
వినాశ కాలే విపరీత బుద్ధి” చెడు కాలం దాపురించినప్పుడు, ఎంత తెలివైన వారికైనా మంచి, చెడులు అర్థం కావు. వారు చేసే పనులే వారి పతనానికి కారణమవుతాయి. ఒక వ్యక్తి పతనం ప్రారంభ మైనప్పుడు, వారి ఆలోచనలు కూడా మోసపూరితంగా మరియు చెడుగా మారతాయి. అటువంటి వ్యక్తి నే బొల్లా బ్రహ్మనాయుడు కూడా, తాను బాధ్యత కలిగిన ఒక మాజీ ప్రజాప్రతినిధిగా, అందరికీ ఆదర్శం గా నిలవాలి అనే ధ్యాస లేకుండా, ఒక భూమిని స్వాహా చేద్దామనుకుని తప్పు లో కాలేసి, తప్పించుకు తిరుగుతున్నాడు.
తెలంగాణ రాజధాని “హైదరాబాద్” చుట్టుపక్కల భూముల ధరలు రెక్కలు తొడిగి ఎగురుతున్న వేళ, ల్యాండ్ మాఫియా కళ్ళు ప్రభుత్వ భూములపై పడ్డాయి. సామాన్యుడికి సొంత ఇల్లు ఒక కల అయితే, రాజకీయ, అక్రమార్కుల అండదండలు ఉన్న కొందరికి వందల కోట్ల ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టడం ఒక వ్యాపారంగా మారింది. ఇటీవల వెలుగుచూసిన గండిపేట (నార్సింగి) భూ కుంభకోణం ఉదంతం, భూ రికార్డుల నిర్వహణలోని లోపాలను, రాజకీయ నేతల అత్యాశను, క్రిమినల్ ముఠాల తెగింపును మరోసారి సమాజం ముందు ఉంచింది.
ఈ మొత్తం వ్యవహారంలో “వినుకొండ” మాజీ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు ప్రమేయం ఉండటం, ఏకంగా ప్రభుత్వ ఉత్తర్వులనే (GOs) ఫోర్జరీ చేయడం ల్యాండ్ మాఫియా ఏ స్థాయికి విస్తరించిందో స్పష్టం చేస్తోంది. గండిపేట మండలం “నార్సింగి” పరిధిలో ఉన్న దాదాపు 10 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఈ వివాదానికి కేంద్రబిందువు. మార్కెట్ ధర ప్రకారం దీని విలువ అక్షరాలా రూ. 1,000 కోట్ల నుండి రూ. 1,500 కోట్ల పైమాటే. గతంలో ఈ భూమి తమదేనంటూ కొందరు కోర్టు మెట్లు ఎక్కినా, న్యాయస్థానం ఆ పిటిషన్లను కొట్టేసి అది ప్రభుత్వ భూమేనని తేల్చి చెప్పింది.
అయినప్పటికీ, అక్రమార్కుల ఆకలి తీరలేదు. కోర్టు తీర్పును సైతం పక్కన పెట్టి, సదరు భూమిని తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరించిందంటూ (Regularized) ఏకంగా ఐదు నకిలీ జీవోలను సృష్టించారు. సాధారణంగా ఒక జీవో విడుదల కావాలంటే సచివాలయం స్థాయి నుండి ఎన్నో వడపోతలు జరగాలి. కాని ఈ అక్రమార్కులు “సిసిఎల్‌ఏ” (CCLA) ఉన్నతాధికారుల సంతకాలతో పాటు, నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న “హైడ్రా” (HYDRA) కమిషనర్ “రంగనాథ్” సంతకాన్ని సైతం ఫోర్జరీ చేయడం సంచలనం సృష్టించింది. వ్యవస్థలను వీరు ఎంత తేలికగా తీసుకున్నారో చెప్పడానికి ఈ ఫోర్జరీ సంతకాలే నిదర్శనం. ఈ భారీ కుంభకోణం వెనుక నిందితుల క్రిమినల్ ఆలోచనలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే “బొల్లా బ్రహ్మనాయుడు” ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.
పోలీసుల దర్యాప్తు ప్రకారం… భూమిపై ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేని ఒక స్థానిక కుటుంబంతో మాజీ ఎమ్మెల్యే మరియు ఆయన బంధువు ఒక క్రిమినల్ ఒప్పందం (MoU) కుదుర్చుకున్నారు. ఎకరాకు రూ. 3.5 కోట్ల చొప్పున ఆ భూమిని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ భూమిని ఎలాగైనా రెగ్యులరైజ్ చేయిస్తానంటూ నమ్మించిన రాధాకృష్ణ అనే పాత నేరస్థుడికి, నకిలీ పత్రాలు మరియు జీవోల సృష్టి కోసం దాదాపు రూ. 8 కోట్ల రూపాయలు చెల్లించినట్లు దర్యాప్తులో తేలింది. అర్థబలం, అధికారం, అంగబలం ఉంటే ప్రభుత్వ భూములను కూడా తమ సొంతం చేసుకోవచ్చనే అహంకారానికి ఈ ఒప్పందమే ఒక ఉదాహరణ.
”అతి సర్వత్ర వర్జయేత్” (అతి ఎక్కడైనా ప్రమాదకరమే) అన్నట్లు… అక్రమంగా సంపాదించాలనే అతి ఆశే ఈ ముఠాను దొరకబుచ్చుకునేలా చేసింది. నకిలీ జీవోల ప్రతులు వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేయడంతో స్థానిక తహసీల్దార్ అలర్ట్ అవ్వడం, చివరకు ఈ వెయ్యి కోట్ల స్కామ్ వెలుగులోకి రావడం వెంటవెంటనే జరిగిపోయాయి.
“నార్సింగి” భూ కుంభకోణం కేవలం ఒక మామూలు ఘటన కాదు. హైదరాబాద్ పరిసరాల్లో ఇలాంటి నివురు గప్పిన నిప్పు లాంటి స్కామ్‌లు ఎన్నో ఉన్నాయనే గుసగుసలకు ఇది బలాన్ని చేకూరుస్తోంది. “ధరణి” లాంటి డిజిటల్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా, నకిలీ జీవోల పేరిట సాగుతున్న ఈ తరహా వ్యాపారాలు ఆందోళనకరం. ప్రస్తుతం పోలీసులు కొందరు నిందితులను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అయితే, కేవలం అరెస్టులతోనే ఈ సమస్య ముగిసిపోదు.
వ్యవస్థలను, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఇలాంటి శక్తులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి, కఠినమైన శిక్షలు పడేలా చూడాలి. ప్రభుత్వం విడుదల చేసే ప్రతి జీవో లేదా ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఉత్తర్వులను సామాన్యులు సైతం క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా తక్షణమే వెరిఫై చేసుకునేలా మరింత పారదర్శకమైన సాంకేతికతను అంటే డిజిటల్ వెరిఫికేషన్ తీసుకురావాలి. విలువైన ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించి, వాటి చుట్టూ రక్షణ గోడలు లేదా నిఘా బోర్డులను ఏర్పాటు చేయాలి.
ముగింపు: రాజకీయ నాయకులు, అక్రమార్కులు , భూ మాఫియా, తోడైతే ప్రభుత్వ ఆస్తులను ఎంత సులభంగా మింగేయవచ్చో ఈ కేసు నిరూపించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం చెబుతున్నా, ఇలాంటి పెద్ద తలకాయలు ఉన్న కేసులలో విచారణ నత్తనడకన సాగకుండా త్వరితగతిన ముగింపు పలకాలి. అప్పుడే ప్రభుత్వ భూములపై కన్నేసే ల్యాండ్ మాఫియా గుండెల్లో వణుకు పుడుతుంది. ప్రభుత్వ సొత్తు… ప్రజా సొత్తు అనే విషయాన్ని పాలకులు, అధికారులు విస్మరించకూడదు.
