
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తన కుమారుడు ఆరవ్ వర్మపై నమోదైన రోడ్డు ప్రమాదం కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణలపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా, గురువారం కోర్టులో హాజరుపరిచారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం అప్పలరాజుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, కేసులో అసలు నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయని గుర్తించినట్లు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, ఆరవ్ వర్మకు బదులుగా సిద్ధార్థ త్యాడి అనే వ్యక్తిని నిందితుడిగా చూపించే ప్రయత్నం జరిగిందని, అలాగే బాధిత కుటుంబాన్ని ప్రలోభపెట్టడం, ప్రమాదానికి సంబంధించిన ఆధారాలను మార్చి కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో భాగంగానే ఆయనను అరెస్ట్ చేసి పలాస కోర్టులో హాజరుపరచగా, కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
