సినిమా వార్తలు

ఆ కంటెంట్‌కి నేను అభిమానిని.. ‘మోతెవరి లవ్ స్టోరీ’ టైటిల్ కొత్తగా ఉంది: ఆనంద్ దేవరకొండ

Published by
Rahul N

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక హృదయాన్ని తాకే ప్రేమకథ వెబ్‌సిరీస్ ‘మోతెవరి లవ్ స్టోరీ’ త్వరలో ZEE5లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విలేజ్ కామెడీ, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో నిండి ఉండే ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించగా, అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జన్నుతుల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 7 ఎపిసోడ్లుగా రూపొందించబడింది.

జూలై 9న హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక ఈవెంట్‌లో నటుడు ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా టైటిల్ మరియు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా నాకు లేదు. ‘మోతెవరి లవ్ స్టోరీ’ టైటిల్ ఎంతో కొత్తగా ఉంది. ఇది నిజంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సిరీస్ అవుతుంది. మై విలేజ్ షో టీం కంటెంట్‌కి నేను అభిమానిని. ఇది వారికి ఒక పెద్ద సక్సెస్ కావాలి” అని పేర్కొన్నారు.

ఈ వెబ్‌సిరీస్‌ కథ లంబాడిపల్లి అనే ఊరిని ఆధారంగా చేసుకొని సాగుతుంది. ఇద్దరు సోదరులు, వారి తండ్రి రాసిచ్చిన భూమి, వారసత్వ వివాదం, గర్వం, ప్రేమ.. ఇవన్నీ కలగలిపిన కథలో అనిత (వర్షిణి) – పార్షి (అనిల్) ల మధ్య ఏర్పడే బంధం ప్రధానంగా ఉంటుంది. గ్రామీణ నేపథ్యానికి తగినట్లుగా ఆ యాస, సంస్కృతిని, మానవీయ భావాలను హాస్యంతో మిళితం చేసి తీయడం ఈ సిరీస్ ప్రత్యేకత.

జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ మాట్లాడుతూ, “మిడిల్ క్లాస్ మెలోడీస్‌ సినిమాను చూసిన తర్వాత మై విలేజ్ షో టీం టాలెంట్‌పై నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు అదే టీం నుంచి వచ్చిన ఈ సిరీస్‌ అనిల్ గీలా కెరీర్‌లో మైలురాయిగా నిలవనుంది” అన్నారు.

కంటెంట్ హెడ్ దేశ్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ జయంత్, నిర్మాత మధుర శ్రీధర్, దర్శకుడు శివ కృష్ణ, అనిల్ జీలా, మై విలేజ్ షో ఫౌండర్ శ్రీరామ్ శ్రీకాంత్, నటి వర్షిణి రెడ్డి, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. వారంతా తమ అనుభవాలను పంచుకుంటూ – గ్రామీణ వాతావరణాన్ని నిజంగా ప్రతిబింబించే విధంగా ఈ సిరీస్ రూపొందించామని, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దశలో తాకేలా ఉంటుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు.


అనిల్ జీలా మాట్లాడుతూ, మా టీం నుంచి ఇదే మొదటి సిరీస్‌. చాలా కష్టపడ్డాం. మధుర శ్రీధర్ గారు మొదటి సిట్టింగ్‌లోనే కథ ఓకే చేయడం, జీ5 టీం సహకారం వల్లే ఈ స్థాయికి వచ్చాం. ఇది మమ్మల్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తుందన్న నమ్మకం ఉంది” అని అన్నారు.

సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ, “ఈ సిరీస్‌కి సంగీతం అందించడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మట్టిలో జన్మించిన ఈ కథను సంగీతంతో ఇంకాస్త హృదయానికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాం” అన్నారు.

‘మోతెవరి లవ్ స్టోరీ’ సిరీస్‌ ZEE5లో ఆగస్టు 8న విడుదల కానుంది.

Rahul N