Download App

అమీర్ పేట లో NTR విగ్రహావిష్కరణ చేసిన రేవంత్ రెడ్డి

మే 29, 2026 • By Suresh Thota
"తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనదితెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనదితెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..తెలుగు జాతి...
అమీర్ పేట లో NTR విగ్రహావిష్కరణ చేసిన రేవంత్ రెడ్డి

“తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా ..మన భాష తెలుగు భాషన్నా”…..

ఈ పాట ఎన్టిఆర్ స్వీయదర్శకత్వంలో రూపొందిన “తల్లా! పెళ్లామా” చిత్రం లోనిది. డా. సి. నారాయణ రెడ్డి కలం నుండి జాలువారగా…. టివి రాజు సంగీత దర్శకత్వంలో ఘంటసాల ఆయన బృందం ఆలపించారు. ఈ గీతం ఎన్టీఆర్, సినారె కలసి చర్చించుకుని తెలుగు జాతి, దాని ఔనత్యం ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ గీతం చరిత్రలో నిలిచిపోవాలి అని తపన తో అనుకుని తీశారు. తెలుగు జాతి కోసం వారు పడ్డ శ్రమ వృథా కాలేదు.

అలా తెలుగు జాతి కి వన్నె తెచ్చిన వ్యక్తి కాబట్టే, రాష్ట్రాలు వేరైనా, ఈ రోజు కి అందరి మనసులో నిలిచిపోయిన “కారణజన్ముడు” ఎన్టీఆర్. తెలుగు జాతి కి, సంస్కృతికి, దేశ వ్యాప్తంగా పేరు తీసుకువచ్చి….. రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు మే 28 వ తేదీన, ఆయన 103వ జయంతి. ఆ సందర్భంగా అమీర్‌పేట మైత్రివనం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి “ఎనుముల రేవంత్ రెడ్డి” గురువారం సాయంత్రం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు మరియు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

అక్కడే ​విగ్రహావిష్కరణ ఎందుకు….

అమీర్‌పేట, సారథి స్టూడియోస్ పరిసరాలు తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో చారిత్రాత్మక అనుబంధం ఉన్న ప్రాంతాలు. పూర్వం నుండి షూటింగ్స్ ఎక్కువగా ఇక్కడే జరిగేవి. సినీ పరిశ్రమ మద్రాస్ నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన తర్వాత, సిని రంగ సాంకేతిక నిపుణులు, నటులు , వివిధ విభాగాల వారు ఇక్కడే ఎక్కువగా ఉండేవారు. అలా ఈ ప్రదేశం తో సినిమా పరిశ్రమ వాళ్లకి అనుబంధం ఎక్కువ, అందువలన ఇక్కడ ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహానటుడికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరణ తో తెలుగు వారు రాష్ట్రాలు వేరైనా, తెలుగు జాతి ఒక్కటే అని చాటి చెప్పినట్లు అయ్యింది అని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.

ఎన్టీఆర్ ఎందరో సాధారణ వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి, వారికి ఉన్నత పదవులను అందించారు. అట్టడుగు వర్గాల వారిని రాజకీయ నాయకులు గా తయారు చేసిన రాజకీయ సంస్కర్త. నేటి తరం నాయకులకు ఆయనొక రాజకీయ పాఠశాల. అమీర్ పేట లో అత్యంత రద్దీగా ఉండే మైత్రివనం కూడలిలో తెలుగు ఆత్మగౌరవ ప్రతీకగా “ఎన్టీఆర్” విగ్రహం ఉండాలన్న, సినీ వర్గాల వారికి, అభిమానులకు, స్థానిక నాయకులకు చిరకాల స్వప్నం తీర్చి…. సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ అభిమానుల అభిమానం చూరగొన్న వ్యక్తి అయ్యారు.

దేశ చరిత్రలో ముగ్గురే జాతి రత్నాలు: సీఎం రేవంత్ రెడ్డి…

NTR ​విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

​”దేశ చరిత్రను తిరగేస్తే సమాజానికి స్ఫూర్తినిచ్చిన ముగ్గురు జాతి రత్నాలు కనిపిస్తారు. ఒకరు భారత రాజ్యాంగ రాసి, పేదలకు ఓటు హక్కు కల్పించిన “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్” కాగా, రెండో వ్యక్తి భూ సంస్కరణలు తెచ్చి పేదలకు హక్కులు కల్పించిన “ఇందిరా గాంధీ” మరొకరు, ఆ తర్వాత నీతి, నిజాయితీ, ఉక్కు సంకల్పంతో పేదవాడి ఆకలి తీర్చిన మహోన్నత నాయకుడు “నందమూరి తారక రామారావు”. మానవ మనుగడ ఉన్నంత కాలం ఈ ముగ్గురిని స్మరించుకోవాల్సిందే. కాంగ్రెస్ సీఎం “ఎన్టీఆర్” విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటని కొందరు విమర్శిస్తున్నారు, కానీ మాకు ఇందిరమ్మ అంటే ఎంతటి గౌరవమో.. ఎన్టీఆర్ అన్నా అంతే గౌరవం.” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కారణ జన్ముడు ఎన్టీఆర్…

తెలుగు నేలపై నందమూరి తారక రామారావు అనే పేరు ఒక ప్రభంజనం. ఆయనను స్మరించుకోవడానికి, కారణాలు ఎన్నో ఉన్నాయి. రాముడన్నా, కృష్ణుడన్నా తెలుగువారికి మొదట గుర్తొచ్చే రూపం ఎన్టీఆరే. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యమైన నటనతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నటుడాయన. ​తెలుగు ఆత్మగౌరవ నినాదం తో ఢిల్లీ పీఠం ముందు మోకరిల్లిన తెలుగువారి ఆత్మగౌరవాన్ని మేల్కొలిపి, “తెలుగువారి ఖ్యాతి”ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన ధీరుడు. ​పేదవాడి పాలిట పెన్నిధి రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాల పథకం వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో ‘అన్న’గా శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. అంతే గాకుండా ​మహిళా సాధికారతకు ఆద్యుడు కూడా, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించిన చట్టాన్ని తెచ్చి, సమాజంలో స్త్రీలకు సముచిత స్థానాన్ని కల్పించిన సంస్కర్త.

​ముగింపు: అమీర్‌పేట మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం కొలువుదీరడం కేవలం ఒక విగ్రహావిష్కరణ మాత్రమే కాదు, అది తెలుగు వారి ఆత్మగౌరవానికి, కళా రంగానికి మరియు ప్రజాసేవకు దక్కిన సముచిత గౌరవం. ఈ కార్యక్రమంతో అమీర్‌పేట పరిసరాల్లో NTR అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading