
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’లోకి మరో క్రేజీ హీరో చేరారు. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. రజనీకాంత్, రామ్ పోతినేని ఒకే సినిమాలో కనిపించనున్నారనే వార్తతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని ‘దేవదాస్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘రెడీ’, ‘కందిరీగ’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదించుకున్నారు.
తాజాగా రామ్ ఎంట్రీని ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ముందున్న ప్రయాణంలో టర్బులెన్స్ ఉంటుందని ప్రకటన రావడంతో ఈ వీడియో ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఆ సమయంలో రజనీకాంత్ ఒక గన్ను రామ్ వైపు విసరగా, ఆయన ఎంతో స్టైలిష్‌గా అందుకుంటారు. ఈ ఒక్క సీక్వెన్స్‌తోనే ఇద్దరు స్టార్ హీరోల కలయిక ఎలా ఉండబోతోందో మేకర్స్ ఆసక్తికరంగా చూపించారు.

గడ్డం, కళ్లద్దాలతో సిగరెట్ తాగుతూ రామ్ కనిపించిన మాస్ అవతార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన స్టైలిష్ బాడీ లాంగ్వేజ్, అటిట్యూడ్‌కు అనిరుధ్ రవిచందర్ అందించిన పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేషన్ తీసుకొచ్చింది.
‘ధర్మన్’ సినిమాతో రామ్ పోతినేని తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. అంతేకాదు, తొలిసారి లెజెండరీ నటుడు రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ కాంబినేషన్ అన్ని భాషల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రజనీకాంత్, రామ్ పోతినేని వంటి ఇద్దరు క్రేజీ హీరోలు ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘ధర్మన్’పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.
