ప. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మరియు మోదీని లక్ష్యంగా చేసుకుని చేసిన “ఖేలా హోబే” (ఆట మొదలైంది) అనే నినాదం చివరకు మమత బెనర్జీ కే ఎదురుతిరిగింది. దీనిని కర్మ ఫలితం అంటారు. ఇప్పుడు “ఖేలా హోబే” అంటున్నారు…. సోషల్ మీడియాలో ప. బెంగాల్ బీజేపీ కార్యకర్తలు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఏప్రిల్ 29 న జరిగిన ఎన్నికల పలితాలు, మే 4న వెలువడి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దశాబ్ద కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు ఈసారి పరాభవం తప్పలేదు. ఇది కేవలం ఓటమి కాదు మమత బెనర్జీ పాలన పై ప్రజల యొక్క ఆక్రోశం ఈ విధంగా వెలిబుచ్చారు. కడపటి వార్తలు అందే సమయానికి 208 పైగా స్థానాల్లో బీజేపీ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా, మమత బెనర్జీ తను పోటీచేసిన భవానీపూర్ నియోజకవర్గంలో ఓటమి పాలైంది. TMC 79 నియోజకవర్గాల్లో తన పార్టీ ప్రాబల్యాన్ని కొనసాగిస్తుంది.
TMC రాజకీయ నాయకత్వ ధోరణిపై ఓటర్లు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఇది. మమత స్వయంకృతాపరాధం కూడా, రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినప్పటికీ, ఈ ఫలితాల వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తే అధికారంలో ఉన్నప్పుడుTMC ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే వాళ్ళ పట్ల యమ పాశంగా మారాయి. రాజకీయ ప్రత్యర్థులను “బయట వ్యక్తులు”గా చిత్రీకరించడం, వ్యక్తిగత స్థాయిలో విమర్శలకు దిగడం వంటి రాజకీయ వ్యూహాలు కొంతకాలం పనిచేసినా, దీర్ఘకాలంలో ప్రతికూల ఫలితాలను ఇచ్చినట్లు ఈ ఎన్నికలు సూచిస్తున్నాయి.
TMC పార్టీ అంతర్గత వ్యవస్థ కూడా ఈ ఓటమికి కారణాల్లో ఒకటిగా కనిపిస్తోంది. “మమత బెనర్జీ” మేనల్లుడు “అభిషేక్ బెనర్జీ” చుట్టూ అధికారం కేంద్రీకృతమవడం, వారసత్వ రాజకీయాల ఆరోపణలు, సీనియర్ నాయకులను పక్కన పెట్టడం అనే భావన పార్టీకి లోపలే అసంతృప్తిని పెంచాయి. ఇవి సంస్థాగత పార్టీ నిర్మాణ పునాదులను కదిలించాయి. అభిషేక్ బెనర్జీ… అమిత షా ను, మోడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం… యువత కు నచ్చలేదు.
చదువుకున్న యువతకు, ఉద్యోగాలు లేక సరైన ఉపాధి దొరకక ప్రత్యక్షంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం కంటే అవినీతి పైనే చర్చ ఎక్కువగా జరగడం ప్రభుత్వ ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. సామాజిక అంశాలు కూడా ఓటింగ్ ధోరణిని ప్రభావితం చేశాయి. “సందేశ్‌ఖాలీ” ఘటనలు, మహిళలపై దాడుల ఆరోపణలు, అలాగే కోల్‌కతాలోని ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ ఘటన వంటి విషయాలు మహిళా ఓటర్లలో మరియు విద్యావంతుల్లో ఆందోళన కలిగించాయి. ప్రభుత్వం స్పందన ఆలస్యంగా ఉందనే అభిప్రాయం మరింత వ్యతిరేకతను పెంచింది. ఆడవాళ్లు 7 గంటలు దాటిన తరువాత బయటకు రావద్దు, మీకు బయట ఏమి పని అని, ముఖ్యమంత్రి హోదాలో ఉండి మమత బెనర్జీ అడగటం…. ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎవరికి ఆ మాటలు రుచించలేదు…. పైగా బెడిసికొట్టి నేటి ఫలితాల రూపంలో కనపడ్డాయి.
మరోవైపు, బీజేపీ ఈ అసంతృప్తిని సమర్థంగా ఉపయోగించుకుంది. కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో బలమైన ప్రచారం నిర్వహించడం, స్థానిక సమస్యలను జాతీయ చర్చలోకి తీసుకురావడం ద్వారా ప్రత్యామ్నాయంగా ఎదిగింది. మత, సామాజిక సమీకరణాల అంశాలను కూడా వ్యూహాత్మకంగా వినియోగించింది. ఈ ఫలితాలు ఒక పెద్ద సందేశాన్ని ఇస్తున్నాయి, అధికారంలో ఉండటం మాత్రమే సరిపోదు, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కీలకం. రాజకీయాల్లో అహంకారం, కేంద్రీకృత నిర్ణయాలు, మరియు ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం చివరికి ప్రతికూలంగా మారతాయి.
ముగింపు : యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు నివసిస్తారు అని అర్థం. కాని ఆ కన్నీటికే స్త్రీ కారణం అయితే అన్నది బహుశా అప్పుడు ఆలోచించలేదేమో.