మన్యం జిల్లా పాలకొండలో వైఎస్ జగన్

Published by
Srinivas

వైసీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. మొన్నటికిమొన్న విజయవాడ వెళ్లి జైళ్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించారు. ఆ తర్వాత రోజు గుంటూరులోని మిర్చి యార్డ్ ను సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మన్యం జిల్లా పాలకొండలో ప్రత్యక్షమయ్యారు.

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండకు చేరుకున్న వైఎస్ జగన్, సీనియర్ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న పాలవలస రాజశేఖరం (81) కన్నుమూసిన సంగతి తెలిసిందే. అందుకే ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు, జగన్ పాలకొండ వెళ్లారు.

తన పర్యటనలో భాగంగా ముందుగా విశాఖపట్నం చేరుకున్నారు జగన్. అక్కడ వైసీపీ శ్రేణులు, జగన్ కు స్వాగతం పలికాయి. విశాఖలో గుడివాడ అమర్నాధ్ తో సమావేశమయ్యారు. అట్నుంచి అటు పాలకొండకు చేరుకున్నారు.

పాలకొండలో పాలవలస కుటుంబం తరతరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తోంది. సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయాలు చేస్తూ, అంచెలంచెలుగా ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా ఎదిగారు రాజశేఖరం. వైఎస్ఆర్ తో ఆయనకు మంచి రాజకీయ సాన్నిహిత్యం ఉంది. అదే అనుబంధంతో ఆయన వైసీపీలో చేరి జగన్ తో కలిసి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పాలవలస విక్రాంత్, రాజశేఖరం తనయుడే. 

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.