Download App

తెలుగు గర్వం అల్లూరి: బ్రిటిష్ గుండెల్లో నిద్రపోయిన మన్యం వీరుడు

మే 7, 2026 • By Suresh Thota
తెలుగు నేల మీద ఎందరో వీరులు పుట్టారు.. కానీ, తెల్లవాడి గుండెల్లో తాను నిద్రించి వారికి నిద్ర లేకుండా చేసిన మన్యం వీరుడు మాత్రం ఒక్కరే. ఆయనే అల్లూరి సీతారామరాజు. నేడు మే 7.. ఆ విప్లవ జ్యోతి దివి నుండి భువికేగిన రోజు, కోట్లాది మంది తెలుగువారి...
తెలుగు గర్వం అల్లూరి: బ్రిటిష్ గుండెల్లో నిద్రపోయిన మన్యం వీరుడు

తెలుగు నేల మీద ఎందరో వీరులు పుట్టారు.. కానీ, తెల్లవాడి గుండెల్లో తాను నిద్రించి వారికి నిద్ర లేకుండా చేసిన మన్యం వీరుడు మాత్రం ఒక్కరే. ఆయనే అల్లూరి సీతారామరాజు. నేడు మే 7.. ఆ విప్లవ జ్యోతి దివి నుండి భువికేగిన రోజు, కోట్లాది మంది తెలుగువారి రక్తం మరిగి, దేశభక్తితో కూడిన పౌరుషాగ్ని లావాలా పెల్లుబికి సెగలు కక్కిన రోజు. ఈ రోజు ఆ మహనీయుని స్మరిస్తూ… నివాళి అర్పిస్తూ… ఆయన చరిత్రని ఒకసారి సింహావలోకనం చేసుకుందాం.

అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4 న జన్మించారు. భారత స్వాతంత్ర్య చరిత్రలో ఈయన సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. 1924 మే 7 న, కేవలం 27 ఏళ్ళ వయసులోనే అందరిలో విప్లవ జ్యోతి వెలిగించి ఆయన అశువులు బాసారు. బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొని గడగడలాడించాడు.

గోదావరి గట్టున పుట్టి, మన్యం కొండల్లో గిరిజనుల కన్నీళ్లను తుడిచి, వారిని విప్లవ వీరులుగా మార్చిన ఘనత అల్లూరిది. ధనుర్బాణాలతో మొదలైన ఆయన ప్రస్థానం, బ్రిటిష్ వారి తుపాకులకు సవాలు విసిరింది. “దమ్మిడీ ఆదాయం లేని గిరిజనుడి మీద పన్ను వేస్తావా?” అని గర్జించిన ఆ గొంతుక, నేటికీ ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక.

​అల్లూరి సీతారామరాజు కేవలం ఒక స్వాతంత్ర్య యోధుడు మాత్రమే కాదు, నైతికత ఉన్న పోరాట యోధుడు. పోలీసు స్టేషన్లపై దాడులు చేసే ముందు.. “నేను వస్తున్నాను, సిద్ధంగా ఉండండి” అని లేఖ రాసి దాడి చేయడం ప్రపంచ చరిత్రలోనే చాలా అరుదు. ఆ తెగువ, దమ్ము సీతారామరాజు పౌరుషంలో ఉంది. దాడి చేసి రాగలను అనే నమ్మకంతో ముందే తెలియజెప్పడం లోనే ఆయన నిజాయితీ ఉంది.

“​అల్లూరి” అంటే కేవలం అక్షరం కాదు.. “ఆయుధం”.
“​అల్లూరి” అంటే భయం తెలియని… “సింహం”
“​అల్లూరి” అంటే బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన “మన్యం వీరుడు”.

​బ్రిటిష్ వారు మనల్ని బానిసలు అని పిలిచిన రోజుల్లో… మేము సింహాలం అని నిరూపించి గర్జించిన వీరుడు… మన తెలుగు వాడు. 27 ఏళ్ల చిన్న వయసులోనే దేశం కోసం, గిరిజనుల హక్కుల కోసం, తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఆ మహనీయుడు పుట్టింది మన తెలుగు గడ్డపైనే అని చెప్పుకోవడానికి ప్రతి తెలుగువాడి రక్తం ఉప్పొంగాలి.
​
ఆయనను చెట్టుకు కట్టేసి కాల్చినా, ఆయన కళ్లలో భయం చూడలేకపోయారు బ్రిటిష్ వారు. చనిపోయే క్షణంలో కూడా వందేమాతరం అన్న ఆ గొంతుక లో ధ్వని, ధైర్యంతో కూడిన ఆ సింహ గర్జన… ప్రతి తెలుగు వాడి చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

​ముగింపు: తెలుగు జాతి కీర్తి కిరీటంలో అల్లూరి ఒక వజ్రం. ఆయన చూపిన పోరాట పటిమ, అన్యాయంపై ఎదిరించే తెగువ, ధైర్యం మనందరిలో స్ఫూర్తిని నింపాలి. ఆ మన్యం వీరుడు… ప్రతి తెలుగు వాడికి సదా స్మరణీయుడు… ఆయన త్యాగం వృథా పోదు. ఈ నేల ఉన్నంత వరకు, తెలుగు భాష బ్రతికున్నంత వరకు… “అల్లూరి” అన్న పేరు ఒక నిప్పు కణికలా వెలుగుతూనే ఉంటుంది. ఆ వీరుడి కి అక్షర నివాళి అర్పిస్తూ…

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading