Download App

భోజశాల విషయంలో హైకోర్టు తీర్పు గాక… రాజా భోజరాజు వచ్చి చెప్పాలా…?

మే 18, 2026 By Suresh Thota
మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ భోజశాల-కమల్ మౌలా మసీదు వివాదంపై వెలువరించిన చారిత్రాత్మక తీర్పు భారతదేశ న్యాయ, సాంస్కృతిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ తీర్పు కేవలం ఒక భూ వివాద పరిష్కారంగా కాకుండా… కాలగర్భంలో కలిసిపోయిన ఒక అద్భుత విద్యాలయ సముదాయం గా, శతాబ్దాల...
భోజశాల విషయంలో హైకోర్టు తీర్పు గాక... రాజా భోజరాజు వచ్చి చెప్పాలా...?

మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ భోజశాల-కమల్ మౌలా మసీదు వివాదంపై వెలువరించిన చారిత్రాత్మక తీర్పు భారతదేశ న్యాయ, సాంస్కృతిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ తీర్పు కేవలం ఒక భూ వివాద పరిష్కారంగా కాకుండా… కాలగర్భంలో కలిసిపోయిన ఒక అద్భుత విద్యాలయ సముదాయం గా, శతాబ్దాల దాడుల గాయాలకు మరియు ఆధునిక శాస్త్రీయ ఆధారాల ప్రాతిపదికన పునర్వైభవాన్ని సంతరించుకుంటున్న సనాతన సంస్కృతికి అద్దం పడుతోంది. నమ్మకాలు, కంటే భౌతిక, పురావస్తు ఆధారాలే పరమావధిగా సాగిన 98 రోజుల “ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా” (ASI) పరిశోధనలే ఈ తీర్పునకు గట్టి పునాదిగా నిలిచాయి.

ఈ వివాదం యొక్క పుట్టుపూర్వోత్తరాలను అర్థం చేసుకోవాలంటే మనం వెయ్యేళ్ల క్రితం నాటి మాల్వా సామ్రాజ్య వైభవంలోకి వెళ్లాల్సి ఉంటుంది. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో (1010-1055) ధార్ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరమార వంశానికి చెందిన సుప్రసిద్ధ చక్రవర్తి రాజా భోజుడు పాలించారు. ఆయన రాజు మాత్రమే కాదు, స్వయంగా కవి, తత్వవేత్త, వాస్తుశిల్ప నిపుణుడు. విద్య, సాహిత్యం, కళల పట్ల అమితాసక్తి కలవాడు. అందుచేత ఆయన క్రీ.శ. 1034 సంవత్సరం లో “ధార్” నగరంలో ఒక మహోన్నతమైన విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. సకల విద్యా ప్రదాయిని అయిన వాగ్దేవి (సరస్వతీ దేవి) ఆరాధనతో పాటు సంస్కృత భాషా అభ్యాసం కొరకు, పండితుల వేద, తర్క, శాస్త్ర చర్చలకు ఇది కేంద్రంగా విలసిల్లింది. అందుకే ఈ సముదాయానికి ‘భోజశాల’ అని పేరు స్థిరపడింది.

అయితే, 14వ శతాబ్దం నాటికి భారతదేశంపై ముస్లిం దండయాత్రల నీడలు మాల్వా సామ్రాజ్యాన్ని కూడా తాకాయి. క్రీ.శ. 1305లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనలు ధార్ నగరంపై దాడి చేసి భోజశాలను పాక్షికంగా ధ్వంసం చేశాయి. ఆ తర్వాతి శతాబ్దంలో అంటే 1401లో దిలావర్ ఖాన్ ఘోరీ, ఆపై 1514లో మహమూద్ షా ఖిల్జీ కాలంలో ఈ ఆలయ అవశేషాలపైనే కమల్ మౌలా మసీదు నిర్మాణ ప్రక్రియ పూర్తయింది. హిందూ పక్షం వాదనల ప్రకారం, ఆలయానికి చెందిన స్తంభాలను, చెక్కడాలను, గోడలను అలాగే ఉంచి, ఇస్లామిక్ శైలి గుమ్మటాలు మరియు మిహ్రాబ్‌లను జోడించి దీనిని ప్రార్థనా స్థలంగా మార్చారు. నాటి నుండి ఈ కట్టడం భోజశాల-కమల్ మౌలా మసీదుగా, రెండు రకాలుగా పేరు పొందింది.

బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. 1875లో ఈ సముదాయ ప్రాంగణంలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అద్భుతమైన కాంతివంతమైన తెల్లని శిల్ప రూపంలో ఉన్న వాగ్దేవి (సరస్వతి) విగ్రహం బయటపడింది. అప్పటి బ్రిటిష్ అధికారి మేజర్ జనరల్ “విలియం కిన్‌కైడ్” ఈ విగ్రహ విశిష్టతను గుర్తించి, దానిని తన వ్యక్తిగత సేకరణగా లండన్‌కు తరలించారు. 1909 నుండి ఈ విగ్రహం లండన్‌లోని ప్రసిద్ధ బ్రిటిష్ మ్యూజియంలో శోభాయమానంగా ఉండిపోయింది.

భోజశాల విషయంలో హైకోర్టు తీర్పు గాక... రాజా భోజరాజు వచ్చి చెప్పాలా...?

విచిత్రమేమిటంటే, ఆ విగ్రహం పీఠంపై దేవునాగరి లిపిలో చెక్కబడినది సంస్కృత శాసనమే, “రాజా భోజుడి” కాలంలో వరరుచి అనే అధికారి ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని, ఇది సరస్వతి రూపమేనని వేల మైళ్ల దూరం నుండి నేటికీ సాక్ష్యం చెప్తోంది. స్వాతంత్ర్యానంతరం ఈ స్థలం యాజమాన్యం మరియు పూజా హక్కులపై వివాదం తీవ్రరూపం దాల్చింది. 1951 లో కేంద్ర పురావస్తు శాఖ (ASI) దీనిని రక్షిత కట్టడంగా ప్రకటించి తమ అధీనంలోకి తీసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వం 2003 లో పురావస్తు శాఖ (ASI) ద్వారా ఒక మధ్యంతర రాజీ సూత్రాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వారంలో ప్రతి మంగళవారం హిందువులు లోపలికి వెళ్లి పూజలు, హారతులు నిర్వహించుకోవచ్చు, ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చదువుకోవచ్చు. మిగిలిన రోజుల్లో పర్యాటకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే, ఏటా వచ్చే “వసంత పంచమి” పర్వదినం శుక్రవారం వచ్చినప్పుడు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకునేవి, దాని వలన శాశ్వత పరిష్కారం కావాలనే భావన బలపడింది.

ఈ నేపథ్యంలోనే హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ 2022లో మధ్యప్రదేశ్ “హైకోర్టు” ను ఆశ్రయించింది. ఈ సముదాయం వందల ఏళ్ల ముందే నిర్మించబడిన హిందూ దేవాలయమని, ముస్లింల నమాజ్ హక్కులను రద్దు చేసి పూర్తి హక్కులు హిందువులకే ఇవ్వాలని కోరింది. కోర్టు ఆదేశాల మేరకు 2024 మార్చిలో పురావస్తు శాఖ (ASI) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR), కార్బన్ డేటింగ్ మరియు లేజర్ స్కానింగ్ ఉపయోగించి 98 రోజుల పాటు సమగ్ర శాస్త్రీయ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మసీదు గోడల కింద, స్తంభాలపై సంస్కృత శ్లోకాలు, సనాతన దేవతామూర్తుల చిత్రాలు, హనుమంతుని శిల్పాలు స్పష్టంగా వెలుగుచూశాయి. ఈ పురావస్తు ఆధారాలే కేసు గమనాన్ని మార్చేశాయి.

ఇండోర్ హైకోర్టు బెంచ్ వెలువరించిన 242 పేజీల సుదీర్ఘ తీర్పు ఈ చారిత్రక ఆధారాలనే ప్రామాణికంగా తీసుకుంది. గతంలో అమల్లో ఉన్న మంగళవారం పూజ – శుక్రవారం నమాజ్ అనే ద్వంద్వ విధానాన్ని రద్దు చేస్తూ, భోజశాల సంపూర్ణంగా హిందూ దేవాలయంగా ప్రకటించింది. అక్కడ హిందువులు నిరంతరం పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేస్తూ, ముస్లిం వర్గానికి ప్రార్థనల కొరకు “ధార్” జిల్లాలోనే ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

లండన్ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న అసలు “వాగ్దేవి” విగ్రహాన్ని దౌత్యపరమైన మార్గాల ద్వారా భారతదేశానికి రప్పించి, ఇక్కడే పునఃప్రతిష్ఠించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, సూచనలు చేసింది. ​ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సమాజం, పిటిషనర్లు దీనిని చారిత్రక న్యాయంగా, సాంస్కృతిక పునరుజ్జీవనంగా అభివర్ణిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవైపు, AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరియు ముస్లిం పక్షాలు ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 1991 నాటి ‘ఆరాధనా స్థలాల చట్టాన్ని’ (Places of Worship Act) కోర్టు ఉల్లంఘించిందని, కేవలం నమ్మకాల ఆధారంగా తీర్పు ఇచ్చారని ఆరోపిస్తూ సుప్రసిద్ధమైన “మౌలానా కమలుద్దీన్ సొసైటీ” ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది. ఏదేమైనా, ఒకప్పటి అఖండ విద్యా పీఠమైన భోజశాల చుట్టూ ముసిరిన వివాదం ఆధునిక చట్టాలు, శాస్త్రీయ పరిశోధనల నడుమ భారతీయ న్యాయవ్యవస్థకు ఒక అగ్నిపరీక్షగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

చరిత్రలో పూర్వపు పాలకులు, రాజులు లేదా ప్రభుత్వాలు చేసిన తప్పులకు ఆధునిక కాలంలో ఆయా దేశాలు అధికారికంగా క్షమాపణలు చెప్పిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఈ క్షమాపణలు చారిత్రక గాయాలను మాన్పడానికి మరియు భవిష్యత్తు తరాల కోసం సయోధ్యకు మార్గం సుగమం చేశాయి. అటువంటి ప్రముఖ సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే….

1) ఆధునిక కాలంలో కేథలిక్ చర్చి ప్రతినిధులు, వివిధ దేశాలలో స్థానిక ప్రజలను మత మార్పిడిల కోసం హింసించిన చారిత్రక తప్పులకు పోప్ ఫ్రాన్సిస్ తో సహా పలువురు పోపులు పలుమార్లు క్షమాపణలు కోరారు.

2) 2021లో జర్మనీ దేశం తన పూర్వపు వలస పాలన కాలంలో నమీబియాలో హెరెరొ, నామా (Herero and Nama) తెగల ప్రజలపై జరిపిన మారణహోమానికి అధికారికంగా క్షమాపణలు చెప్పింది.

3) నెదర్లాండ్స్ (బానిసత్వంపై క్షమాపణ) డచ్ ప్రభుత్వం 2022లో, శతాబ్దాల పాటు కొనసాగిన బానిసత్వ వ్యవస్థలో డచ్ రాజ్యానికి ఉన్న పాత్రకు క్షమాపణలు వేడుకుంది.

4) అమెరికా ప్రభుత్వం 1993లో తీర్మానం చేసి, 1893లో హవాయి రాజ్యాన్ని (Kingdom of Hawaii) కూల్చివేయడానికి తన పూర్వ నాయకులు కారణమని క్షమాపణలు చెప్పింది. అలాగే, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపనీస్-అమెరికన్లను నిర్బంధ శిబిరాల్లో ఉంచినందుకు 1988లో క్షమాపణలు చెప్పింది.

ముగింపు:

అలాగే ఇక్కడ హిందూ సంస్కృతి మీద కొన్ని శతాబ్దాలు పాటు దాడులు జరిగినా…. క్షమాపణలు చెప్పడం మాట దేవుడెరుగు…. కొన్ని వర్గాలు హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వెళతాం అనేవారే తప్ప… ఇక్కడ జరిగిన దాడులకు మౌనసాక్ష్యాలు గా ఉన్న ఆధారాలను పట్టించుకోకుండా…. యువతను రెచ్చగొట్టి తమ రాజకీయ వ్యాఖ్యల ద్వారా దేశాన్ని రావణకాష్టంగా చేస్తున్న కొన్ని వర్గాల నాయకుల బుద్ధి మార్చేదెవ్వరు..

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading