హృదయాన్ని తాకే లవ్ డ్రామా ‘బ్యూటీ’… జనవరి 2 నుంచి జీ5లో స్ట్రీమింగ్
డిసెంబర్ 30, 2025 Published by Srinivas

హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ లవ్ డ్రామా బ్యూటీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందిన ఈ సినిమా, జనవరి 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ZEE5లో స్ట్రీమింగ్ కానుంది.
వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ5 మరోసారి తన ప్రత్యేకతను చాటుతూ ‘బ్యూటీ’ని డిజిటల్ ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య హీరోగా, నిలాఖి పాత్రా హీరోయిన్‌గా నటించారు. క్యూట్ లవ్ స్టోరీతో పాటు తండ్రి–కూతురు మధ్య ఉన్న అపారమైన ప్రేమను హృద్యంగా చూపించిన ఈ చిత్రం భావోద్వేగాల పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

కథ విషయానికి వస్తే…
అలేఖ్య (నిలాఖి పాత్రా) మరియు అర్జున్ (అంకిత్ కొయ్య) ప్రేమించుకుంటారు. అలేఖ్య తండ్రి నారాయణ (వీకే నరేష్) ఒక క్యాబ్ డ్రైవర్. కూతురంటే ప్రాణంగా చూసుకునే తండ్రి, ఆమె పుట్టినరోజుకు టూ వీలర్ కొనిస్తానని మాట ఇస్తాడు. అదే సమయంలో అర్జున్ కూడా అదే హామీ ఇస్తాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తండ్రి మాట నిలబెట్టుకోలేకపోవడంతో అలేఖ్య కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఆ నిర్ణయం ఆమెను ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టింది? నారాయణ తన కూతురిని కాపాడుకోవడానికి ఏం చేశాడు? చివరకు ఆమె ఎలా బయటపడింది? అన్నదే ‘బ్యూటీ’ కథాంశం.
ZEE5 జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీ లింగ్వల్ కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లు, టీవీ షోలను విస్తృతంగా అందిస్తోంది.
ఎమోషన్, ప్రేమ, కుటుంబ బంధాల మేళవింపుతో రూపొందిన ‘బ్యూటీ’ను జనవరి 2 నుంచి జీ5లో చూడొచ్చు.
