ఆర్యన్

Published by
Srinivas

ఆర్యన్ రివ్యూ: తప్పు తప్పు తప్పుగా ఆలోచించారు!

విష్ణు విశాల్ హీరోగా సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఆర్యన్’. తమిళంలో అక్టోబర్ 31న విడుదల కాగా… తెలుగులో నవంబర్ 7న రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందంటే?

విష్ణు విశాల్ కథానాయకుడిగా, సెల్వరాఘవన్ ప్రతినాయకుడిగా నటించిన సినిమా ‘ఆర్యన్’. తమిళంలో అక్టోబర్ 31న విడుదలైంది. తెలుగులో నవంబర్ 7న రిలీజ్ చేశారు. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. వాస్తవం చెప్పాలంటే… తమిళ్ ఆడియన్స్ నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో క్లైమాక్స్ ట్రిమ్ చేశారు. ఆ వెర్షన్ తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి. 

కథ:

కథ గురించి చెప్పాలంటే… నంది (విష్ణు విశాల్) డీసీపీ. సీరియల్ కిల్లర్ కేసు డీల్ చేసిన ఘనత అతనిది. అందుకని జరగబోయే హత్యలను ఆపే బాధ్యత అతని చేతిలో పెడతారు. లైవ్ టీవీ షోలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాబోయే ఐదు రోజుల్లో ఐదుగుర్ని చంపేస్తానని ఆత్రేయ (సెల్వరాఘవన్) చెబుతాడు. అది ఎలా సాధ్యం? మరణించిన వ్యక్తి రాబోయే ఐదు రోజుల్లో ఐదుగుర్ని చెప్పిన టైంకి ఎలా చంపాడు? ఈ కేసును నంది ఎలా చేధించాడు? అనేది సినిమా. 

విశ్లేషణ:

సినిమా ఎలా ఉందంటే… పాత ఒక రోత, కొత్త ఒక వింత అని సామెత ఉంది. ఇది సినిమాలకు వర్తించే సూత్రం. కొత్త కథలతో రూపొందిన సినిమాలను ప్రేక్షకులు వింతగా చూశారు. అలాగని, వింత పేరుతో వికృత చేష్టలు చేస్తే కష్టం. తమిళంలో హిట్ థ్రిల్లర్ ‘రచ్చసన్’ చేసిన క్రెడిట్ విష్ణు విశాల్ ఖాతాలో ఉంది. దాన్ని మించిన థ్రిల్లర్ చేశానని చెప్పాడు. అందులో కొంత నిజం ఉంది. ‘ఆర్యన్’ ప్రారంభం చాలా బావుంది. థ్రిల్లర్ సినిమాకు అవసరమైన సరంజామా ‘ఆర్యన్’లో ఉంది. అయితే చివరకు వచ్చేసరికి దర్శక రచయిత ఆలోచన వికృతంగా మారింది. ప్రేక్షకుడిలో సినిమాపై హీనమైన అభిప్రాయం కలిగేలా చేసింది.

తప్పు ఎవరు చేసినా తప్పే. ఎదుటి వ్యక్తికి మంచి చేయడానికి తప్పు చేయాల్సిన అవసరం లేదు. మంచి మనిషికి గుర్తింపు తీసుకు రావడం కోసం మరణం ఒక్కటే పరిష్కారం కాదు. ఒకరి అనుమతి లేకుండా వాళ్ళ జీవితంలోకి తొంగి చూడటం, జీవితాన్ని బలి తీసుకోవడం ముమ్మాటికీ తప్పే. ఆ తప్పు చేసినోడిని మంచోడని, మహాత్మాతునిలా మంచి పని చేశాడని ‘ఆర్యన్’కు ముగింపు ఇవ్వడమే దర్శకుడు చేసిన పెద్ద తప్పు. ఒక్క ముగింపుతో అప్పటి వరకు సినిమాపై ఉన్న పాజిటివ్ అభిప్రాయాన్ని గంగలో కలిపేశాడు దర్శకుడు. అది ఆత్మహత్యా యత్నానికి పాల్పడటమే. ఖేల్ ఖతం! థ్రిల్లర్ సినిమాలకు అవసరమైన టెక్నికల్ సపోర్ట్ టీం ఇచ్చింది. 

విష్ణు విశాల్ నటన ఓకే. సెల్వరాఘవన్ సర్‌ప్రైజ్ చేశారు. సైలెంట్ విలనిజానికి అవసరమైన నటన ఇచ్చారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ కాదు. ఆవిడ ఎందుకు ఈ రోల్ చేశారో? మానస చౌదరి పాత్రను తొలగించినా కథకు వచ్చే నష్టం లేదు. ఇక మిగతా నటుల్లో తెలుగు ప్రేక్షకులకు తెల్సిన నటీనటులు తక్కువ. 

తీర్పు:

తప్పు తప్పు తప్పుగా ఆలోచించారు ‘ఆర్యన్’ సార్. మీరు కొత్త అనుకున్నారు. కానీ ఆ ముగింపు వికృతమైన ఆలోచనకు పరాకాష్ట. ఒకరు మహాత్ముడు అని చెప్పడానికి వాళ్ళను చంపడం ఎందుకండీ? ఆ ఆలోచనతో సినిమాను చంపేశారు. క్లైమాక్స్ కాదనుకుంటే బిలో డీసెంట్ థ్రిల్లర్ ‘ఆర్యన్’.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

ఇమ్మోర్టల్

సెప్టెంబర్ 18, 2026

హ్యాపీ జర్నీ

సెప్టెంబర్ 18, 2026

సీక్రెట్ సోల్జర్

సెప్టెంబర్ 18, 2026

మహేంద్రగిరి వారాహి

సెప్టెంబర్ 15, 2026

ఎపిక్

సెప్టెంబర్ 11, 2026

సర్దార్ 2

సెప్టెంబర్ 11, 2026