పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న సినిమా ఘాటి నుంచి మేకర్స్ తాజాగా “సైలోరే” అనే జానపద పాటను విడుదల చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క శెట్టి, తమిళ నటుడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూలై 11న విడుదల కానుంది.
ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో విక్రమ్ ప్రభు ఇంటెన్స్ వైలెంట్ అవతార్‌లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. అలాగే అనుష్క ఈసారి పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ సినిమాపై భారీగా హైప్ పెంచాయి.
“సైలోరే” పాట ఒక జానపద శుభకార్య మేళా నేపథ్యంలో సాగుతూ, ప్రకృతి అందాలను, సాంస్కృతిక సంపదను రంగుల కిరీటంలా చూపిస్తుంది. కొత్తగా పెళ్లయిన జంటగా అనుష్క, విక్రమ్ ప్రభు ఈ పాటలో ఉత్సవాన్ని ప్రతిబింబిస్తూ కనిపించారు. అడవిలో జరుగుతున్న ఆహ్లాదకరమైన వేడుకలు, పాట, నాట్యం, రంగురంగుల దృశ్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ పాటకు నాగవెళ్లి విద్యాసాగర్ సంగీతం అందించగా, కృష్ణ రాసిన లిరిక్స్‌కు లిప్సిక భాష్యం, సాగర్ నాగవెళ్లి, సోనీ కోమండూరి స్వరాలు అద్భుతంగా తోడయ్యాయి. పాటలోని హుషారుతో కూడిన బాణీ జానపద వాతావరణాన్ని పండిస్తుంది. రాజు సుందరం కొరియోగ్రఫీ ఈ ఫోక్ అంథమ్‌ను మరింత ప్రాణంతో నింపింది.
ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు మనోజ్ రెడ్డి కటాసాని సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ అందించగా, సాయి మాధవ్ బుర్రా రచించిన మాటలు సినిమాకు బలమైన భావోద్వేగాల్ని అందించనున్నాయి.
ఘాటి సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకే రోజున పాన్ ఇండియా విడుదల కానుంది.