Download App

ప.బెంగాల్లో… నందిగ్రామ్ వీరుడికి పట్టాభిషేకం…

మే 8, 2026 By Suresh Thota
"ఎన్నాళ్ళో వేచిన ఉదయం… ఈనాడే ఎదురౌతుంటేఇన్ని నాళ్ళు దాచిన హృదయం… ఎగసి ఎగసి పోతుంటేఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమిఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి" డా. సి. నారాయణ రెడ్డి కలం నుండి జాలువారిన పదాలు నేడు ప. బెంగాల్ బీజేపీ కార్యకర్తల ఆకాంక్షను, ఆతృతను, తెలియజేస్తున్నాయి....
ప.బెంగాల్లో… నందిగ్రామ్ వీరుడికి పట్టాభిషేకం…

“ఎన్నాళ్ళో వేచిన ఉదయం… ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం… ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి”

డా. సి. నారాయణ రెడ్డి కలం నుండి జాలువారిన పదాలు నేడు ప. బెంగాల్ బీజేపీ కార్యకర్తల ఆకాంక్షను, ఆతృతను, తెలియజేస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనను, ఆపై సుమారు 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యాన్ని చెరిపివేస్తూ, బెంగాల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 206 స్థానాలతో ఘనవిజయం సాధించిన బీజేపీ, తన పార్టీ పగ్గాలను సమర్థుడైన నాయకుడు సువేందు అధికారి చేతిలో పెట్టింది. రేపు అనగా మే 9 వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండటంతో బెంగాల్‌లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.

ఉద్యమ నాయకత్వం నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు సువేందు అధికారి ప్రస్థానం కేవలం అధికారం చుట్టూ తిరిగింది కాదు. 2007లో నందిగ్రామ్ భూపోరాటంలో ఆయన పోషించిన పాత్ర అసామాన్యం. నాటి కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ఆ పోరాటమే బెంగాల్‌ లో కమ్యూనిస్టు కోటను కూల్చేశాయి. ఆ ఉద్యమమే అధికార మార్పుకు నాంది పలికింది. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో ప్రజల నాడి తెలిసిన మాస్ లీడర్. సామాన్య ప్రజలతో మమేకమవ్వడం, వారి సమస్యల కోసం పోరాడటం ఆయన శైలి. అయితే, ఏ ఉద్యమంతోనైతే మమతా బెనర్జీని అధికారంలోకి తీసుకువచ్చారో, అదే నందిగ్రామ్ వేదికగా 2021లో ఆమెను ఓడించి తన సత్తా చాటారు సువేందు అధికారి.

బీజేపీలో చేరిన తర్వాత సువేందు కేవలం ఒక నాయకుడిగానే కాకుండా, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన వ్యూహకర్తగా నిలిచారు. గత ఐదేళ్లుగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ, ప్రభుత్వం చేసే లోపాలను ఎండగట్టడంలో ఆయన వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా తనకు పట్టున్న పుర్బా మేదినీపూర్ (తూర్పు మేదినీపూర్) జిల్లాలో ఆయనకున్న తిరుగులేని ప్రజాదరణ, ఈ ఎన్నికల్లో “బీజేపీ”కి గ్రామీణ ఓటర్లను చేరువ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఒకప్పుడు తండ్రి “శిశిర్ అధికారి” వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చినా, నేడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, బలమైన కార్యకర్తల సైన్యాన్ని సంపాదించుకున్నారు.

ఒకప్పుడు “రేపు భారత్ ఏం ఆలోచిస్తుందో, బెంగాల్ ఈరోజే ఆలోచిస్తుంది” అనే పేరు ఉండేది. కానీ కాలక్రమేణా పారిశ్రామికంగా, ఆర్థికంగా బెంగాల్ చాలా వెనుకబడిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా “సువేందు అధికారి” ముందున్న ప్రధాన లక్ష్యాల లో ముఖ్యమైనవి….. పరిశ్రమల పునరుద్ధరణ ద్వారా మూతపడిన పరిశ్రమలను తెరిపించి, యువతకు ఉపాధి కల్పించడం. “శాంతి భద్రతలు” కోసం కఠినంగా వ్యవహరించి, అరాచక శక్తులను అణిచివేసి, ఎన్నికల తర్వాతి హింసకు పేరుగాంచిన బెంగాల్‌లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం. కేంద్రంతో సమన్వయం ద్వారా “డబుల్ ఇంజిన్” సర్కార్ నినాదంతో కేంద్ర పథకాలను, రాష్ట్ర ప్రజలకు నేరుగా అందించి లంచగొండితనం, అవినీతి ని అరికట్టడం. దేశ భద్రత కొరకు బోర్డర్ను కట్టుదిట్టం చేసి ఆక్రమణదారుల ను అణిచివేయడం. ప.బెంగాల్ ప్రజలు ఈసారి భావోద్వేగాల కంటే అభివృద్ధి వైపే మొగ్గు చూపారు. వారి “సోనార్ బంగ్లా” (బంగారు బెంగాల్) కల నిజం కావాలంటే, అది సువేందు అధికారి నాయకత్వంలోనే సాధ్యమని ఓటర్లు నమ్మారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం..

“చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం” అనే బెంగాల్ ప్రజల సామెతను, ఈ ఎన్నికల తీర్పు ద్వారా నిరూపించారు. రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవం కేవలం ఒక వ్యక్తి “పట్టాభిషేకం” మాత్రమే కాదు, బెంగాల్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం.

ముగింపు: సువేందు అధికారి ప్రమాణ స్వీకారంను, తన పుర్బా మేదినీపూర్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు, ఆయన అనునాయులు, సోషల్ మీడియా వేదికగా, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాము అంటూ… సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు… అవును నిజమే… దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న హృదయాల స్పందన ఇలానే ఉంటుంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading