Download App

‘మీనం’లో శని, కుజ గ్రహాల కలయిక… ఎలా ఉండబోతుంది…?

ఏప్రిల్ 1, 2026 By Suresh Thota
ఏప్రిల్ 2, 2026 నుండి మే 11, తేదీ వరకు మీన రాశి లో శని మరియు కుజుల కలయిక జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని 'మందగమనం' మరియు 'న్యాయానికి' సంకేతం అయితే, కుజుడు 'వేగం', 'అగ్ని' మరియు 'ఆవేశానికి' సంకేతం. ఈ పరస్పర విరుద్ధ స్వభావం...
'మీనం'లో శని, కుజ గ్రహాల కలయిక… ఎలా ఉండబోతుంది…?

ఏప్రిల్ 2, 2026 నుండి మే 11, తేదీ వరకు మీన రాశి లో శని మరియు కుజుల కలయిక జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని ‘మందగమనం’ మరియు ‘న్యాయానికి’ సంకేతం అయితే, కుజుడు ‘వేగం’, ‘అగ్ని’ మరియు ‘ఆవేశానికి’ సంకేతం. ఈ పరస్పర విరుద్ధ స్వభావం కలిగిన గ్రహాల కలయిక వల్ల వ్యక్తిగతంగా మనుషుల మీద వారి రాశి రీత్యా విశేష ప్రభావం చూపబోతుంది. ఈ రెండు సహజ శతృ బావాలు కలిగిన గ్రహాలు.

శని మరియు కుజుల కలయిక ప్రపంచ వేదికపై ఉద్రిక్తతల ను పెంచే అవకాశం ఉంటుంది. భూమి కారకుడు కుజుడు అయినందువలన భూమి కోసం ఘర్షణలు జరిగే అవకాశం మనుషుల మధ్యే కాకుండా దేశాలమధ్య కూడా జరిగే అవకాశం ఉంది. సరిహద్దు వివాదాలు తారాస్థాయికి చేరుకుంటాయి.. ముఖ్యంగా పశ్చిమ దేశాలు మరియు మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో అస్థిరత పెరిగే అవకాశం ఉంది.

మీన రాశి జల రాశి కాబట్టి, సముద్ర తీర ప్రాంతాల్లో తుఫానులు, సునామీలు లేదా భారీ వర్షాల వల్ల ఇబ్బందులు కలగవచ్చు. సముద్రంలో ఉండే అగ్ని పర్వతాలు పేలడం కూడా జరగవచ్చు. అగ్నిప్రమాదాలు లేదా భూకంపాల పట్ల కూడా అప్రమత్తత అవసరం. ప్రపంచ ​స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొని, ముఖ్యంగా చమురు (Oil), గ్యాస్ మరియు వంట నూనెల రంగాలకు సంబంధించిన ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండవచ్చు. బొగ్గు గనుల్లో కార్మికులు, టన్నెల్స్ లో పని చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.

ఈ శని మరియు కుజ గ్రహాల కలయిక మానసిక స్థితిని మరియు ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. చిన్న విషయాలకే కోపం రావడం, మొండితనం ప్రదర్శించడం వంటివి జరుగుతాయి. వివేకం కోల్పోయి మాటలు వదిలేయడం మూలంగా దగ్గర వాళ్ళని దూరం చేసుకుంటారు.

వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. యంత్రాలతో పనిచేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తపోటు (BP) లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి. శని ప్రభావం వల్ల కష్టపడే తత్వం ఉన్నవారికి, క్రమశిక్షణతో పనులు పూర్తి చేసేవారికి ఈ కలయిక కొత్త అవకాశాలను కూడా ఇస్తుంది.

రాశుల వారిగా ఫలితాలు విశ్లేషిద్దాం:-

మేష రాశి : మేష రాశి కి 12వ ఇంట్లో (వ్యయ స్థానం) ఈ కలయిక జరుగుతోంది. దీనివల్ల అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడి ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు ప్రయత్నించేవారికి అనుకూలిస్తుంది, కానీ ఆరోగ్య విషయంలో ముఖ్యంగా పాదాల విషయంలో జాగ్రత్త అవసరం. వాహనం నడిపే విషయంలో జాగ్రత్త.

వృషభ రాశి : వీరికి లాభ స్థానంలో అంటే 11 వ ఇంటిలో ఈ కలయిక జరుగుతుంది. ఆర్థికంగా కలిసివస్తుంది, పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

మిథున రాశి : ఈ రాశి వారికి రాజ్యంలో శని మరియు కుజుల కలయిక వల్ల ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ ధైర్యం సాహసాలు మీకు విజయాన్ని అందిస్తాయి. మీరు ఏ పని మీద ఉన్నారో అదే పని మీద ఉండండి. సానుకూల పలితాలు సిద్ధిస్తాయి. అత్తగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి 9వ ఇంట్లో అంటే భాగ్య స్థానం ఈ గ్రహాల కలయిక ఉంది. తండ్రితో లేదా పై అధికారులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. లాంగ్ జర్నీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, కానీ అదృష్టం మీద కంటే కష్టపడటం మీద నమ్మకం ఉంచాలి. ఏప్రిల్ 15 వ తేదీ వరకు తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

సింహరాశి : సింహ రాశి వారికి అష్టమ స్థానంలో శని , కుజుల కలయిక వల్ల ఆరోగ్య సమస్యలు లేదా వాహన ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. భార్య ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎలెక్ట్రిక్ స్టౌ, ఎలెక్ట్రిక్ వెహికల్ విషయాల్లో జాగరూకత వహించండి.

కన్యా రాశి : ఈ రాశి వారికి వ్యాపార భాగస్తులుతో గొడవలు, అపార్ధాలు వలన కొంచెం మానసిక అశాంతి కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి తో సర్దుకు పోవడం వలన గృహంలో శాంతి వెల్లివిరుస్తుంది.

తులా రాశి: ఈ రాశి వారి కి ఆరవ స్థానంలో ఈ శని, కుజ , గ్రహాల కలయిక వలన శత్రువులపై విజయం సాధిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మీ ఆరోగ్య విషయంలోను, తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో ను మెలుకువ గా ఉండాలి. కనపడని శత్రువులు ఎక్కువగా తయారు అవుతారు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారి కి 5 వ ఇంట్లో శని, కుజులు వల్ల సంతాన స్థానం పై ఈ ప్రభావం ఉంటుంది. పిల్లల విషయంలో కొంచెం ఆందోళన కలగవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మనస్పర్థలు వచ్చే సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లేదా రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. మానసిక అశాంతి కి గురి అవుతారు. తల పోటు వస్తే బేఖాతరు చేయొద్దు.

ధనుస్సు రాశి : మీకు 4వ ఇంట్లో ఈ కలయిక జరుగుతోంది. దీనివల్ల ఇంట్లో వాతావరణం కొంచెం వేడిగా ఉండవచ్చు. వాహనాలు లేదా ఇల్లు రిపేర్లకు వచ్చే అవకాశం ఉంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్థిరాస్తి వివాదాలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. వేడి చేసి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది.

మకర రాశి : ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కానీ తోబుట్టువులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మావగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. కోపతాపాలు కి గురి కావద్దు. పట్టు విడుపులు అవసరం. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

కుంభ రాశి : ధన నష్టం జరగకుండా చూసుకోవాలి. మాట తీరు వల్ల బంధువులతో ఇబ్బందులు కలగవచ్చు. “తన కోపమే తన శత్రువు” అన్నది. మీ విషయంలో రుజువు అవుతుంది. మాట పెదవి దాటితే పృథివి దాటుతుంది అంటారు. మీ మాట వల్ల మిత్రులను దూరం చేసుకుంటారు.

మీనరాశి : స్వరాశిలో కలయిక కాబట్టి శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. మీరు మంచి చెప్పిన అది చెడుగా మారుతుంది. చలువ జ్వరం వచ్చే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. భార్య/భర్త తో అనవసరం గా వాగ్యుద్ధం పెట్టుకోవద్దు. నిజాయితీ గా ఉండండి.

ఈ శని, కుజుల కలయిక వల్ల, పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
​ కోపంలో ఎవరినీ కించపరిచేలా మాట్లాడకండి. మీకు తెలియకుండానే ఆవేశానికి లోను అవుతారు (ముఖ్యంగా కుంభ, మీన, సింహ రాశుల వారు) మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని, శనివారం ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఈ గ్రహ దోష తీవ్రత తగ్గుతుంది.

గమనిక : ఇవి గోచార ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థితిని బట్టి ఫలితాల్లో మార్పులు ఉంటాయి. ఈ సమయంలో “హనుమాన్ చాలీసా” పఠించడం లేదా “శని స్తోత్రం” చదువుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. సాయంత్రం ప్రదోష కాలంలో “ఈశ్వరదర్శనం” ఉత్తమం.

Suresh Thota

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading