంగా అది ఎవరికీ లాభం చేకూర్చదు. రాష్ట్రానికి సమతుల్యత కలిగిన అభివృద్ధి అవసరం, విభజనాత్మక చర్యలు, చర్చలు కాదు. రాజకీయాల్లో ప్రజలు విధాన మార్పులను అంగీకరిస్తారు. కానీ మాట మార్పులను అంత సులభంగా అంగీకరించరు. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చాల్సి వస్తే, దానికి బలమైన కారణాలు, స్పష్టమైన వివరణ, దాని అమలు, సరైన ప్రణాళిక ఉండాలి. లేకపోతే చర్చ అభివృద్ధి గురించి కాకుండా నాయకత్వ విశ్వసనీయత గురించి మారిపోతుంది. అదే ఏ రాజకీయ నాయకుడికైనా పెద్ద సవాలు.

ఈ మొత్తం వ్యవహారంలో “వైఎస్ జగన్‌” ప్రతి దాన్ని విమర్శించడం మాత్రమే లక్ష్యంగా చేసుకో కూడదు. అంతకంటే ముఖ్యంగా, ఆయన నిర్ణయాలకు ముందు అన్ని కోణాల్లో నిజమైన సమాచారం ఆయన టేబుల్‌పైకి వస్తోందా అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. ప్రజల అభిప్రాయాన్ని చెప్పే వారికంటే, నాయకుడికి నచ్చే మాటలే చెప్పే వారు ఎక్కువైతే, అది ఏ నాయకుడికైనా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో నాయకుడి బలం ఆయన చుట్టూ చప్పట్లు కొట్టే వారి సంఖ్యలో ఉండదు, నిస్వార్ధంగా నిజం చెప్పే వారి ధైర్యంలో ఉంటుంది.

రాజకీయ చరిత్ర ఒక విషయాన్ని పదేపదే నిరూపించింది. నాయకులను ప్రత్యర్థులు మాత్రమే బలహీనపరచరు. చాలాసార్లు, సరైన సమయంలో సరైన ఫీడ్‌బ్యాక్ అందకపోవడమే పెద్ద నష్టానికి కారణమవుతుంది. ప్రజల నిజమైన మనోభావాలు నాయకుడి వరకు చేరకపోతే, వ్యూహాలు కాగితాలపై బలంగా కనిపించినా, ప్రజల్లో బలహీనపడతాయి. అందుకే ఒక నాయకుడికి నిజం చెప్పగల వ్యవస్థ, అతని రాజకీయ భవిష్యత్తుకు రక్షణ కవచంలా ఉంటుంది. ఇది జగన్ కే కాదు, ప్రతి నాయకుడికి వర్తిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకుడికి వర్తించే ఒక మౌలిక సూత్రం. రాజకీయాల్లో ప్రత్యర్థులు నాయకుడిని ఓడించరు, చాలా సందర్భాల్లో నాయకుడు తీసుకున్న నిర్ణయాలే ఆయనకు అతిపెద్ద అవరోధంగా మారతాయి. ఆ నిర్ణయాలకు ముందు నిజమైన ప్రజాభిప్రాయం నాయకుడి టేబుల్‌పై చేరిందా….? లేక మధ్యలోనే ఎక్కడైనా వడపోతకు గురైందా….? ఇదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు వేస్తున్న అసలు ప్రశ్న.

ముగింపు: ప్రజాస్వామ్యంలో ఒక తప్పు నిర్ణయం కంటే ప్రమాదకరమైనది మరొకటి ఉండదు, తప్పు నిర్ణయం తీసుకునే పరిస్థితిని అధిగమించాలి నాయకుడు…అది సృష్టించే వ్యవస్థను సరిదిద్దుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన రోజే, నాయకత్వం కూడా బలపడుతుంది, ప్రజల విశ్వాసం కూడా మరింత దృఢపడుతుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత తన కాలును తానే తొక్కుకుంటున్నట్లుగా పరిస్థితి కనపడుతుంది. వైసీపీ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.