
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #ChiruBobby2 (#Chiru158)పై ఇప్పటికే సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయానంతరం ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మరోసారి చేతులు కలపడంతో ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కన్నడ, తమిళ భాషల్లో పలు భారీ విజయాలను అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.

ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చిలో నిర్వహించిన హై-ఎనర్జీ షెడ్యూల్‌ను చిత్ర బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఈ చిత్రం కోసం దర్శకుడు బాబీ కొల్లి భారీ స్థాయిలో కథను సిద్ధం చేసినట్లు సమాచారం. దశాబ్దాలుగా తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి, ఈ చిత్రంలో తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా అయ్యారు.
భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్‌ను అందించనున్నారు. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను అవినాశ్ కొల్లా నిర్వహిస్తుండగా, ఎడిటింగ్‌ను ఆంటోని ఎల్. రూబెన్ చేపట్టారు.

కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు స్క్రీన్‌ప్లే రచయితలుగా వ్యవహరిస్తున్నారు. భాను-నందు ద్వయం సంభాషణలను అందిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో కథానాయికతో పాటు ఇతర ప్రధాన తారాగణానికి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.
