
తొలి సినిమా ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సన… రెండో ప్రయత్నంలోనే రామ్ చరణ్ వంటి స్టార్ హీరోతో ‘పెద్ది’ తెరకెక్కించి పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా ఇప్పుడు బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించినట్లు ప్రచారం జరిగింది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి నటీనటుల భాగస్వామ్యం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు.
మహేష్.. చరణ్ తర్వాత ఇప్పుడు చిరంజీవి?
‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు ఎవరితో సినిమా చేస్తారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఆయన మహేష్ బాబుతో సినిమా చేయనున్నారనే వార్తలు వచ్చాయి. మరోవైపు రామ్ చరణ్‌తోనే మరో ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది.
అయితే ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా ఓ కొత్త వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. బుచ్చిబాబు ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఓ భారీ కథను సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
కథ నచ్చితే గ్రీన్ సిగ్నల్?
ప్రస్తుతం బుచ్చిబాబు ఈ కథపై వర్క్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథ పూర్తయిన తర్వాత చిరంజీవికి వినిపించే అవకాశం ఉందని సమాచారం. స్క్రిప్ట్ మెగాస్టార్‌ను మెప్పిస్తే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే ఈ కాంబినేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ఆధారంగానే ఈ ప్రచారం జరుగుతోంది.

వరుస సినిమాలతో చిరంజీవి
ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 158’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో చిరంజీవి నటించనున్నారు.
ఈ కమిట్‌మెంట్స్ పూర్తయిన తర్వాతే బుచ్చిబాబు ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మొత్తానికి ‘ఉప్పెన’, ‘పెద్ది’తో తన సత్తా చాటుకున్న బుచ్చిబాబు.. ఇప్పుడు మెగాస్టార్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నారన్నదే ఆసక్తికరంగా మారింది. చిరంజీవి-బుచ్చిబాబు కాంబినేషన్ నిజమైతే మాత్రం టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌కు తెరలేచినట్టే.
