
భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం నుంచి మేకర్స్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రను పోషిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లుక్‌ను తాజాగా పరిచయం చేశారు. “జనస్థాన్‌కి రాజకుమారి.. శూర్పణఖ” అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
విడుదలైన పోస్టర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేకమైన ఆభరణాలు, రాజసం ఉట్టిపడే వస్త్రధారణతో కనిపిస్తున్నారు. శూర్పణఖ పాత్రకు సంబంధించిన ఈ లుక్‌ను మేకర్స్ ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇప్పటివరకు సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ వస్తున్న చిత్రబృందం, ఇప్పుడు రకుల్ పాత్రను కూడా అధికారికంగా వెల్లడించింది.
రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా కనిపించనున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది.
నమిత్ మల్హోత్రా నేతృత్వంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న డీఎన్ఈజీ, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో అంతర్జాతీయ స్థాయి నిర్మాణ ప్రమాణాలకు అనుగుణంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
విడుదల విషయానికి వస్తే.. ‘రామాయణం’ మొదటి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఎస్‌వీసీ గ్రాండ్‌గా విడుదల చేయనుంది. భారత్ మినహా ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ పంపిణీ చేయనుండగా, హిందీ మార్కెట్‌లో ధర్మ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు నిర్వహించనుంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమాలో రకుల్ పాత్ర ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
