Download App

డీల్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయకేతనం

జూన్ 16, 2026 By Suresh Thota
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖల బాధ్యతలు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాటి నుండి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. కేవలం పరిశీలనలకే పరిమితం కాకుండా, నిరంతరం క్షేత్ర స్థాయిలో మమేకమవుతూ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం...
డీల్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయకేతనం

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖల బాధ్యతలు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాటి నుండి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. కేవలం పరిశీలనలకే పరిమితం కాకుండా, నిరంతరం క్షేత్ర స్థాయిలో మమేకమవుతూ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ మద్దతును కూడగట్టడంలో ఆయన చూపిస్తున్న చొరవ సర్వదా అభినందనీయం. ఇటీవల ఆయన డీల్లీ పర్యటనలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ వీరిద్దరితో జరిపిన భేటీలు, సాధించిన సానుకూల ఫలితాలు ఏపీ అభివృద్ధికి సరికొత్త దశ, దిశను చూపిస్తున్నాయి.

​కేంద్రం మెచ్చిన ఏపీ గ్రామీణాభివృద్ధి నమూనా

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఉప ముఖ్యమంత్రి జరిపిన సమావేశం రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “మ్యాజిక్ డ్రెయిన్స్”, “నీటి తొట్టెలు” తదితర నూతన నిర్మాణ కార్యక్రమాలను కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. కేవలం అభినందించడమే కాకుండా, ఈ మ్యాజిక్ డ్రయిన్స్ నిర్మాణ శైలిని తన సొంత నియోజకవర్గ పరిధిలో కూడా వెంటనే ప్రారంభించాలని తన కార్యాలయ అధికారులను “శివరాజ్ సింగ్ చౌహాన్” ఆదేశించడం “పవన్ కళ్యాణ్” పాలనా దక్షతకు దక్కిన అరుదైన గౌరవం. అలాగే, రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పనులలో అత్యంత పారదర్శకంగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నందుకు కూడా కేంద్ర మంత్రి “పవన్ కళ్యాణ్” ను అభినందించారు.

డీల్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయకేతనం

“​విబి జీ రాంజీ” పథకం జాతీయ వేదికగా… ఆంధ్రప్రదేశ్

2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నుంచే దేశవ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అంకురార్పణ జరిగిన చారిత్రక నేపథ్యాన్ని ఈ సందర్భంగా “పవన్ కళ్యాణ్” గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో, రాబోయే జులై 1వ తేదీన “విబి జీ రాంజీ పథకం” జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించాలని ఆయన కోరగా, కేంద్ర మంత్రి అందుకు సానుకూలంగా స్పందించి, ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించారు. ఇది జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాధాన్యతను మరింత పెంచనుంది.

​’మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టు’ దిశగా….

మరోవైపు, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో జరిగిన భేటీ పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ విషయంలో చారిత్రాత్మక నిర్ణయాలకు వేదికైంది. రాబోయే పుష్కరాల నేపథ్యంలో జీవనది గోదావరిని మున్సిపల్, పారిశ్రామిక కాలుష్యం నుంచి పూర్తిగా రక్షించి, స్వచ్ఛమైన నదీ వ్యవస్థగా మార్చేందుకు “మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టు”ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సభ్యులను రాష్ట్రానికి పంపేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది.

డీల్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయకేతనం

​పర్యావరణం – వన్యప్రాణుల సంరక్షణకు 8 విజ్ఞప్తులు..

​ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి సమర్పించిన 8 ప్రధాన విజ్ఞప్తులకు కేంద్రం నుంచి పూర్తి సానుకూల స్పందన లభించింది.
​అరణ్యారామం అనుమతులు: రాష్ట్ర అటవీ శాఖ కామన్ ఫెసిలిటీ సెంటర్ ‘నూతన అరణ్యారామం’ నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఈ భవనంలో మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, హనుమాన్ మానిటరింగ్ సెంటర్, గ్రేట్ గ్రీన్ వాల్ పర్యవేక్షణ కేంద్రం, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ వంటి అత్యాధునిక విభాగాలు ఏర్పాటు కానున్నాయి.

టైగర్ రిజర్వ్ బేస్ క్యాంపుల పెంపు: నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో బేస్ క్యాంపులను 90 నుంచి 150కి పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. ఇక్కడ అదనంగా సిబ్బంది కావాల్సి ఉండగా 300 మంది స్థానిక చెంచు యువతను గార్డ్స్‌గా నియమించనున్నారు.

రాష్ట్రానికి 50 అడవి దున్నలు (ఇండియన్ గోర్): అటవీ ప్రాంతంలో అంతరించిపోయిన అడవి దున్నల పునరుద్ధరణ కోసం మధ్యప్రదేశ్ నుంచి 50 అడవి దున్నలను రప్పించేందుకు కేంద్ర మంత్రి సహకారంతో ఆ రాష్ట్ర సీఎం శ్రీ మోహన్ యాదవ్ అంగీకరించారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఇవి ఏపీకి రానున్నాయి.

ఆడ పులుల కొరత తీర్చే చర్యలు: రాష్ట్రంలో జన్యుపరమైన సమస్యలను నివారించేందుకు మహారాష్ట్ర నుంచి 4, మధ్యప్రదేశ్ నుంచి 2 చొప్పున మొత్తం 6 ఆడ పులులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఒప్పందం కుదిరింది.

డీల్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయకేతనం

కుంకీ ఏనుగుల రాక : సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న వన్య ఏనుగుల బెడద నుండి ఉత్తరాంధ్ర ప్రజలను, పంటలను రక్షించేందుకు ఒడిశా నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను ఇప్పించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.

గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్: 1,050 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని తుపానుల నుండి రక్షించేందుకు చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ‘మిస్టీ’ (MISTHI) పథకం కింద కేంద్ర నిధులు మంజూరు కానున్నాయి. తీర ప్రాంతాల్లో మడ అడవుల (Mangroves) పరిరక్షణ మరియు పునరుద్ధరణ కోసం భారత ప్రభుత్వం 2023లో MISHTI (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes) పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా తీర ప్రాంత కోతను నివారించడం, పర్యావరణ పరిరక్షణ మరియు స్థానికులకు జీవనోపాధి కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

ముగింపు: ​జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” జరిపిన ఈ డీల్లీ పర్యటన కేవలం రాజకీయ భేటీలకే పరిమితం కాలేదు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతులు సాధించడంలో కృతకృత్యులయ్యారు. పారదర్శకత, పర్యావరణ స్పృహ, తక్షణ కార్యాచరణ కలగలిసిన పవన్ కళ్యాణ్ ‘మార్క్ పాలన’ భావితరాల భవిత కోసం ఒక పరిశుభ్రమైన, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గోదావరి ప్రక్షాళన కోసం త్వరలోనే కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సహకారం కూడా తీసుకోనుండటం ఆయన పట్టుదలకు నిదర్శనం.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading