Download App

స్వదేశీ డ్రోన్ ‘శేష్ నాగ్’, ‘అబ్రామ్’ లతో సత్తా చాటుతున్న భారత్…

మార్చి 4, 2026 By Suresh Thota
భారత రక్షణ రంగం… స్వదేశీ డ్రోన్లతో సరి కొత్త పుంతలు తొక్కుతుంది… "శేష్‌నాగ్ 150" కామికాజే డ్రోన్, "అబ్రామ్" స్వార్మ్ డ్రోన్ల తో సైన్యం సరి కొత్త సామర్థ్యం పుణికి పుచ్చుకుంటున్నది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ సాంకేతికత కీలక ఆయుధంగా మారుతున్న నేపథ్యంలో భారతదేశం కూడా స్వదేశీ సాంకేతికతతో...
స్వదేశీ డ్రోన్ 'శేష్ నాగ్', 'అబ్రామ్' లతో సత్తా చాటుతున్న భారత్…

భారత రక్షణ రంగం… స్వదేశీ డ్రోన్లతో సరి కొత్త పుంతలు తొక్కుతుంది… “శేష్‌నాగ్ 150” కామికాజే డ్రోన్, “అబ్రామ్” స్వార్మ్ డ్రోన్ల తో సైన్యం సరి కొత్త సామర్థ్యం పుణికి పుచ్చుకుంటున్నది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ సాంకేతికత కీలక ఆయుధంగా మారుతున్న నేపథ్యంలో భారతదేశం కూడా స్వదేశీ సాంకేతికతతో డ్రోన్లపై దృష్టి పెంచుతోంది. మన దేశ స్టార్టప్ సంస్థలు రూపొందిస్తున్న కొత్త తరహా డ్రోన్ వ్యవస్థలు భవిష్యత్ యుద్ధ వ్యూహాలను పూర్తిగా మార్చే అవకాశముందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా “శేష్‌నాగ్ 150” కామికాజే డ్రోన్ మరియు “అబ్రామ్” స్వార్మ్ డ్రోన్లు భారత రక్షణ రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాయి.

శేష్‌నాగ్-150… దూర ప్రాంతాల్లో దాడులకు రూపొందించిన కామికాజే డ్రోన్ ను NSRT (NewSpace Research and Technologies) సంస్థ అభివృద్ధి చేసింది. ఇది ఒక అత్యాధునిక కామికాజే డ్రోన్. శత్రువుల ప్రాంతాల్లోకి రాడార్లకు దొరకకుండా, చొచ్చుకుపోయి కీలక లక్ష్యాలను ధ్వంసం చేయడానికి దీన్ని రూపొందించారు. ఈ డ్రోన్ ఒకసారి గాలిలోకి వెళ్లిన తర్వాత సుమారు ఐదు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ లక్ష్యాన్ని గుర్తించగలదు. దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉందని సమాచారం. అలాగే 25 నుంచి 40 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు.

శత్రువుల కమాండ్ సెంటర్లు, మందుగుండు డిపోలు, ఎయిర్‌ఫీల్డ్‌లు వంటి కీలక లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఈ డ్రోన్ ఉపయోగపడుతుంది. వేగం అధికారికంగా వెల్లడించకపోయినా, సాంకేతిక అంచనాల ప్రకారం ఇది గంటకు సుమారు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని నిపుణులు భావిస్తున్నారు. “శేష్‌నాగ్” డ్రోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు ఉన్నాయి. ఇవి లక్ష్యాన్ని స్వయంగా గుర్తించి దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా స్వార్మ్ టెక్నాలజీ ద్వారా అనేక డ్రోన్లు కలిసి పనిచేసి శత్రువుల రాడార్ వ్యవస్థలను తప్పుదోవ పట్టించగలవు.

ఈ డ్రోన్‌కు సంబంధించిన పరీక్షలు 2023 నుండి 2024 మధ్యకాలంలో అనేక సార్లు నిర్వహించారు. పోఖ్రాన్ ఎడారి ప్రాంతం మరియు లడఖ్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో దీని పనితీరును పరీక్షించారు. ప్రస్తుతం ఇది భారత సైన్యంలో ప్రయోగాత్మక దశలో ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది.

“అబ్రామ్” డ్రోన్లు(ABRAM) స్వార్మ్ దాడుల కోసం రూపొందించిన మినీ డ్రోన్లు… కామికాజే డ్రోన్లతో పాటు స్వార్మ్ డ్రోన్ వ్యవస్థలు కూడా ఆధునిక యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొచ్చి కేంద్రంగా పనిచేస్తున్న “అబ్రామ్” (Abhram Technologies) సంస్థ ఈ స్వార్మ్ డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. ఈ సంస్థ కేరళలోని కొచ్చి (Kochi) నగరం కేంద్రంగా చేసుకుని పనిచేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా వివిధ రకాల డ్రోన్లను తయారు చేయడం ఈ సంస్థ లక్ష్యం.

అభ్రమ్ టెక్నాలజీస్ తయారు చేసిన ఈ స్వార్మ్ డ్రోన్లు 2 కిలోల నుండి 4 వరకు పేలోడ్ మోసుకుని పొగలవు. ఈ డ్రోన్ నిఘా మరియు మ్యాపింగ్ పనులకు ఉపయోగపడుతుంది. అబ్రామ్ డ్రోన్ల ప్రధాన ప్రత్యేకత స్వార్మ్ టెక్నాలజీ. ఒకేసారి 50 నుంచి 100 డ్రోన్లు గుంపులుగా దాడి చేయగలవు. చిన్న పరిమాణం కారణంగా ఇవి శత్రువుల రాడార్లకు కనిపించడం చాలా కష్టం. ట్యాంకులు, బంకర్లు, కమ్యూనికేషన్ టవర్లు వంటి లక్ష్యాలను ధ్వంసం చేయడంలో ఇవి ప్రభావవంతంగా ఉంటాయి.

భారత సైన్యం భవిష్యత్ యుద్ధాల్లో “హైబ్రిడ్ స్వార్మ్” వ్యూహాన్ని ఉపయోగించాలనే ఆలోచనలో ఉంది. ఇందులో పెద్ద డ్రోన్లు ముందుగా వెళ్లి సమాచారం సేకరిస్తే, చిన్న స్వార్మ్ డ్రోన్లు లక్ష్యాలపై నేరుగా దాడి చేస్తాయి. ఈ విధానం ద్వారా శత్రువుల రక్షణ వ్యవస్థలను వేగంగా నిర్వీర్యం చేయవచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ క్షిపణులతో పోలిస్తే ఈ డ్రోన్ల తయారీ ఖర్చు చాలా తక్కువ. కొన్ని లక్షల రూపాయలతో తయారయ్యే డ్రోన్లు కోటి రూపాయల క్షిపణులు చేసే పనిని చేయగలవు. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ లతో యుద్ధ వ్యూహాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

మొత్తంగా, శేష్‌నాగ్-150 కామికాజే డ్రోన్ మరియు అబ్రామ్ స్వార్మ్ డ్రోన్లు భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు కొత్త బలం చేకూరుస్తున్నాయి. భవిష్యత్ యుద్ధాల్లో ఈ డ్రోన్లు కీలక పాత్ర పోషించే అవకాశముందని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading