TVK Vijay: నన్నేమైనా చేయండి… నా ప్రజల జోలికి రాకండి: విజయ్
September 30, 2025 Published by Rahul N

తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ సూపర్ స్టార్ విజయ్ (TVK Vijay) కరూర్‌లో జరిగిన విషాద ఘటనపై స్పందించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఆయన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మౌనం వహించిన విజయ్, ఇప్పుడు వీడియో సందేశం విడుదల చేసి స్పందించారు.
తన సందేశంలో విజయ్, “ఇలాంటి బాధ నా జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు. నన్ను చూసేందుకు అభిమానులు వచ్చారు. నాపై చూపుతున్న ప్రేమకు ఎప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. ఇతర జిల్లాల్లో జరిగిన నా రాజకీయ సమావేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కానీ కరూర్‌లో మాత్రమే ఇంతటి విషాదం ఎందుకు చోటుచేసుకుంది? అక్కడి ప్రజలే నిజాన్ని వెలుగులోకి తెస్తున్నారు. నిజం త్వరలో బయటపడుతుంది” అని వ్యాఖ్యానించారు.
నేరుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (CM Stalin)ను ఉద్దేశిస్తూ విజయ్, “ముఖ్యమంత్రి గారూ, మీకు ఏమైనా ప్రతీకార కక్ష్యలు ఉంటే నాపై చేయండి. నా నాయకులపై చేయకండి. నేను ఇంట్లోనో, కార్యాలయంలోనో ఉంటాను. నా ప్రజల జోలికి వెళ్ళకండి ” అని అన్నారు.
అదే సమయంలో తాను వెంటనే కరూర్(Karur)కు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలని అనుకున్నానని, అయితే తన హాజరు వల్ల మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకూడదని వెనక్కి తగ్గానని వివరించారు. “నిజానికి కరూర్ వెళ్లి కుటుంబాలను కలవాలని మాత్రమే అనుకున్నాను. కానీ నా వల్ల ఎలాంటి సమస్యలు రాకూడదని ఆగిపోయాను. త్వరలోనే బాధిత కుటుంబాలను వ్యక్తిగతంగా కలుస్తాను” అని తెలిపారు.
తన వీడియో సందేశాన్ని ముగిస్తూ, ఈ ఘటన తన రాజకీయ సంకల్పాన్ని మరింత బలపరిచిందని స్పష్టం చేశారు. అలాగే ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన రాజకీయ పార్టీలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
