శింబు – వెట్రిమారన్ ‘సామ్రాజ్యం’ ప్రోమో: నేను చెప్పబోయే విషయం మొత్తం నిజం… కానీ ఉట్టి భూటకం…
October 17, 2025 Published by Srinivas

తమిళ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో, నేషనల్ అవార్డ్ విన్నర్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కలైపులి ఎస్. థాను రూపొందిస్తున్న తాజా చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఈ చిత్రానికి తమిళంలో ‘అరసన్’, తెలుగులో ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ ఖరారు చేశారు.
సంగీత దిశలో ‘రాక్ స్టార్’ అనిరుధ్ రవిచందర్ మళ్ళీ మ్యాజిక్ చేయనున్నాడు. ఈ చిత్రంలోని తెలుగు ప్రోమోను మాస్ ఎన్‌ర్జీ హీరో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. “శింబు బెస్ట్ ఇంకా రాబోతోంది. వెట్రిమారన్ లాంటి దర్శకుడే అతడిని వెండితెరపై అత్యంత శక్తివంతంగా చూపగలడు” అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు సాధారణంగా రెండు నుండి మూడు నిమిషాల ప్రోమోలు విడుదలవుతుంటే, ‘సామ్రాజ్యం’ టీమ్ మాత్రం వినూత్నంగా ఐదున్నర నిమిషాల నిడివితో విస్తృత ప్రోమోను విడుదల చేశారు. ఆ వీడియోలో ప్రతి ఫ్రేమ్ వెట్రిమారన్ ముద్రతో నిండి ఉంది.
ప్రోమో ఆరంభంలోనే అనిరుధ్ నేపథ్య సంగీతం గుండె వేగాన్ని పెంచేస్తుంది. తరువాత ఓ వ్యక్తి, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌కు కోర్టు బయట ఓ కథ చెబుతున్న సీన్‌తో ప్రారంభమవుతుంది. “సార్… నేను చెప్పబోయే విషయం మొత్తం నిజం. కానీ సినిమాలో ఉట్టి భూటకం అని కార్డు వేయండి” అంటూ శింబు చెప్పే డైలాగ్ ఇప్పటికే వైరల్ అవుతోంది.
కోర్టు సన్నివేశాల్లో శింబు పైత్యంతో కూడిన గంభీరతను ప్రదర్శించగా, ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో యువకుడిగా మెరిసారు. ముగ్గురు మనుషులను హత్య చేసిన కేసులో ముద్దాయిగా నిలిచిన ఆయన, తాను నిర్దోషినని వాదిస్తూ కనిపిస్తారు. ఆ కేసు వెనుకున్న నిజం ఏమిటి? అనేది సినిమాలో ఉత్కంఠభరితంగా తేలనుంది.
‘వడ చెన్నై’ వంటి క్లాస్-మాస్ మిక్స్ హిట్ తర్వాత వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. “వడ చెన్నై ప్రపంచంలో ఎవరికీ చెప్పని కథ” అనే లైన్‌తో ప్రోమో ముగుస్తుంది.
తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి విడుదల చేయనున్నారు వి క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్. థాను. మొదటి షెడ్యూల్ పూర్తవగా, త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
