విడుదలకు ముందే కూలి దూకుడు… రికార్డు స్థాయి హైప్
August 8, 2025 Published by Srinivas

సూపర్ స్టార్ రజనీకాంత్, మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన కూలి సినిమా విడుదలకు ఇంకా ఆరు రోజులు మిగిలి ఉండగానే మేనియా షురూ అయింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో $3 మిలియన్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం, విడుదలకి ముందే మరోసారి రజినీ మేనియా ఎలా ఉంటుందో చాటుతోంది.
కేవలం కేరళలో బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే గంటకు 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడై ట్రెండింగ్‌లోకి వచ్చింది. సినిమా ఉదయం 6 గంటల నుంచే ప్రదర్శనకు సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తుండగా, ఆదివారం లేదా సోమవారం నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
ఈ హైప్‌కి కేవలం రజినీకాంత్ స్టార్ పవర్ మాత్రమే కాక, లోకేష్ కనగరాజ్ బ్రాండ్ కూడా ప్రధాన కారణం. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించగా, పూజా హెగ్డే డాన్స్ చేసిన మౌనిక మౌనిక సాంగ్ అంచనాలను ఆకాశానికెత్తేసింది.

తమిళనాడులో ఇప్పటికే ఆల్ టైం రికార్డులు బ్రేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రత్యేక షోలు వేసేందుకు తమిళనాడు ప్రభుత్వానికి నిర్మాతలు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మరోవైపు, ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్రబృందం ఎక్కడా రాజీ పడడం లేదు. అమెజాన్ డెలివరీ బాక్సులపై స్టికర్లు, మెట్రో రైళ్లపై యాడ్స్‌తో భారీ అవుట్‌డోర్ ప్రచారం జరుగుతోంది.
ఈ హైప్‌కి మధ్యలో వార్ 2 దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రీమియం థియేటర్లు, ఐమాక్స్ స్క్రీన్లు బుక్ చేసుకున్నా కూడా కూలి దూకుడు తగ్గడం లేదు. ఫస్ట్ డే గ్రాస్ రూ.100 నుంచి 150 కోట్ల మధ్యలో ఉండవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల్ని మించి వసూళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదు.
