
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు. గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంపై తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ, 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నోటీసుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఎలాంటి ఆధారాలు లేకుండానే సీఎం రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మీడియాలో ప్రచారం చేశారని కేటీఆర్ ఆరోపించారు. గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు గానీ, యాజమాన్య హక్కులు గానీ లేవని స్పష్టం చేశారు.
అలాగే, గ్లోబరీనా తన బినామీ కంపెనీ అని, ఆ సంస్థకు సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించానని చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నోటీసుల్లో పేర్కొన్నారు.
అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు చేయడం తగదని కేటీఆర్ హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసమే తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే, సీఎం రేవంత్ రెడ్డిపై సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తామని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో హెచ్చరించారు.
