Download App

మానవ సేవనే మాధవ సేవగా… టీటీడీ బోర్డు నిర్ణయాలు…

మే 7, 2026 • By Suresh Thota
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం "తిరుమల తిరుపతి దేవస్థానం" (టీటీడీ), తన నూతన ధర్మకర్తల మండలి సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన ఈ భేటీలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు నేతృత్వంలోని బోర్డు, కేవలం ఆలయ నిర్వహణకే పరిమితం కాకుండా.. విద్య, వైద్యం, మరియు...
మానవ సేవనే మాధవ సేవగా… టీటీడీ బోర్డు నిర్ణయాలు…

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం “తిరుమల తిరుపతి దేవస్థానం” (టీటీడీ), తన నూతన ధర్మకర్తల మండలి సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన ఈ భేటీలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు నేతృత్వంలోని బోర్డు, కేవలం ఆలయ నిర్వహణకే పరిమితం కాకుండా.. విద్య, వైద్యం, మరియు సనాతన ధర్మ ప్రచారానికి పెద్దపీట వేసింది.
​
సామాన్య భక్తుల ప్రయోజనమే పరమావధిగా టీటీడీ పలు నిర్ణయాలను ప్రకటించింది. వాటిలో ముఖ్యంగా, “సర్వదర్శనం” క్యూలైన్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అదనపు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే అలిపిరి వద్ద బస్సుల తనిఖీ కోసం శాశ్వత షెల్టర్లను నిర్మించనున్నారు. భక్తుల ఆధ్యాత్మిక భావం పెంపొందేలా, ​తిరుమలలోని రోడ్లు, సర్కిళ్లకు భక్తిభావం ఉట్టిపడేలా ఆధ్యాత్మిక పేర్లను నామకరణం చేయనున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా “గోగర్భం” డ్యామ్ నుండి అదనపు నీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది.

పరిపాలనలో పారదర్శకత, వేగం , సౌలభ్యత పెంచేందుకు తిరుమల లోని అన్ని కార్యాలయాలను ఒకే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లోకి మార్చనున్నారు. “టీటీడీ” కేవలం ఆధ్యాత్మిక సంస్థే కాదు, ఒక గొప్ప సామాజిక బాధ్యత గల సంస్థ అని ఈ నిర్ణయాలు చాటిచెబుతున్నాయి. టీటీడీ పరిధిలోని “విద్యాసంస్థల”కు భారీగా నిధులు కేటాయించి, కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులను కల్పించనున్నారు. అంతేగాకుండా వినికిడి లోపం ఉన్న 150 మంది చిన్నారులకు ఉచితంగా వినికిడి యంత్రాలను పంపిణీ చేయాలనే నిర్ణయం అభినందనీయం. అలాగే ఉద్యోగుల హెల్త్ స్కీమ్ రీయింబర్స్‌మెంట్ పరిమితిని కూడా పెంచారు.

కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను గౌరవిస్తూ, శ్రీవారి దర్శనం మరియు లడ్డూ కార్డులును మంజూరు చేసింది. ​దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని విస్తరించడంలో, అనేక నిర్మాణ పనులకు ఆమోద ముద్ర వేసింది. ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి, లేపాక్షిలో కొత్త కల్యాణ మండపానికి బోర్డు పచ్చజెండా ఊపింది. అమరావతి (వెంకటపాలెం) లో మహారాజగోపురంతో సహా భారీ నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది.

కోయంబత్తూరులో 19.43 ఎకరాల భూమి టీటీడీలో విలీనం కావడంతో పాటు, నవీ ముంబై మరియు ముంబైలోని పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులకు వేగం పెంచనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల నిర్వహణ కోసం ఇచ్చే నిధిని ₹5,000 నుండి ₹10,000కు రెట్టింపు చేయడం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు గట్టి పునాది వేశారు.

చిన్నారుల్లో ఆధ్యాత్మిక విలువలు మరియు మన సంస్కృతి పెంపొందించేందుకు ఉచిత “అక్షర గోవిందం” కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రముఖ గాయని డా. “శోభారాజు”ను టీటీడీ ఆస్థాన విద్వాన్‌గా నియమించడం ద్వారా శాస్త్రీయ సంగీతానికి అరుదైన గౌరవం దక్కినట్టు అయింది. భక్తుల కొరకు “​శాశ్వత యాగశాల” ను అలిపిరి వద్ద నిర్మాణం కావిస్తున్నారు. దీని వలన స్వామి వారి చెంత హోమం చేయించుకున్నాము అనే సంతృప్తి భక్తులకు కలుగుతుంది. వారి ఆధ్యాత్మిక కాంక్షను నెరవేర్చినట్టు అవుతుంది.

​ముగింపు: మొత్తంగా చూస్తే, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు భక్తుల సౌకర్యాలు, ఆధ్యాత్మిక వికాసం మరియు సామాజిక శ్రేయస్సు పెంపొందేలా నిర్ణయాలు ఉన్నాయి. ఇటువంటి నిర్ణయాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా హిందూ మతం చాటి చెప్పే శాంతి మంత్రం “సర్వజనా సుఖినోభవంతు” నలు చెరుగులా వ్యాపిస్తుంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading