Download App

రాయలు ఏలిన సీమలోకి…. రాయల్ ఎన్‌ఫీల్డ్

మే 8, 2026 By Suresh Thota
"రాయల్ ఎన్‌ఫీల్డ్"… ఇది కేవలం ఒక కర్మాగారం కాదు… దక్షిణ భారత పారిశ్రామిక రంగంలో కొన్ని నిర్ణయాలు బయటకు సాధారణ పెట్టుబడుల్లా కనిపిస్తాయి. కాని లోతుగా పరిశీలిస్తే అవి భవిష్యత్ ఆర్థిక,రాజకీయ మార్పులకు సంకేతాలుగా కనిపిస్తాయి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ "రాయల్ ఎన్‌ఫీల్డ్" (Royal Enfield)...
రాయలు ఏలిన సీమలోకి…. రాయల్ ఎన్‌ఫీల్డ్

“రాయల్ ఎన్‌ఫీల్డ్”… ఇది కేవలం ఒక కర్మాగారం కాదు… దక్షిణ భారత పారిశ్రామిక రంగంలో కొన్ని నిర్ణయాలు బయటకు సాధారణ పెట్టుబడుల్లా కనిపిస్తాయి. కాని లోతుగా పరిశీలిస్తే అవి భవిష్యత్ ఆర్థిక,రాజకీయ మార్పులకు సంకేతాలుగా కనిపిస్తాయి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ “రాయల్ ఎన్‌ఫీల్డ్” (Royal Enfield) ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తన కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం కూడా అలాంటి పరిణామమే.

ఇది కేవలం ఒక కంపెనీ కొత్త కర్మాగారం కథ కాదు. ఏపీ సీఎం”చంద్రబాబు నాయుడు” యొక్క కొత్త పారిశ్రామిక విధానం.

ఇది తమిళనాడు ఆధిపత్యానికి సవాల్ విసురుతున్న ఏపీగా భావించాలి. హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నిర్మించు కోవాలనుకుంటున్న, కొత్త ఆర్థిక,పారిశ్రామిక వ్యవస్థ. భారతదేశ పారిశ్రామిక తయారీ రంగం ఎప్పుడూ ఒకే ప్రాంతం లోకేంద్రీకృతమవకూడదు, అనే ఆలోచన వల్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ నిర్ణయం వల్ల అసలు ప్రాముఖ్యత తెలుస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో ఒక ద్విచక్ర వాహన తయారీ సంస్థ . 1955 తర్వాత భారతదేశంలో ఎన్‌ఫీల్డ్ ఇండియా కార్యకలాపాలు చెన్నై కేంద్రంగా అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం ఈ సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలోనే ఉంది. ఈ ద్విచక్ర వాహన సంస్థ, ఇప్పుడు తొలిసారి తమిళనాడు బయట భారీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం చిన్న విషయం కాదు. తమిళనాడు ఇప్పటికీ భారత ఆటోమొబైల్ రంగానికి ప్రధాన కేంద్రం. అనేక సంస్థలు అక్కడే బలంగా స్థిరపడ్డాయి. కాని చెన్నై పారిశ్రామిక ప్రాంతం లో ఇప్పుడు, భూమి ధరలు ఆకాశాన్ని తాకడం, పెరిగిన కార్మిక వ్యయం, రవాణా రంగ వాహనాల రద్దీ, నౌకాశ్రయాలపై ఒత్తిడి, పారిశ్రామిక కేంద్రీకరణ తో అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. పెద్ద సంస్థలు తమ ఉత్పత్తి పెంచుకోవడానికి విస్తరించాలి అంటే… ఒక దశ తర్వాత ఎక్కడకి విస్తరించాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. అదే పరిస్థితి ఇప్పుడు “రాయల్ ఎన్‌ఫీల్డ్” ముందుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ఎలా ఈ అవకాశాన్ని అందుకుంది అంటే, ప్రతి భారీ పెట్టుబడి వెనుక రాజకీయ చర్చలు, అధికార యంత్రాంగం, ప్రోత్సాహకాలు, రవాణా లెక్కలు, సరఫరా వ్యవస్థలపై విశ్లేషణలు ఉంటాయి. “ఆంధ్ర ప్రదేశ్” ప్రభుత్వం ఈ అవకాశాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది. తిరుపతి దగ్గర, సత్యవేడు మండలం లో 267 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాంతం ఎంపిక కావడం యాదృచ్ఛికం కాదు. వ్యూహాత్మక ప్రణాళిక ఉంది. ఎందుకంటే చెన్నైకి దగ్గర తమిళనాడు సరఫరా వ్యవస్థను కొనసాగించే అవకాశం
చెన్నై, కృష్ణపట్నం నౌకాశ్రయాల సౌలభ్యం, జాతీయ రహదారితో అనుసంధానం, విస్తారమైన భూముల లభ్యత, ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏపీ ఇచ్చే ప్రోత్సాహకాలు, మరియు ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాతావరణం సౌలభ్యం. ఇది పూర్తిగా ఆలోచించి తీసుకున్న పారిశ్రామిక వ్యూహం.

చంద్రబాబు పారిశ్రామిక వ్యూహం…

ఏపీ సీఎం చంద్రబాబు గురించి రాజకీయ విమర్శలు ఉండొచ్చు, కానీ ఒక విషయం మాత్రం నిజం ఆయన పాలనలో పెట్టుబడులకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది. ఆయన ఆలోచన ఎప్పుడూ అభివృద్ధి వైపే ఉంటుంది. రాష్ట్రానికి ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాల కోసం పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలంటే ప్రభుత్వం వేగంగా స్పందించాలి. అందుకే సంస్థల ప్రతినిధులతో ప్రత్యక్ష సమావేశాలు, వేగవంతమైన అనుమతులు, సింగిల్ విండో విధానం ద్వారా అనుమతి వ్యవస్థ, ప్రత్యేక రాయితీలు, భూముల సమీకరణ, వంటి విధానాల ద్వారా ఆయన ప్రభుత్వాలు పని చేస్తుంటాయి. కియా వంటి(Kia) సంస్థ అనంతపురానికి రావడం కూడా ఇలాంటి ప్రయత్నాల ఫలితమే. పెద్ద, పెద్ద సంస్థలు రాజకీయ వ్యవస్థ లను చూడవు. వాళ్లు “ప్రభుత్వాల స్థిరమైన నిర్ణయాలు” మాత్రమే చూస్తారు.

విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక భారీ ఆర్థిక లోటు ను ఎదుర్కొంటుంది. “తెలంగాణ”కు సమాచార సాంకేతిక రంగం, ఔషధ పరిశ్రమలు, సాఫ్టవేర్ తో అంతర్జాతీయ గుర్తింపు లభించగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం కొత్తగా తన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు ఏపీ రాష్ట్రం నౌకాశ్రయాలు, రవాణా కేంద్రాలు, ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలు, పారిశ్రామిక రంగం, వాహన తయారీ, వంటి రంగాలపై దృష్టి పెడుతోంది.

కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంస్థలు ఒక విషయం గ్రహించాయి. ఒకే ప్రాంతంపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం. ఒకే రాష్ట్రం, ఒకే నౌకాశ్రయం, ఒకే సరఫరా వ్యవస్థ మీద ఆధారపడితే వరదలు, సమ్మెలు, వ్యాధులు, రాజకీయ అంతరాయాలు వంటి కారణాలు మొత్తం ఉత్పత్తిని దెబ్బతీస్తాయి. అందుకే ఇప్పుడు సంస్థలు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో తయారీ కేంద్రాలు ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలు, విభిన్న పారిశ్రామిక ప్రాంతాలు వైపు వెళ్తున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా అదే చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ వెంటనే ఆటోమొబైల్ రాజధాని అయిపోదు. తమిళనాడు ఆధిపత్యం ఒక్కరోజులో కూలిపోదు, పారిశ్రామిక వాతావరణం ఏర్పడటానికి దశాబ్దాలు పడతాయి. తమిళనాడు ఈ స్థాయికి రావడానికి, స్థిరమైన విధానాలు, బలమైన సరఫరా వ్యవస్థ, సాంకేతిక విద్యాసంస్థలు, నౌకాశ్రయాలు, నైపుణ్యం కలిగిన కార్మికులు అన్నీ కలిసి పనిచేశాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు ఒక భారీ అవకాశం కనిపిస్తోంది అయితే, దాన్ని నిలబెట్టుకోవడమే అసలు పరీక్ష.

రాయలసీమకు ఇది మలుపు అవుతుందా…. రాయలసీమ గురించి దశాబ్దాలుగా వినిపిస్తున్న పదాలు…. కరవు, వర్గపోరాట రాజకీయాలు, వలసలు, నిరుద్యోగం, కానీ ఒక పెద్ద తయారీ సంస్థ రావడం అంటే ఆ ప్రాంతం కథనే మార్చే అవకాశం. “రాయల్ ఎన్‌ఫీల్డ్” తయారీ కేంద్రంతో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 9 లక్షల యూనిట్లు పెరగనుంది. అలాగే ప్రత్యక్ష, పరోక్షంగా దాదాపు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. పరోక్షంగా అనేకమంది కి ఉపాధి కలుగుతుంది. ఎందుకంటే ఒక పెద్ద కర్మాగారం ఒక్కటే రాదు. దాని వెంట అనుబంధ పరిశ్రమలు, గిడ్డంగులు, రవాణా కేంద్రాలు, చిన్న తయారీ యూనిట్లు, సాంకేతిక శిక్షణ కేంద్రాలు వంటివి వస్తాయి. అంటే ఒక పరిశ్రమ చుట్టూ మొత్తం ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ప్రారంభమవుతుంది.

చివరగా…

చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఉండి, స్థిరమైన ప్రభుత్వం ఉంటే…. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థలే కాదు, మరిన్ని ఆటోమొబైల్ కంపెనీలు వస్తాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌ కి ఒక శుభ పరిణామం. దక్షిణ భారత పారిశ్రామిక పటంలో కొత్త పోటీ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ తన ఆర్థిక భవిష్యత్తును తయారీ రంగంలో వెతుకుతోంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading