తెలంగాణ

100 రోజుల్లో మేడారం అభివృద్ధి పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Published by
Srinivas

ములుగు జిల్లా మేడారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం సమితి ప్రతినిధులు, స్థానిక గిరిజన నాయకులతో సమావేశమై జాతర అభివృద్ధి పనులను సమీక్షించారు.

సీఎం రేవంత్ మాట్లాడుతూ – “మేడారం జాతర అభివృద్ధి పనులు ఇకపై వాయిదాలు లేకుండా 100 రోజుల్లో పూర్తి చేస్తాం. ఈ పుణ్యక్షేత్రం వెయ్యేళ్ల పాటు చెక్కుచెదరకుండా నిలిచేలా రాతితోనే పునర్నిర్మాణ పనులు చేపడతాం. ఇది కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు, గిరిజనుల గర్వకారణం కూడా” అని స్పష్టం చేశారు.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. “కుంభమేళాకు కేంద్రం వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుంది. కానీ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేళా అయిన మేడారం జాతరకు మాత్రం నిధులు ఇవ్వడం లేదు. ఇది గిరిజనులపై చిన్నచూపేనా?” అని ప్రశ్నించారు.

అదేవిధంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కూడా దాడి చేశారు. “ఇన్నేళ్లుగా బీఆర్‌ఎస్ సర్కార్ మేడారం అభివృద్ధిని పట్టించుకోలేదు. కేవలం మాటలు మాత్రమే చెప్పి పనులు వాయిదా వేశారు. కానీ మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో మేడారం అభివృద్ధి పనులను పూర్తి చేస్తుంది. మేడారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం మా లక్ష్యం” అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

స్థానిక గిరిజన నాయకులు, భక్తులు ఆయనకు తమ సమస్యలను వివరించారు. జాతర సమయంలో రవాణా, నీరు, శానిటేషన్, భద్రత వంటి సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. దీనిపై సీఎం వెంటనే అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts