దండోరా మూవీ రివ్యూ
Published డిసెంబర్ 25, 2025 by Srinivas
‘దండోరా’ మూవీ రివ్యూ
కిస్మస్ పండుగకు పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో ఓ అరడజను చిన్న చిత్రాలు విడుదలకు వరుస కట్టాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో దండోరా ఒకటి. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు కీలక పాత్రధారులు. లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాణంలో మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. కులం కీలకాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‌తో మంచి ఫామ్‌లోకి వచ్చారు శివాజీ. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ల వస్త్రధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ సినిమాకు కావలసిన హైప్ తీసుకొచ్చారు. మరీ చిత్రంతో ఆయన ఖాతాలో మరో హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.

కథ:
మెదక్ దగ్గర్లోని ఓ పల్లెటూరులో జరిగే కథ ఇది. మనిషి చచ్చిపోతే అంత్యక్రియలు జరపడానికి కూడా కుల ప్రాతిపదికనే అక్కడ స్మశానం ఉంటుంది. ఆ ఊళ్లో అగ్ర కులస్తుడు శివాజీ(శివాజీ). అతనికి కులం అంటే అభిమానం ఎక్కువ. అతని కులానికి చెందిన అమ్మాయిని ఇతర కులస్తులు కన్నెత్తి చూసినా సహించడు. అలాంటి పరిస్థితి తన కూతురికే ఎదురైతే? తన కూతురు సుజాత(మనికా చిక్కాల) వేరే కులానికి చెందిన రవి(రవికృష్ణ)ని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసి శివాజీ కులానికి చెందిన కొంతమంది రవికృష్ణని చంపేస్తారు. ఇదంతా కళ్లారా చూసిన శివాజీ కొడుకు విష్ణు (నందు) తన ప్రేమకు కూడా కులం అడ్డొస్తుందని తెలిసి ప్రేమను వదిలేసుకొని తండ్రికి దూరంగా వెళ్ళిపోయి బతుకుతుంటాడు. ఆ ఘటన తర్వాత శివాజీ ఏం చేశాడు? విష్ణు శివాజీకి దగ్గరయ్యాడా? ప్రేమించిన వ్యక్తి చనిపోవడంతో సుజాత ఏమైంది? వేశ్య శ్రీలత(బిందుమాధవి)కి శివాజీకి సంబంధం ఏంటి? ఆ ఊళ్లో కులాలకు సంబంధం లేకుండా అంత్యక్రియలు నిర్వహించడానికి స్థలం రావడానికి కారణం ఎవరు? సర్పంచ్‌గా నవదీప్ పాత్ర ఏంటి? అన్నది కథ.

విశ్లేషణ:
‘చావు అనేది మనిషికి దక్కే ఆఖరి మర్యాద. చనిపోయిన తండ్రికి ఆ మర్యాద దక్కడం కోసం ఓ కొడుకు, కూతురు ఏం చేశారన్న నేపథ్యంలో సాగుతుంది. దండోరా కథ 2004 – 2019 సంవత్సరాలలో జరిగినట్టు చూపించారు. ప్రథమార్థం అంతా ఊళ్లో కులాలు, సుజాత – రవిల ప్రేమకథతో నడించింది. 2004 – 2019 మధ్య తిప్పుతూ స్క్రీన్ ప్లేలో కొత్తదనం చూపించాలనుకున్నారు. అదంతా సాగదీతగా అనిపిస్తుంది.
ఇంటర్వెల్ ముందు రవిని చంపడం నుంచి కథపై ఆసక్తి, ఇంటెన్స్ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్ వర్కౌట్ అయింది. శివాజీ ప్లాష్‌బ్యాక్ సాగదీతగా ఉన్నా.. అక్కడ ఎమోషనల్ కంటెంట్ జనాలకు కనెక్ట్ అయ్యేలాగా ఉంది. కులాలకు సంబంధం లేకుండా మనిషి చనిపోతే ప్రశాంతంగా అంత్యక్రియలు చేయడానికి ఓ కొడుకు, కూతురు ఎలాంటి పరిష్కారం చూపించారనేది ఆసక్తి కలిగించింది. ఆ సీన్స్‌లో ఎమోషన్స్ కంటతడి పెట్టిస్తాయి. ఈ సీన్ నుంచి సినిమా గ్రాఫ్ మారిపోయింది క్లైమాక్స్ 20 నిమిషాలు సినిమాకు ఆయువుపట్టు. ఆ సన్నివేశాలు పేలవంగా ఉంటే సినిమా దుకాణం సర్దుకోవాల్సిందే. కానీ చివరి 20 నిమిషాలు బలంగా రాసుకున్నాడు దర్శకుడు. ఆ పాత్రల చిత్రీకరణ కూడా అంతే బలంగా ఉంది.
సెకండ్ హాఫ్ లో శివాజీ ఉన్న కొన్ని సీన్స్ మాత్రం ఊహించరు. అవి సినిమాకు ప్లస్ అవుతాయి. సినిమా ప్రారంభ సన్నివేశానికి ఓపెనింగ్ సీన్‌కి క్లైమాక్స్‌కి లింక్ చేసి ముగింపు ఇచ్చారు. దర్శకుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కులం పిచ్చిని బాగా గమనించి ఈ కథ రాసుకున్నట్లు ఉన్నారు. కథలో డెప్త్ ఉంది కానీ కొన్ని లాజిక్‌లు మిస్ అయ్యాయి.
ఈ సినిమాలో ఒక కులం వాళ్లందరికీ ఓ స్మశానం ఉంటుంది. వేరే కులం వాళ్ళు ఊరి చివర ఎక్కడో అంత్యక్రియలు చేసుకోవలసి వస్తుంది. వాళ్ళు కూడా యూనిటీగా ఉండి స్థలం చూసుకోని సమస్యని పరిష్కరించకుండా మాకు స్మశానం లేదు అనడం వింతగా ఉంటుంది.

90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‌తో ఫామ్‌లోకి వచ్చిన శివాజీకి మరో అద్భుతమైన పాత్ర పడింది. ఈ సినిమాకు ఆయన చాలా ప్లస్ అయ్యాడు. పాత్రలో డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తూ ఆకట్లుకున్నారు. ఆ పాత్రతో కోపం తెప్పించాడు. ఏడిపించాడు. ఫస్టాఫ్ విసుగుగా ఉన్నా సెకెండాప్ శివాజీ. నందు, క్లైమాక్స్‌లో చిన్నారి పాత్ర నడిపించేశాయి. మనికా చిక్కాల గ్రామీణ అమ్మాయిగా చక్కని నటన కనబర్చింది.
సీరియల్ నటుడు రవికృష్ణ పాత్రకు న్యాయం చేశాడు. సర్పంచ్ పాత్రలో నవదీప్ కొత్తగా కనిపించాడు. ఆ పాత్ర నవ్వించింది, మెప్పించిది. శివాజీ కొడుకుగా నందుకు మంచి రోల్ దొరికింది. ఆయన ఈ మధ్య చాలా సినిమాలు చేసిన సరైన గుర్తింపు రాలేదు కానీ ఈ సినిమాతో ఆయన గురించి మాట్లాడుకుంటారు.
వేశ్య పాత్రలో బింధు మాధవిని హుందాగా చూపించారు. మౌనిక రెడ్డి, రాధ్య, దేవి ప్రసాద్, అదితి బావరాజు.. మిగిలిన నటీనటులు పాత్రల మేరకు నటించారు. సినిమాలో పదునైన, మనసుకు తాకే సంభాషణలు రాసుకున్నారు. విలేజ్ అందాలను చాలా నాచురల్ గా చిత్రీకరించారు ఛాయగ్రాహకుడు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఇచ్చారు. పాటలు ఫర్వాలేదు. కులుం గొడవలతో సాగే రొటీన్ కథను దర్శకుడు కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్ఠాప్‌లో కట్టెలు కొట్టే సీన్, టీ తాగుతావ వంటి సీన్లు కత్తిరించేస్తే బావుండూది. చిన్న సినిమాకు కావలసినంత బడ్జెట్‌లో సినిమా తీశారు.
ఈ సినిమాలో కొన్ని బలమైన డైలాగులు ఉన్నాయి…
‘కల్లు మత్తు కాదు కదా సార్.. రాత్రి తాగింది పొద్దుగాల దిగినీకీ. కులం మత్తుసార్.. టైమ్ పట్టింది.
చావునుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కులం నుంచి తప్పించుకోలేం.
మన చావు పుట్టుకలన్నీ ఆ ఊరి బయట రాసిండ్రా దేవుడూ
చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద.. అది మర్యాదగానే జరగాలి.
చేసే పనినిబట్టి కులం అన్నప్పుడు.. పని మారితే కులం కూడా మారాలిగా
ఎంత చదువుకున్నా ఎంత ఆస్తి ఉన్నా వాడ్ని చూసే కొలమానం కులమే’…
వంటి బలమైన సంభాషణలు ఆకట్టుకున్నాయి, గుర్తుండిపోతాయి.
తీర్పు:
ఓవరాల్‌గా చెప్పాలంటే ఎమోషనల్ కంటెంట్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.
Rating: 



(3/5)
