వార్తలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు… కేంద్ర ప్రభుత్వం ప్రకటన

Published by
Suresh Thota

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలు కేవలం వాహనదారుల ఖర్చులకు సంబంధించినవి మాత్రమే కాదు. అవి దేశ ఆర్థిక గమనాన్ని, ద్రవ్యోల్బణాన్ని మరియు సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను శాసించే కీలక శక్తులు. ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు పెరుగుతాయనే ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ఇంధన కొరత అనే పుకార్లు వ్యాపిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టత నిచ్చింది.

​పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ “సుజాత శర్మ” మాట్లాడుతూ ఈ విధంగా భరోసాను ఇచ్చారు. “పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ భారత్‌కు ఇంధన సరఫరాలో లోటు లేదు. తగినంత నిల్వలు ఉన్నాయి. ధరల పెంపు ఆలోచన లేదు, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు”. అని ఆమె కేంద్ర ప్రభుత్వం తరపున అధికారికంగా ప్రకటించించారు.

ప్రభుత్వ ప్రకటనను మనం మూడు ప్రధాన కోణాల్లో విశ్లేషించవచ్చు.

​1. “భౌగోళిక రాజకీయ వ్యూహం” (Geopolitical Strategy) ​పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ఉద్రిక్తత నేపద్యంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు అస్థిరంగా ఉంటున్నాయి. అయితే, భారత్ గత కొంతకాలంగా తన ఇంధన వనరులను వైవిధ్యీకరిస్తోంది (Diversification). రష్యా నుండి రాయితీ పై చమురు దిగుమతులు పెంచుకోవడం, వ్యూహాత్మక చమురు నిల్వలను (Strategic Petroleum Reserves) ఏర్పాటు చేసుకోవడం వల్ల తక్షణ ధరల పెరుగుదల నుండి దేశాన్ని రక్షించుకునే “బఫర్” ప్రభుత్వం వద్ద ఉంది.

​2. “ఎన్నికలు మరియు ప్రజాభిప్రాయం” (Electoral Economics) ​రాజకీయ కోణంలో చూస్తే, ఎన్నికల తర్వాత ధరలు పెంచడం అనేది ఒక అనవాయితీగా వస్తోంది. కాని ప్రభుత్వం ఈసారి ముందే ఖండించడం గమనార్హం. ధరలు పెంచితే అది కేవలం రవాణా చార్జీలనే కాకుండా, పప్పులు, కూరగాయల ధరలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది సామాన్యుడి మీద ఆర్థిక భారం పెరిగి ప్రభుత్వానికి, ప్రతికూలత ఏర్పడుతుంది. అందుకే ఆర్థిక ప్రయోజనాల కంటే రాజకీయ స్థిరత్వానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

​3. “ఆయిల్ కంపెనీల ఆర్థిక స్థితి” (Under recoveries)​. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు ఇక్కడ ధరలు పెంచకపోతే, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (HPCL, BPCL, IOCL) నష్టాలను చవిచూస్తాయి ఇది అందరికీ తెలిసినదే, ప్రభుత్వం తన బడ్జెట్ ద్వారా ఈ నష్టాలను భర్తీ చేస్తుందా లేక ముడి చమురు ధరలు తగ్గే వరకు వేచి చూస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మొన్నటి వరకు రష్యా నుండి డిస్కౌంట్ రేట్ల తో చమురు కొన్నందుకు, ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు లాభాల్లో ఉన్నందున, కొంతకాలం పాటు ధరలను పెంచకుండా ఉండే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది.

​ప్రస్తుతానికి ప్రభుత్వం “పెంచము” అని చెప్పడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. అయితే, దీనిని మనం శాశ్వత హామీగా తీసుకోలేము. వచ్చే కొన్ని నెలల వరకు ధరలు స్థిరంగా ఉండే అవకాశం 90% వరకు ఉంది. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర 100 డాలర్లు దాటి ఎక్కువ రోజులు అదే రేట్ లో కొనసాగితే, ప్రభుత్వం కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్లవచ్చు. అప్పుడు ధరలు పెంచక తప్పని పరిస్థితి రావచ్చు.

ప్రభుత్వ ప్రకటన ప్రజలకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే, సామాన్యులుగా మనం ఇంధన పొదుపు మరియు ప్రత్యామ్నాయ ఇంధనాల (EV, CNG) వైపు దృష్టి సారించడం అవసరం. ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకుంటే అది దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా మధ్యతరగతి వర్గానికి పెద్ద ఊరట అవుతుంది.

ముగింపు: ఆయిల్ సరఫరాలో అంతరాయం వచ్చినప్పుడు దేశం తట్టుకునేందుకు ముందుగా నిల్వ ఉంచిన క్రూడ్ ఆయిల్‌ (Strategic Petroleum Reserve) పుష్కలంగా ఉంది. కాని దేశ ప్రజలు కూడా కొంత పొదుపు పాటించడం ఉత్తమం. ఆవిధంగా మనం కూడా దేశాన్ని ఒత్తిడి కి లోను కాకుండా చూడవచ్చు. “స్వామి వివేకానంద” ఒక మాట చెప్పేవారు… “మిమ్మల్ని మీరు మార్చుకోండి, ప్రపంచం తనంతట తానే మారుతుంది” అని… అలాగే మనం ఇంధన పొదుపు పాటిస్తే ఇటువంటి సమయాల్లో అది దేశ ఆర్థిక వ్యవస్థ ను పరిపుష్టం చేస్తుంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.