కులగణనపై పూర్తిస్థాయి వివరణ ఇచ్చిన సీఎం

Published by
Srinivas

తెలంగాణలో చేపట్టిన బీసీ కులగణన సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చారు. కులగణన చేయాలనే నిర్ణయమే చారిత్రాత్మకమని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

రాహుల్ గాంధీ ఆశయం మేరకే రాష్ట్రంలో సమగ్ర కులగణన సర్వే చేపట్టామని తెలిపిన రేవంత్ రెడ్డి, సర్వేపై తలెత్తిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేశారు. మరీ ముఖ్యంగా మరోసారి సర్వే ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన సీఎం.. గతంలో మిస్సయిన వాళ్ల కోసం మాత్రమే రెండోసారి సర్వే చేపడుతున్నాని, ఇదేదో చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. తనను సర్వేలో చేర్చలేదని ఏ తెలంగాణ పౌరుడు కోర్టుకు వెళ్లే ఆస్కారం లేకుండా రెండోసారి కులగణన చేస్తున్నామని అన్నారు.

కులగణనకు సంబంధించి కేవలం కంప్యూటర్ లో డేటా మాత్రమే కాదని, క్షేత్రస్థాయిలో రాసిన కాగితాల బండిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయని, బీఆర్ఎస్ నేతలకు ఎవరికైనా అనుమానం ఉంటే నియోజకవర్గం, వార్డు ఆధారంగా ఆ బండిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చన్నారు సీఎం.

రాష్ట్రవ్యాప్తంగా 3 రోజుల పాటు జరిగిన ఈ సర్వే సూపర్ సక్సెస్ అయిందన్నారు రేవంత్ రెడ్డి. మొత్తం 8 పేజీల్లో ఇంటి యజమానులు ఇచ్చిన సమాచారాన్ని పొందుపరిచామని, 15 శాఖలకు చెందిన అధికారులు ఇందులో పాల్గొన్నారని, 36వేల మంది డేటా ఆపరేటర్లను అదనంగా నియమించామని అన్నారు. కోటీ 12 లక్షల మంది కులగణన సర్వేలో పాల్గొన్నారని, ఎవరైతే సమాచారం సేకరించారో, వాళ్లే డేటాను కూడా ఎంట్రీ చేశారని క్లారిటీ ఇచ్చారు రేవంత్.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.